మట్టి తోలకం నిలిపేయాలి

ABN , First Publish Date - 2022-06-12T07:11:50+05:30 IST

మట్టి ద్వారా అక్రమార్జన చేపట్టాలనే ప్రయత్నం అధికార పార్టీలో చిచ్చురేపింది.

మట్టి తోలకం నిలిపేయాలి

ఎమ్మెల్యే రక్షణనిధికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ఆందోళన

గంపలగూడెం, జూన్‌ 11 : మట్టి ద్వారా అక్రమార్జన చేపట్టాలనే ప్రయత్నం అధికార పార్టీలో చిచ్చురేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తలలు పగలగొట్టుకునేలా చేసింది. అంతటితో ఆగక మట్టి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే రక్షణనిధికి వ్యతిరేకంగా ఎంపీటీసీ ధర్నా చేసేలా చేసింది. ఊటుకూరులో శనివారం జరిగిన ఈ పరిణామం రక్షణనిధికి తీవ్ర తలనొప్పిగా పరిణమించింది. 

 ఊరచెరువుకు పడిన గండిని పూడ్చకుండా మట్టి తోలకాలు చేయడానికి వీలు లేదని వైసీపీ వర్గీయులు రెండోరోజు శనివారం కూడా తోలకాలను అడ్డుకొని ఆందోళన చేశారు. ఊటుకూరు గ్రామ వైసీపీ ఎంపీటీసీ నేరళ్ల వెంకటేశ్వరరావు భార్య నేరళ్ల పద్మావతి మరో 16 మంది తమ పొలాలకు మట్టి తోలకం కోసం ఊటుకూరు ఊర చెరువు మట్టికి అనుమతులు మంజూరు చేయాలని ఇరిగేషన్‌ ఈఈకి దరఖాస్తు చేసుకున్నారు. 2,800 క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపునకు ఈఈ అనుమతులు మంజూరు చేశారు. ఈనెల 9న జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ నేరెళ్ల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ బొల్లెపోగు రేణుక ఆధ్వర్యంలో చెరువు మట్టి తోలకం ప్రారంభించాలని అధికారులను  ఎమ్మెల్యే రక్షణనిధి ఆదేశించారు. ఊర చెరువు గండి పూడ్చివేత కార్యక్రమాన్ని ఎంపీటీసీ నేరళ్ల వెంకటేశ్వరావుకు అప్పగించారు. ఆయన ఆదేశాల మేరకు ఈనెల 10న మట్టి తోలకం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా గండిని పూడ్చాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టి తోలకం పనుల్ని శుక్రవారం అడ్డుకున్నారు. చెరువు వద్దే అధికార పార్టీలోని రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణలో మాచినేని శ్రీనివాసరావు తలకు బలమైన గాయమైంది. అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదుగురిపై కేసునమోదు చేశారు.

ఎమ్మెల్యే రక్షణనిఽధికి వ్యతిరేకంగా నినాదాలు

  ఎంపీటీసీ నేరళ్ల వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకుడు ఆలపాటి ఉమామహేశ్వరరావు, వైసీపీ కార్యకర్తలు శనివారం కూడా ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మట్టి తరలింపునకు అనుమతులు ఇప్పించి పనులు అడ్డుకున్న తమపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. తహసీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, ఎస్సై వి.సతీష్‌, ఇరిగేషన్‌ ఏఈ కిషోర్‌ జేసీబీ, డోజర్‌, ట్రాక్టర్లను రప్పించి గండి పూడ్చివేతకు చర్యలు చేపట్టారు. 

 వైసీపీలోనే ఇరు వర్గాల వారు కొట్లాడుకొని టీడీపీపై బురద చల్లుతున్నారని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో వీధి లైట్లు లేవని, మంచినీటి సమస్య పరిష్కరించకపోవడంతో టీడీపీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని గ్రామస్థులకు అందిస్తున్నారు. 

వైసీపీలో చాపకింద నీరులా అసమ్మతి!

తిరువూరు : నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొందరు నాయకులు ఎమ్మెల్యే తీరును నిరసిస్తు రహశ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేను రంగంలోకి దిపేందుకు అసమ్మతి నేతలు తమతమ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీలోని ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు ఇటీవల విజయవాడలో సమావేశం అయ్యి భవిష్యత్‌ కార్యచరణ రూపొందించుకున్నట్లు తెలిసింది. పలు మండలాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర వర్కులు చెసిన నాయకులకు బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే వద్ద దీనిపై ప్రస్తావన తెచ్చినా ఆయన స్పందించక పోవడంపై కొందరు నాయకులు గుర్రుగా ఉంటున్నారు.  

పద్మజ్యోతిని రంగంలోకి దింపే యత్నం

గతంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతికి కొందరు వైసీపీ నాయకులు మద్దతు ఇస్తూ రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతుండగా, దీర్ఘకాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆమె ఇటీవల  ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ సీటు ఆశిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేయడంతోపాటుగా, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు.  


Updated Date - 2022-06-12T07:11:50+05:30 IST