దుర్గమ్మ దర్శనానికి త్రిముఖ వ్యూహం

ABN , First Publish Date - 2022-09-13T06:52:24+05:30 IST

దుర్గమ్మ దర్శనానికి త్రిముఖ వ్యూహం

దుర్గమ్మ దర్శనానికి త్రిముఖ వ్యూహం

కలెక్టరేట్‌, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, హరిత బెర్మ్‌ పార్కుల నుంచి వీఐపీల తరలింపు

వృద్ధులు, దివ్యాంగులు, కళాకారులు, దేవస్థానాల బృందాలు కూడా..

భారీ ఎత్తున రెవెన్యూ బందోబస్తు 

సెక్యూరిటీ పాయింట్‌ ప్రతిచోటా రెవెన్యూ, దేవస్థాన సిబ్బందికి డ్యూటీ

స్లాట్‌ పద్ధతిన దర్శనాలు

ప్రయోగాత్మకంగా పరిశీలన 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాల్లో అనధికార దర్శనాలకు ముకుతాడు వేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం త్రిముఖ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. బందరురోడ్డులోని కలెక్టరేట్‌ కేంద్రంగా వ్యూహరచన చేస్తోంది. అలాగే, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, హరిత బెర్మ్‌పార్క్‌ కేంద్రంగా డిజిగ్నేటెడ్‌ వీఐపీలు, వీఐపీలు, రికమండెడ్‌ వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులను తరలించే దిశగా ఆలోచన చేస్తున్నారు. మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వేదికగా వీఐపీల తరలింపు ఇక ఉండకపోవచ్చు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ త్రిముఖ వ్యూహాన్ని విజయవంతం చేయటం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున రంగంలోకి దింపటానికి సన్నాహాలు చేస్తోంది. డివిజనల్‌ మేజిస్ర్టేట్‌ హోదా కలిగిన ఆర్‌డీవోలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు.

స్ర్కూటినీ చేసి..

కలెక్టరేట్‌, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో జాయింట్‌ కలెక్టర్‌, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు స్ర్కూటినీ చేసి వీఐపీలుగా భావించాకే టికెట్లు కొనిపించి వారికి కేటాయించిన కార్లలో నిర్దేశిత సమయాల్లో పంపిస్తారు. తెలంగాణ నుంచి వచ్చే వీఐపీల కోసం హరిత బెర్మ్‌పార్కులో కూడా ఇదే  విధమైన పద్ధతి ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జ్యుడిషియల్‌, సీఎంవో తదితర డిజిగ్నేటెడ్‌ వీఐపీలు నేరుగా ఇంద్రకీలాద్రికి వెళ్లొచ్చు. అయితే అందులో ప్రొటోకాల్‌ వారు కచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే అనుమతించరు.

రెవెన్యూ బందోబస్తు

త్రిముఖ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయటానికి జిల్లా యంత్రాంగం రెవెన్యూ బందోబస్తును ఏర్పాటు చేయనుంది. పోలీస్‌ సెక్యూరిటీ ఉండే ప్రతిచోటా రెవెన్యూ, దేవస్థాన సిబ్బందికి డ్యూటీలు వేస్తారు. లోపలికి అనుమతించే విషయంలో ముగ్గురూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అంతిమంగా రెవెన్యూ అధికారి నిర్ణయం తీసుకుంటాడు. దీనికోసం ఆర్‌డీవో స్థాయి అధికారులను నియమించాలని యంత్రాంగం చూస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్‌ డీవోలను రప్పించబోతోంది. ఈసారి కొండ మీదకు వాహనాలు వెళ్లే మార్గాలు, లిఫ్టులు వెళ్లే మార్గాల దగ్గర ఆర్‌డీవోలతో పాటు దేవదాయ శాఖ అధికారులు కూడా ఉంటారు. వాహనాలు మూడు పాయింట్ల నుంచి బయల్దేరగానే, ఆర్‌ డీవోలకు సమాచారం ఇస్తారు. 

స్లాట్‌ దర్శనాలు

వీఐపీలు, రికమండెడ్‌ వీఐపీలు, మీడియా ప్రతినిధులు, వృద్ధులు, దివ్యాంగులకు స్లాట్‌ పద్ధతిలో దర్శనాలు కేటాయిస్తారు. వీఐపీలకు సంబంధించి రోజూ ఆన్‌లైన్‌లో 1,000 టికెట్లు, మాన్యువల్‌గా 1,000 టికెట్లకు అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో తక్కువగా నమోదైతే, ఆ ప్రకారం కలెక్టరేట్‌, గెస్ట్‌హౌస్‌, బెర్మ్‌ పార్కుల్లో మాన్యువల్‌ గా అవకాశం కల్పిస్తారు. తగిన స్ర్కూటినీ మాత్రం తప్పనిసరి. ఏటా కొండ మీదకు వికలాంగుల కోసం ఉచిత బస్సులు నడుపుతారు. వీటిలో సాధారణ భక్తులే ఎక్కువ ఉంటున్నారు. వికలాంగులను కూడా ఈ కేంద్రాల నుంచే కొండ మీదకు పంపిస్తారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు

త్రిముఖ వ్యూహం ఆలోచనలోనే ఉంది. ఇలా చేయటం ద్వారానే అనధికార దర్శనాలకు కట్టడి వేయటం జరుగుతుందని భావిస్తున్నాం. అనధికారిక దర్శనాల వల్ల ఘాట్‌ మార్గంలోనూ, గుడి పరిసరాల్లోనూ రద్దీ కనిపించకూడదని, కొండ కింద కూడా అలాంటి వాతావరణం కనిపించకూడదని కలెక్టరేట్‌, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, హరిత బెర్మ్‌పార్కులను వీఐపీలు, వృద్ధులు, వికలాంగులు తదితరుల తరలింపునకు వేదికగా మార్చాం. వీఐపీ దర్శనాలకు సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాక దృష్టి సారిస్తాం. స్లాట్‌ పద్ధతిలో దర్శనాల అంశం కూడా పరిశీలనలో ఉంది. - ఎస్‌.దిల్లీరావు, కలెక్టర్‌

Read more