కోటా.. దసరాకు కోత

ABN , First Publish Date - 2022-09-19T05:55:13+05:30 IST

కోటా.. దసరాకు కోత

కోటా.. దసరాకు కోత

అక్టోబరులో కందిపప్పు, పంచదార కట్‌


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కార్డుదారులకు దసరా పండుగ ఆనందం కరువవుతోంది. అక్టోబరు నెల నిత్యావసరాల కోటాలో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయనున్నారు. కందిపప్పు, పంచదార ఇవ్వరు. ఈ మేరకు డీడీలు కట్టొద్దని రేషన్‌ డీలర్లను సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ఆదేశించారు. దీంతో కేవలం బియ్యం ఒక్కటే పంపిణీ కానుంది. పంచదార, కందిపప్పు సరఫరాకు సంబంధించి ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్‌ పిలవలేదని సమాచారం. రెండు నెలలుగా కందిపప్పు కోటా సక్రమంగా పంపిణీ చేయట్లేదు. కిందటి ఆగస్టులో జరిగిన అలాట్‌మెంట్‌లో రేషన్‌ డీలర్లకు కోత విధించారు. ఇలా కోత విధించిన కందిపప్పును సెప్టెంబరులో అరకొరగా సర్దారు. ఆగస్టు, సెప్టెంబరుల్లో సబ్సిడీ ధరకు కందిపప్పు అందక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబరులో వినాయకచవితి ఉన్నప్పటికీ కందిపప్పు ఇవ్వలేదు. అక్టోబరులో పూర్తిగా కందిపప్పును తీసేశారు. ప్రొక్యూర్‌మెంట్‌కు ఇప్పటి వరకు టెండర్లు పిలవకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపులు జరపకపోవటంతో ప్రొక్యూర్‌మెంట్‌కు ఎవరూ ముందుకు రావటం లేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇంతకుముందు వచ్చిన సప్లయిదారులు కూడా నాసిరకం కందిపప్పును పంపిణీ చేశారు. దీని కారణంగా సెప్టెంబరులో పంపిణీ అయిన ప్యాకెట్లు తిరిగి ఎండీయూ ఆపరేటర్లు, రేషన్‌ డీలర్లకు వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిస్థితిలో దసరా పండుగ చేసుకునే అక్టోబరులో కందిపప్పు, పంచదార లేకుండా చేశారు.

Updated Date - 2022-09-19T05:55:13+05:30 IST