ఏకపక్షంగా రీ సర్వే..

ABN , First Publish Date - 2022-11-16T02:15:54+05:30 IST

వందేళ్ల తర్వాత వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, శాశ్వత భూ రక్షణ పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో భూ కొలతల్లో భారీగా తేడాలు వస్తున్నాయన్న సమాచారం రైతుల్లో ఆందోళనకు కారణమౌతోంది.

ఏకపక్షంగా రీ సర్వే..

సమగ్ర భూ సర్వే ఫైనల్‌ నోటిఫికేషన్‌ వెలువరించబోతున్న తరుణంలో.. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసెడ్యూర్‌ (ఎస్‌ఓపీ)తో సంబంధం లేకుండా రైతులను ప్రత్యక్ష భాగస్వాములు చేయకుండా రెవెన్యూ, సర్వే అధికారులు ఏకపక్షంగా వ్యవహరించటం వివాదాలకు కారణమౌతోంది. భూముల కొలతల్లో విస్తీర్ణం తగ్గుదలకు సంబంధించిన సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. ఫైనల్‌ నోటిఫికేషన్‌కు ముందు సర్వే వివరాలను బహిర్గత పరచకపోవటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వందేళ్ల తర్వాత వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, శాశ్వత భూ రక్షణ పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో భూ కొలతల్లో భారీగా తేడాలు వస్తున్నాయన్న సమాచారం రైతుల్లో ఆందోళనకు కారణమౌతోంది. సమగ్ర రీ సర్వే జరపటానికి ప్రభుత్వం ఒక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసెడ్యూర్‌ (ఎస్‌ఓపీ) ని రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఈ ఎస్‌ఓపీకి అనుగుణంగా సర్వే జరగకపోవటం ఆందోళన కలిగిస్తోంది. పాత్‌ ఆర్‌ఎస్‌ఆర్‌, వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎస్‌ఆర్‌, అడంగల్‌, 1 - బీ డేటాలను సమగ్రంగా పరిశీలించిన మీదట భూముల స్వచ్ఛీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్న విషయాన్ని భూ యజమానులకు తెలిసే విధంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంది. భూ యజమానులకు ప్రత్యేకంగా నోటీసుల ద్వారా తెలియపరచాలి. ఇలా తెలియపరచటానికి వలంటీర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు స్డాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసెడ్యూర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం రీ సర్వే నిర్వహించాలని పదే పదే నిర్దేశిస్తున్నా... దీన్ని మొక్కుబడిగా జరిపించారు. భూముల స్వచ్ఛీకరణ కూడా రైతుల సమక్షంలో జరగాలి. అదీ సరిగ్గా జరగలేదు. రైతులకు తెలియపరచకుండా స్వచ్ఛీకరణ డేటాను ఆర్‌డీ ఓలకు పంపారు. ఆర్డీవోల స్థాయిలో క్వాలిటీ పరిశీలన జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే గ్రామ సరిహద్దులు నిర్ణయించి సర్వే రాళ్లను పాతాలి. గ్రామ కంఠం, నివాస ప్రాంతాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గుర్తించిన సమాచారాన్ని సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత డ్రోన్ల ద్వారా శాటిలైట్‌ సహకారంతో గ్రామ మ్యాప్‌ను ఫొటో తీస్తారు. డ్రోన్‌ క్యాప్చరింగ్‌ సమాచారాన్ని కూడా సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపించాల్సి ఉంటుంది. ఈ రెండింటి డేటా ఆధారంగా సర్వే ఆఫ్‌ ఇండియా 50, 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా టైల్‌ - 1, టైల్‌ - 2 , టైల్‌ - 3 లుగా జియోగ్రాఫికల్‌ మ్యాప్‌లను తయారు చేసి సర్వేశాఖకు పంపుతుంది. సర్వే ఆఫ్‌ ఇండియా రూపొందించిన గ్రౌండ్‌ ట్రూతింగ్‌ డేడాను ‘రోవర్‌ ’ ద్వారా పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలకు సంబంధించి ముందస్తుగా రైతులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. భూముల స్వచ్చీకరణ, ఓఆర్‌ఐ హార్డ్‌ కాపీలను మండల స్థాయి బృందాలు పరిశీలించిన తర్వాత వ్యత్యాసాలను ఫాం - 16, 25, 26 లలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసిన డేటాను ఆర్డీవో ర్యాండమ్‌ చెక్‌ చేసి ఫామ్‌ - 12, 27, 28 లలో నమోదు చేయాల్సి ఉంటుంది. తదనంతరం ల్యాండ్‌ పార్శిల్స్‌ విస్తీర్ణం, సర్వే నెంబర్‌, సబ్‌ డివిజన్‌ ప్రాతిపదికన డేటా తయారు చేయాల్సి ఉంటుంది. దీనిని గోల్డ్‌ డాక్యుమెంట్‌ అంటారు.

