అడుగడుగునా అక్రమ లోడింగ్‌

ABN , First Publish Date - 2022-03-16T06:04:48+05:30 IST

అడుగడుగునా అక్రమ లోడింగ్‌

అడుగడుగునా అక్రమ లోడింగ్‌
సాంబమూర్తి రోడ్డులో అక్రమ లోడింగ్‌

సాంబమూర్తి రోడ్డులో యథేచ్ఛగా ప్రైవేట్‌ దందా

ప్రైవేట్‌ బస్సులు నిలిపి భారీ లోడింగ్‌

బస్సు కింద ఉన్న చాంబర్లలో, పైన భారీగా సరుకు రవాణా

నిబంధనలకు తూట్లు

రవాణా అధికారుల నిర్లక్ష్యం

ప్రమాదాలు జరిగే అవకాశం


బస్సుల్లో పార్శిల్‌ బాక్సులు, ఇతర సరుకుల బండిల్స్‌ లోడింగ్‌ దృశ్యాలను చూసి ఇదేదో ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఆవరణలో జరుగుతున్న తతంగం అనుకోకండి. బెజవాడ నడిబొడ్డున జరుగుతున్న అక్రమ దందా ఇదంతా. రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎంత కళ్లు మూసుకుని పనిచేస్తుందో తెలియజేసేందుకు నిదర్శనమిది. ట్రావెల్‌ బస్సుల్లో జరుగుతున్న అక్రమ సరుకు రవాణా వ్యవహారమిది. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలోని సాంబమూర్తి రోడ్డులో ఒకటి కాదు.. రెండు కాదు.. రోడ్డు పొడవునా ట్రావెల్స్‌ బస్సుల్లో సరుకు రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మోటారు వాహన చట్టం ఉల్లంఘన పబ్లిక్‌గా జరుగుతున్నా అధికారులెవరూ ఇటువైపు చూడట్లేదు. సాయంత్రం 5 గంటలైతే చాలు పార్శిల్‌ బండిల్స్‌తో లోడ్‌ చేసుకున్న బస్సుల రాకపోకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

బెజవాడ నడిబొడ్డునే..

నగరంలోని సాంబమూర్తి రోడ్డులో, ప్రెస్‌క్లబ్‌ నుంచి పాత గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వరకూ సాయంత్రం అయితే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ఇలా సరుకు లోడ్‌ చేస్తున్నారు. ప్రయాణికుల లగేజీ స్థానంలో అండర్‌ చాంబర్లలో సరుకును నింపుతున్నారు. ఇవన్నీ నిండిపోయాక బస్సు పై భాగంలో కూడా గూడ్స్‌ బండిల్స్‌, స్టేషనరీ, విడిభాగాలు.. ఇలా అన్నింటినీ లోడ్‌ చేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి దుకాణాలు కూడా దాదాపు సరుకు లోడింగ్‌కు సంబంధించినవే ఏర్పాటయ్యాయంటే ఏ స్థాయిలో దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

లోడింగ్‌ తర్వాత ప్రయాణికుల వద్దకు.. 

దాదాపు ప్రతి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు కూడా సాంబమూర్తి రోడ్డు వచ్చి సరుకు లోడింగ్‌ చేసుకున్నాకే ప్రయాణికుల పాయింట్లకు వెళ్తోంది. ప్రైవేట్‌ బస్సులు కాబట్టి ప్రయాణికులు ప్రశ్నించరు. తమ లగేజీని బస్సు లోపలే సర్దుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణికుల లగేజీ తప్ప కమర్షియల్‌గా సరుకు రవాణా చేపట్టడానికి ఎంవీ యాక్ట్‌ ప్రకారం అనుమతి లేదు. ప్రైవేట్‌ బస్సుల ఓనర్ల అత్యాశ కారణంగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ప్రయాణికులతో పాటు సరుకు రవాణా కూడా చేపడితే డబుల్‌ ఆదాయం సాధించవచ్చన్నది వారి భావన. ఎక్కువ సరుకు రవాణా చేయటం కోసం నిబంధనలను ఉల్లంఘించి మరీ బస్సు చాంబర్లలో అంతర్గత మార్పులు చేస్తున్నారు. బస్సు కింద చాంబర్లలో, పైన సరుకు అధికంగా లోడ్‌ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 

పట్టించుకోని రవాణా అధికారులు

సాంబమూర్తి రోడ్డులో పబ్లిక్‌గా సరుకు అక్రమ రవాణా జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సరుకు ఓవర్‌ లోడింగ్‌ చేపడితే లారీ అయినా, ప్రైవేటు బస్సైనా రూ.వెయ్యి జరిమానా విధించేవారు. రూ.25 వేలు-50 వేలు.. ఆ పైన సరుకు రవాణా చేపట్టేటపుడు రూ.వెయ్యి జరిమానా అన్నది ట్రావెల్‌ బస్సుల నిర్వాహకులకు పెద్దభారమేమీ కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓవర్‌ లోడింగ్‌ జరిమానాలను రూ.1,000 నుంచి రూ.20,000కు పెంచింది. టన్నుకు రూ.2 వేల చొప్పున జరిమానా పెంచారు. ఈ నిబంధనలను లారీల విషయంలో పక్కాగా అమలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సుల విషయంలో చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ట్రావెల్స్‌ నిర్వాహకుల నుంచి ఆమ్యామ్యాలకు అలవాటు పడి జరిమానాలు విధించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 



Updated Date - 2022-03-16T06:04:48+05:30 IST