‘అవినీతి’ మంటలు!

ABN , First Publish Date - 2022-11-19T00:38:35+05:30 IST

రైల్వే ప్యాంట్రీ కోచ్‌లలో అవినీతి మంటలు చెలరేగుతున్నాయి. ఈ కోచ్‌లలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నా.. రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు గుణపాఠాలు నేర్వటం లేదు.

‘అవినీతి’ మంటలు!

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్యాంట్రీలో మంటలతోనైనా అధికారులు స్పందించేనా?

ప్యాంట్రీ కోచ్‌లలోకి అక్రమంగా నిత్యావసరాలు.. వ గైరా రవాణా

అవినీతి మత్తులో... కమర్షియల్‌ విభాగ అధికారులు

విజయవాడ వేదికగా గతంలో గ్యాస్‌ బండల రవాణా

రైల్వే ప్యాంట్రీ కోచ్‌లలో అవినీతి మంటలు చెలరేగుతున్నాయి. ఈ కోచ్‌లలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నా.. రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు గుణపాఠాలు నేర్వటం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్యాంట్రీ కోచ్‌లో అగ్ని ప్రమాద ఘటనలో రైల్వే కమర్షియల్‌ విభాగం తప్పిదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలోని కమర్షియల్‌ విభాగంలో కొందరి అధికారుల ధన దాహం ముఖ్యకారణమని చర్చ నడుస్తోంది.

విజయవాడ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఏ 1 రైల్వే స్టేషన్‌ వేదికగా అనేక అక్రమాలు జరిగాయి. రైల్వే స్టేషన్‌ వేదికగా జరుగుతున్న సంఘటనలపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో స్ర్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. గ్యాస్‌ సిలిండర్ల అక్రమ రవాణాను బహిర్గతం చేసింది. ప్యాంట్రీకార్లతో పాటు ప్రయాణికులుండే కోచ్‌లలో కూడా గ్యాస్‌ సిలిండర్లను డంప్‌ చేయటం, నిత్యావసరాలను అందించటం వంటివాటిని సవివరంగా ప్రచురించింది. దీనిపై అవినీతి కమర్షియల్‌ విభాగం అధికారులు అప్పట్లో విచారణ మమ అనిపించారు. ప్రయాణికుల కోచ్‌లలో గ్యాస్‌ సిలిండర్ల రవాణా విషయంలో చోటుచేసుకున్న నిర్వాకాలపై రైల్వే న్యాయస్థానం మండిపడింది. బాధ్యులైన వారిపై జరిమానాలు విధించింది. కేసులు బలహీనంగా ఉండటంతో.. కేవలం జరిమానాలతో సరిపుచ్చింది. రైల్వేకోర్టు జరిమానాలు విధించిన తర్వాత బ్లాక్‌ లిస్టులో ఉంచాల్సిన వారికి దొడ్డిదోవలో మళ్లీ విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగంలోని అవినీతి అధికారి ఒకరు తెరవెనుక మంత్రాంగం నడిపి తన బినామీకి మళ్లీ నిత్యావసరాల రవాణా వ్యవహారాలు చేసుకునేలా అనుమతులు ఇచ్చేశారు. రైల్వేలో ఫుడ్‌ అండ్‌ క్యాటరింగ్‌ ఇన్‌స్పెక్టర్లు మొదలు, టికెట్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, కమర్షియల్‌ స్టాఫ్‌, రన్నింగ్‌ స్టాఫ్‌ ఎవరూ కూడా ప్రశ్నించలేకుండా ఆ అధికారి చర్యలు చేపట్టేవారు. ఎవరైనా తనిఖీలు చేసినా, ప్రశ్నించినా.. బదిలీ వేటు పడేది. విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగంలోని అవినీతి అధికారి ఒకరు సుదీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోయి ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కు పాల్పడుతున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణికుల టిక్కెట్ల తనిఖీలు తప్పితే మరో తనిఖీ జరగటం లేదు. కమర్షియల్‌ అవినీతి అధికారులకు అక్రమాలకు కేరా్‌ఫగా నిలిచిపోయిన ప్యాంట్రీ కోచ్‌లలో తనిఖీలు మచ్చుకు కూడా జరగటం లేదు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లలోని ప్యాంట్రీ కోచ్‌లు ఎక్కడో ఓ చోట ఆగ్నికి ఆహుతి అవుతున్నాయి. రైళ్లలో మంటల వ్యాప్తికి దోహదపడే ఆయిల్స్‌, రసాయనాలు, గ్యాస్‌ సిలిండర్లు, బాణసంచా, పేలుడు పదార్థాలు వంటివి రవాణా చేయటం నిషిద్ధం. అదే ప్యాంట్రీలో అయితే గ్యాస్‌ సిలిండర్లను ఉంచవచ్చు. ఇదెక్కడి న్యాయం? ప్యాంట్రీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలితే... ఆ ఒక్క బోగీయే కాకుండా మిగిలిన ప్రయాణికుల బోగీలకు కూడా నిప్పంటుకుని ఆగ్నికి ఆహుతి అయితే ఎవరు బాధ్యత వహిస్తారు?

దిద్దుబాటు చర్యలేవి?

గతంలో రైల్వే జీఎం విజయవాడలో జరిగిన గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాల అక్రమ రవాణా భాగోతాలపై అప్పటి దక్షిణ మధ్య రైల్వే జీఎం విచారణకు ఆదేశించినా.. బినామీలను రక్షించేందుకు అప్పటి క మర్షియల్‌ ఉన్నతాధికారులే తొక్కి పట్టారు. ఇప్పుడా జీఎం లేరు. ఆ ఉన్నతాధికారీ విజయవాడలో లేరు. అవినీతి అధికారి మాత్రం ఇంకా ఉన్నాడు. కమర్షియల్‌ విభాగాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప రైళ్లలో ప్రయాణికుల భద్రత చేకూరే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ దిశగా రైల్వే బోర్డు చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

నిఘా ఏది?

ప్యాంట్రీ కోచ్‌లలో ఆహార పదార్థాలను అందించటానికి లైసెన్స్‌ లేని వారిని రైల్వే స్టేషన్లలోకి అనుమతించటం ఒకఎత్తు అయితే.. వారి ద్వారా ఏమేమి లోడ్‌ అవుతున్నాయన్నదానిపై ఎలాంటి నిఘా లేదు. ఒకవేళ తనిఖీలు చేసే వారికి బదిలీలు ఉంటాయి కాబట్టి.. ఆ సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎలాంటి లైసెన్సులు లేకుండా నిత్యావసరాలను చేరవేస్తున్న వారి వివరాలను తీస్తే.. అవినీతి కమర్షియల్‌ అధికారుల బినామీలెవరో రైల్వే బోర్డుకు తెలిసిపోతుంది.

Updated Date - 2022-11-19T00:38:35+05:30 IST

Read more