‘నూతన’ యాతన!

ABN , First Publish Date - 2022-09-18T05:04:51+05:30 IST

తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసుకు ఒక స్టేడియంలో క్రీడా అసోసియేషన్లకు కేటాయించిన గదులను ఇచ్చి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు.

‘నూతన’ యాతన!
తహసీల్దార్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన నందిగామ ఆర్డీవో కార్యాలయం

కొత్తగా ఏర్పడిన ఆర్డీవో కార్యాలయాల్లో అన్నీ అవస్థలే

 పనిచేయగల వాతావరణం లేనిచోట కొత్త కార్యాలయాలు 

స్టేడియాలు, మార్కెట్‌ యార్డులు, తహసీల్దార్‌ ఆఫీసుల్లో ఏర్పాటు 

సిబ్బంది లేకుండా విధులు.. సంక్లిష్టంగా పరిపాలన 

ఆర్డీవోలకు జీతాలు లేవు.. ప్రొటోకాల్‌ బండ మోత 

తిరువూరు రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసుకు ఒక స్టేడియంలో క్రీడా అసోసియేషన్లకు కేటాయించిన గదులను ఇచ్చి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. నందిగామ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి మమ అనిపించేశారు. ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయాన్ని పక్కనే ఉన్న మరో పాత భవనాన్ని రీ మోడలింగ్‌ చేసి అందులోకి మార్చారు. తహసీల్దార్‌ కార్యాలయ అవసరాలే సరిపోని భవనంలో ఏకంగా ఆర్డీవో కార్యాలయాన్నే కుక్కారు. 

విజయవాడ డివిజన్‌ నుంచి నందిగామ డివిజన్‌ కొత్తగా ఏర్పడింది. విజయవాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం నుంచి తగినంత సిబ్బందిని నందిగామకు కేటాయించలేదు. తిరువూరు డివిజన్‌ది మరో సమస్య. నూజివీడు రెవెన్యూ డివిజన్‌ ఏలూరు జిల్లాకు వెళ్లింది. నూజివీడులో మరికొంత మంది సిబ్బంది కృష్ణా జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌కు వచ్చారు. నూజివీడు డివిజన్‌ నుంచి తిరువూరు, ఉయ్యూరు డివిజన్లకు సర్దుబాటు చేయటం వల్ల సిబ్బంది సమస్య ఏర్పడింది. కొత్తగా భర్తీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర సిబ్బందితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కొత్తగా ఏర్పడిన ఆర్డీవో కార్యాలయాలకు ఆఫీసు సబార్డినేట్లను నేటికీ కల్పించకపోవటం గమనార్హం. 

(ఆంరఽధజ్యోతి, విజయవాడ / నందిగామ / తిరువూరు / ఉయ్యూరు): పేరుకే రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు. పని చేయగల వాతావరణం లేదు. పరిపాలన సాగించటానికి అవసరమైన సిబ్బంది లేరు. జిల్లాల పునర్విభజన జరిగి అర్ధ సంవత్సరం అవుతున్నా జిల్లా పాలనా యంత్రాంగంలో అతి ముఖ్యమైన ఆర్డీవో కార్యాలయాల పట్ల అంతులేని నిర్లక్ష్యం నెలకొంటోంది. వ్యవసాయ, ఉద్యాన, పారిశ్రామిక స్వభావ ప్రాంతాలు కావడంతో గ్రీవెన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. ఒకపక్క సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల కోసం మండలాల వారీగా పర్యవేక్షించాలి. మరోపక్క సిబ్బందికి సరిపడా గదులు ఉండాలి. ఈ రెండూ సరిలేక ఆర్డీవో కార్యాలయాలు కాస్తా అవస్థల కార్యాలయాలుగా మారిపోతున్నాయి. 

ఉమ్మడి కృష్ణా జిల్లా విభజన జరిగి అర్ధ సంవత్సరం గడిచింది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలుగా విడిపోయాయి. రెండు జిల్లాలకు ప్రధానమైనవి రెవెన్యూ డివిజన్లు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పలు మండలాలకు సాధారణ పరిపాలన, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, రెవెన్యూ సంబంధిత ప్రధాన విధులతోపాటు గ్రీవెన్స్‌ వంటివి నిర్వహించాల్సిన కేంద్రాలు ఇవి. ఎన్టీఆర్‌ జిల్లాలో కొత్తగా నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. కృష్ణాజిల్లాలో కొత్తగా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పడింది. రెండు జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లకు ఇప్పటి వరకు సరైన కార్యాలయాలు లేవు. 

