అనర్హుల ఆప..రేషన్‌

ABN , First Publish Date - 2022-05-24T06:18:36+05:30 IST

అనర్హుల ఆప..రేషన్‌

అనర్హుల ఆప..రేషన్‌

రేషన్‌కార్డుకు కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు

అనర్హులకు చెక్‌ పెట్టేందుకు తాజా ఉత్తర్వులు

అర్హత లేనివారు వెంటనే సరెండర్‌ చేయాలని స్పష్టీకరణ

లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమణ

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు


రేషన్‌ కార్డుల కొత్త నిబంధనలు లబ్ధిదారుల మెడపై కత్తిలా మారాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన తాజా నిబంధనలు జిల్లాలో ఎంతమందిని కార్డుదారులుగా ఉంచుతుందో,  లేదో చూడాలి. 


గుడివాడ, మే 23 : ఉమ్మడి జిల్లాలో 12.56 లక్షల కార్డులున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో వాటిలో ఎన్ని ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013ను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డులు జారీ చేశాయి. వీటిని ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులని కూడా పిలుస్తారు. కరోనా నుంచి.. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, రేషన్‌ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నవంబరు వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో అధికారులను తప్పుదారి పట్టించి కొంతమంది అనర్హులు రేషన్‌ కార్డుల ద్వారా రేషన్‌తో పాటు మరికొన్ని ఉచితాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంది. అలాంటి వారు తక్షణం తమ కార్డులు  సరెండర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పేదల బియ్యం అక్రమార్కుల పాలు

ఇప్పటికే పేదలకు ఇచ్చే బియ్యం పక్కదారి పడుతోంది. కృష్ణాజిల్లాలోని 25 మండలాల్లో 34 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి 1,059 రేషన్‌ డీలర్లకు సరుకు సరఫరా అవుతుంది. వాటి నుంచి 336 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ వ్యాన్ల ద్వారా రేషన్‌ సరఫరా చేస్తున్నారు. నెలనెలా జిల్లాలో 13,70,569 మంది కార్డుదారులు రేషన్‌ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేవై ద్వారా నెలనెలా ప్రతి పేద కార్డుదారుడికి ఒక్కొక్కరికీ ఐదు కిలోల వంతున బియ్యం ఉచితంగా ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చే బియ్యాన్ని అత్యధిక శాతం మంది పేదలు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొంతమంది దళారులు, వ్యాపారులు ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా తరలిన రేషన్‌ బియ్యానికి పాలిష్‌ పట్టి సన్నరకంగా మార్చి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. 

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకుండా..

మూడేళ్లుగా అక్రమ బియ్యం దందా రాజకీయ నాయకుల అండదండలతో సాగుతోంది. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రూ.5 కోట్ల విలువచేసే రేషన్‌ బియ్యం గత ఏడాది అక్రమార్కుల పాలైన విషయం విదితమే. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా ఈ వ్యవహారం సాగిపోతోంది. ఇప్పటికే నెలకోసారి గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, హనుమాన్‌ జంక్షన్లలో ఎక్కడో ఓ చోట రేషన్‌ బియ్యాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. నిఘా వర్గాలు సరిగ్గా పనిచేస్తే టన్నులకొద్దీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. విజిలెన్స్‌, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు దాడులు చేసి, జరిమానాలు వేసి సరిపెడుతుండటంతో అక్రమ బియ్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ వ్యాపారుల వద్ద ప్రభుత్వం సీజ్‌ చేసిన బియ్యాన్ని మళ్లీ వేలం పాటలో వారే కొనడం విశేషం. వాటిని రవాణా చేస్తూ పట్టుబడితే మీ వద్దే కొన్నామని బుకాయిస్తున్నారు. అర్హులకు అందాల్సిన రేషన్‌ బియ్యం అక్రమ మార్గంలో తరలిపోవడాన్ని అడ్డుకోవాల్సింది పోయి కార్డులు తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

తాజా నిబంధనలు ఇవీ..

గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000లోపు ఆదాయం ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్‌కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు. వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్‌ ఉన్నవారు, కారు, ట్రాక్టర్‌, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, సేల్స్‌ట్యాక్స్‌ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు రేషన్‌కార్డులు పొందడానికి అనర్హులని తేల్చారు. గతంలో రేషన్‌కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే  సరెండర్‌ చేయాల్సిందేనని చెబుతున్నారు.

Read more