మొబైల్‌ మండల మేజిస్ర్టేట్‌ టీమ్స్‌ ఎక్కడ ?

రీసర్వే డ్రాఫ్ట్‌ రికార్డులు తయారు చేసిన తర్వాత క్వాలిటీ చెక్‌ చేసిన మీదట చివర్లో సెక్షన్‌ 9(2) ప్రకారం ఫామ్‌ - 42, సెక్షన్‌ 10(2) ప్రకారం ఫామ్‌ - 43 ద్వారా భూ యజమానులకు వారు తీసుకున్న నిర్ణయాలను విధిగా తెలియపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ సెక్షన్ల కింద వచ్చిన అభ్యంతరాలను మొబైల్‌ మండల మేజిస్ర్టేట్‌ టీమ్స్‌కు అప్పగించి 21 రోజుల్లో అభ్యంతరాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాతే సెక్షన్‌ - 13 ఎస్‌బీ యాక్ట్‌ కింద ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇస్తారు. అసలు రెండు జిల్లాల్లో మొబైల్‌ మండల మేజిస్ర్టేటు టీమ్స్‌ ఏర్పాటు గురించి భూ యజమానులకు సమాచారమే లేదు. ఈ మొబైల్‌ మేజిస్ర్టేటు టీమ్‌లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారా? డివిజినల్‌ స్థాయిలో ఏర్పాటు చేశారా? మండల స్థాయిలో ఏర్పాటు చేశారా? అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. సింహభాగం రైతులకు తమ భూముల పరిస్థితి ఏమిటో తెలియకపోవటం వల్ల ఫైనల్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఫైనల్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత అభ్యంతరాలుంటే.. న్యాయస్థానాల్లో సివిల్‌ సూట్ల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

పామర్రు మండలంలో రైతుల మండిపాటు

పామర్రు : రీసర్వే కోసం పామర్రు మండలంలో గుర్తించిన గ్రామాల్లో రైతులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేశారు. ఇటీవల జరుగుతున్న పంట నమోదు ప్రక్రియలో భాగంగా సచివాలయాలకు వచ్చిన రైతులకు మీ భూమి విస్తీర్ణం తగ్గిందని చెప్పడంతో రైతులు అవాక్కవుతున్నారు. తమకు తెలియకుండానే భూములు ఎలా రీసర్వే చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రీసర్వే పూర్తి చేసినట్లుగా రైతుల నుంచి సంతకాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

భూముల వివరాలు కనిపించని వైనం

రీసర్వేలో కొత్త చిక్కులు వెలుగులోకి వస్తున్నాయి. దస్తా వేజులు లేకుండా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల్లో మరికొన్ని సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ఆర్‌ఓఆర్‌ వెబ్‌ల్యాండ్‌లో సర్వే నంబరుకు, విస్తీర్ణానికి హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయి. పూర్వీకుల నుంచి వచ్చిన దస్తావేజులు సక్రమంగా లేకపోవడంతో వారి విస్తీర్ణం స్పష్టంగా నిర్దారణ కావడంలేదు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా తామేమి చేయలేమని సిబ్బంది చెతులెత్తేస్తుండటంతో రైతులు ఆగ్రహిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే పూర్తి

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే మండలంలో అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ నూరు శాతం డ్రోన్‌ ద్వారా పూర్తి చేశాం. దాని నిమిత్తం అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాం. డ్రోన్ల ద్వారా వచ్చిన ఛాయ చిత్రాలు, రోవర్లతో భూముల యథాస్థితి గుర్తించాం. దానికి అనుగుణంగానే కొత్త భూ రికార్డులు రూపుదిద్దుకుంటున్నాయి.

- లీలాప్రసాద్‌, డివిజనల్‌ సర్వేయర్‌

Updated Date - 2022-11-16T02:15:55+05:30 IST