గదుల కొరతతో అగచాట్లు 

కృష్ణాజిల్లాలో కొత్తగా ఏర్పడిన ఉయ్యూరు రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయాన్ని స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేశారు. ఒక కాన్ఫరెన్స్‌ హాల్‌, రెండు ఛాంబర్లను కేటాయించారు. వీటిలో ఎలా నెట్టుకురావాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తీసుకువస్తున్న సీసీఎల్‌ఏ అధికారులు కొత్త జిల్లాల్లో ఆర్డీవో కార్యాలయాల దుస్థితిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

సిబ్బంది లేక నానా  తిప్పలు

ప్రభుత్వ పథకాల్లో ప్రధానంగా గృహ నిర్మాణాల పర్యవేక్షణ అంతా ఆర్డీవోల మీదనే పెడుతున్నారు. ఆర్డీవోలపై అంతులేని పని భారం ఉంటోంది. రెవెన్యూ సంబంధిత విధులు ఎలాగూ ఉంటాయి. ఈ పనులను ఒంటిచేత్తో చేసే పరిస్థితి లేదు. ఈ పనులన్నింటినీ చేయటానికి సపోర్టింగ్‌ స్టాఫ్‌ అవసరం. ప్రతి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతోపాటు ఏవో, ముగ్గురు డీటీలు, ఇద్దరు సూపరింటెండెంట్లు, ఐదుగురు సీనియర్‌ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లు కావాల్సి ఉంటుంది. అవసరాలను బట్టి ఇంకా స్టాఫ్‌ అవసరమౌతారు. కొత్తగా ఏర్పడిన మూడు రెవెన్యూ డివిజన్లలో కూడా తగినంత సిబ్బంది లేరు.

అష్టకష్టాలతో పరిపాలన  

నూజివీడు రెవెన్యూ డివిజన్‌ నుంచి ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌కు ఫైల్స్‌ ఇప్పటికీ చాలా వరకు రాలేదు. దీంతో పరిపాలనా పరంగా ఇబ్బంది ఉంటోంది. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఉన్న తోట్లవల్లూరు మండలం ఫైల్స్‌ విజయవాడ నుంచి రాలేదు. దీంతో ఉయ్యూరు డివిజన్‌ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందనే చెప్పాలి. 

ఆర్డీవోలకు జీతాలు లేవు

నూతన రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలకు ఆర్డీవోలుగా వచ్చిన వారికి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఆరు నెలలుగా జీతాలు లేకపోతే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారన్న ఆలోచన జిల్లా యంత్రాంగానికి కానీ, సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులకు కానీ లేకపోవటం గమనార్హం. జీతాలు లేకుండా పని చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆర్డీవోలకు తగిన  ప్రావిజినల్‌ బడ్జెట్‌ కూడా లేదు. ఈ బడ్జెట్‌ ఉంటే అవసరమైన ఖర్చులకు ఉపయోగించవచ్చు. ఉయ్యూరు డివిజన్‌ ఓ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. విజయవాడ విమానాశ్రయం అయినప్పటికీ గన్నవరంలో ఉండటం వల్ల భౌగోళికంగా కృష్ణా జిల్లాలోకి రావటం వల్ల ఉయ్యూరు ఆర్డీవో ప్రొటోకాల్‌ విధులు నిర్వహించాల్సి వస్తోంది. విమానాశ్రయానికి వచ్చే అతిథులకు బొకేలు తీసుకు వెళ్లాలంటే ఒక్కోటి మూడు, నాలుగు వేల రూపాయల బొకే తీసుకువెళ్లాలి. ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. ఉయ్యూరు ఆర్డీవోనే కాదు. మిగిలిన ఆర్డీవోలకూ ప్రొటోకాల్‌ ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.   



Updated Date - 2022-09-18T05:04:51+05:30 IST