అయ్యో రొయ్య..!

ABN , First Publish Date - 2022-06-12T06:30:20+05:30 IST

అయ్యో రొయ్య..!

అయ్యో రొయ్య..!

సంక్షోభంలో జిల్లాలోని రొయ్యల సాగు

రూ.1.60 లక్షలు పెరిగిన వ్యయం

సీడ్‌, మేతల్లో నాణ్యతాలోపం 

రొయ్యల పెరుగుదలపై ప్రభావం

ధర తగ్గడంతో కుదేలైన సాగుదారులు


గుడివాడ, జూన్‌ 11 : రొయ్యల సాగు రైతులను నష్టాలపాలు చేస్తోంది. పిల్ల, మేత నాణ్యతలోపాలతో ఎగుమతులకు అవసరమైన సైజ్‌ పెరగడానికి నెల రోజులు అధికంగా తీసుకుంటోంది. ఎకరా విస్తీర్ణంలో రొయ్యల పెంపకానికి గతంలో రూ.4.2 లక్షలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.5.80 లక్షలు వ్యయమవుతోందని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ కోతలు, చార్జీల బాదుడుతో కొంతమేర నష్టపోయిన రైతులను పట్టుబడి దశలో ధరలు నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. 

పెరిగిన ఖర్చులు

రొయ్యల మేత, మందుల ధరలు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగాయి.  జిల్లావ్యాప్తంగా నందివాడ, కృత్తివెన్ను, మోపిదేవి, గుడివాడ, పెడన, మచిలీపట్నం తదితర మండలాల్లోని 38 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. 15 వేల మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఎకరాకు రూ.1.25 లక్షలు నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా వేసవి రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో సాగుదారులు ఫిబ్రవరి మొదటి వారంలో పిల్ల వేసి ఏప్రిల్‌ నెలాఖరుకు పట్టుబడులకు వెళ్తారు. ఈ ఏడాది రొయ్య పూర్తిస్థాయిలో (40 కౌంట్‌) తయారు కావడానికి 120 రోజులు పట్టింది. గత నెలాఖరు నుంచి రొయ్యల ధరలు తగ్గడం ఆరంభమై.. పట్టుబడులు ముమ్మరమైన జూన్‌లో రైతులను తీవ్రంగా నష్టపరిచే స్థాయికి తగ్గాయి. సాధారణంగా మంచి ధర పలికే 40 కౌంట్‌ రొయ్య గతంలో కేజీ రూ.360 ఉండేది. ప్రస్తుతం రూ.290కు పడిపోయింది. కిలో 60 కౌంట్‌ రొయ్యల ధర సైతం రూ.330 నుంచి రూ.270కు దిగజారింది. వంద కౌంట్‌ ధర రూ.50 మేర తగ్గింది. సీడ్‌లో నాణ్యతాలోపం కారణంగా అధిక శాతం విస్తీర్ణంలో 40 కౌంట్‌ రొయ్య తీయలేకపోయారని తెలుస్తోంది.

పెట్టుబడులు అనేకం..

రొయ్యల మేత ధర ఈ ఏడాది టన్ను రూ.72 వేల నుంచి రూ.90 వేలకు చేరింది. నాలుగు నెలల సాగు కాలానికి ఎకరా విస్తీర్ణంలో రొయ్యల పెంపకానికి ఐదు టన్నుల మేత అవసరమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీని ప్రకారం చూస్తే గతంలో మేత ఖర్చు ఎకరాకు రూ.3.60 లక్షలు అయ్యేది. ప్రస్తుతం రూ.4.50 లక్షలకు చేరింది. రొయ్యల సాగుకు అవసరమయ్యే మందుల వ్యయం ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పెరిగింది. ఏరియేటర్లు తిప్పడానికి విద్యుత్‌ ఖర్చులు ఎకరాకు రూ.20 వేల మేర పెరిగాయి. జనరేటర్ల ద్వారా ఏరియేటర్లు తిప్పడానికి ఎకరాకు మరో రూ.18 వేలు అదనంగా వినియోగించాల్సి వచ్చింది. రొయ్యల సీడ్‌ను ల్యాబ్‌లలో పరిశీలించాకే వాడాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రొయ్యల సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని సాగుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 


Updated Date - 2022-06-12T06:30:20+05:30 IST