పెట్రోల్‌ కొట్టేస్తున్నారు..!

ABN , First Publish Date - 2022-11-25T00:59:56+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ బంకుల్లో ‘డెన్సిటీ (సాంద్రత)’ మాయ జరుగుతోంది. దీనివల్ల వినియోగదారులు దారుణంగా మోసపోతుంటే, తనిఖీలు చేయాల్సిన లీగల్‌ మెట్రాలజీ అధికారులు మాత్రం ‘నాజ్‌’లు అందుకుంటున్నారు. అసలు ఈ డెన్సిటీ ఏంటి? నాజ్‌ల వెనుక మతలబు ఏమిటంటే..

పెట్రోల్‌ కొట్టేస్తున్నారు..!

అన్ని బంకుల్లో ఒకే విలువ..!

డిస్‌ప్లేలో యజమానుల ట్యాంపరింగ్‌

తెలియక మోసపోతున్న వినియోగదారులు

మామూళ్ల మత్తులో తూనికలు కొలతల శాఖ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెండు జిల్లాల్లో 200కు పైగా పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉన్నాయి. ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి కేంద్ర ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు చెందిన బంకులతో పాటు ఎస్సార్‌, రిలయెన్స్‌ వంటి ప్రైవేట్‌ బంకులు కూడా ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు పలు సంఘాల అనుబంధంగా కూడా కొన్ని బంకులు నడుస్తున్నాయి. విచిత్రమేమిటంటే.. ఇటీవల కాలంలో దాదాపు అన్ని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ డెన్సిటీ (సాంద్రత) ఒకేలా చూపిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. డీజిల్‌ కంటే కూడా పెట్రోల్‌కు సంబంధించే ఇది ఎక్కువగా జరుగుతోంది.

డెన్సిటీ అంటే..

డెన్సిటీ అనేది పెట్రోల్‌, డీజిల్‌ల నాణ్యతను తెలియజేస్తుంది. ఒక లీటరుకు డెన్సిటీ విలువ ఎంత ఉంటే అది అంత ప్రామాణికమైనదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. పెట్రోల్‌ డెన్సిటీ లీటర్‌కు 730-770, డీజిల్‌కు డెన్సిటీ 820-860 మధ్యన ఉండాలి. ఈ విలువ కంటే తక్కువ ఉంటే మాత్రం అది కచ్చితంగా ప్రామాణికం కాదు. ఆ పెట్రోల్‌, డీజిల్‌లో కల్తీ ఉన్నట్టే. ఈ విలువ వివిధ పరిస్థితులను బట్టి ఒక్కో పెట్రోల్‌ బంకులో ఒక్కోలా ఉంటుంది. ఏ బంకులో ఎలా ఉన్నప్పటికీ డెన్సిటీ మాత్రం కేంద్రానికి లోబడి ఉండాల్సిందే. ఈ డెన్సిటీ విలువ ఎంతనేది పెట్రోల్‌, డీజిల్‌ పంపులపై డిస్‌ప్లే మీద మనకు కనిపిస్తుంది. ఇంధనం పరిమాణం, ధరతో పాటు డెన్సిటీ కూడా మనకు చూపిస్తుంది. ఈ విలువ అన్ని బంకుల్లో దాదాపు ఒకేలా చూపిస్తోంది. ఏ పెట్రోల్‌ బంకులో చూసినా 730గా కనిపిస్తోంది. డీజిల్‌ డెన్సిటీ విలువలో తేడా ఉన్నా, పెట్రోల్‌ డెన్సిటీ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. అంటే.. డెన్సిటీ విలువను ట్యాంపరింగ్‌ చేసినట్టేనన్నమాట. దీనిపై అవగాహన ఉన్న వాహనదారులకే తెలుస్తుంది. చాలామందికి తెలియదు. అవగాహన ఉన్న వారు అడిగితే, పెట్రోల్‌ బంకు సిబ్బంది మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. ఇటీవల సింగ్‌నగర్‌లోని ఓ బంక్‌ పెట్రోల్‌లో నీరు కలిసిన విషయం తెలిసిందే. విచిత్రంగా ఆ బంకులో కూడా డెన్సిటీ విలువ 730 చూపటం గమనార్హం. వాస్తవానికి నీరు కలిసింది కాబట్టి డెన్సిటీ విలువ 730 కంటే తక్కువ చూపాలి. దీనిని బట్టి పెట్రోల్‌ బంకుల నిర్వాహకులంతా దాదాపుగా డెన్సిటీ విలువ 730గా చూపించేలా ట్యాంపరింగ్‌ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

నాజ్‌ల ముసుగులో అధికారులు

పెట్రోల్‌, డీజిల్‌ బంకులను క్రమం తప్పకుండా తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవటమే ఈ దుస్థితికి కారణం. కొంతకాలంగా తూనికల కొలతల శాఖ అధికారులు పెట్రోల్‌ బంకులవైపు కన్నెత్తి చూడట్లేదు. ‘నాజ్‌’ల మోజులో పడి నజరానాలు అందుకుంటున్నారు. బంకుల్లో పెట్రోల్‌ పంపులను తూనికల కొలతల శాఖ అధికారులు నాజ్‌లు అంటారు. ఈ నాజ్‌లకు సంబంధించి నిర్దేశించిన సర్టిఫైడ్‌ రుసుమును పెట్రోల్‌ బంకులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నాజ్‌లకు దాని పరిమాణం, సామర్థ్యాన్ని బట్టి రూ.2,500 నుంచి రూ.4,000 వరకు సర్టిఫైడ్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫైడ్‌ రుసుము ఎంత అయితే ఉందో, దానికి తిరిగి అంత కలిపి నిర్వాహకులు తూనికల కొలతల శాఖ అధికారులకు మామూళ్లు సమర్పిస్తుంటారు. త్రైమాసికం, అర్థ సంవత్సరం ఇలా ఒక్కో పద్ధతిలో నాజ్‌ల మీద తూనికల కొలతల శాఖ అధికారులకు మామూళ్లు అందుతుంటాయి. వీటికోసం పెట్రోల్‌ బంకుల వంక కన్నెత్తి చూడట్లేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనో, ఆయిల్‌ కంపెనీల నుంచి సమాచారం వస్తేనో, ఉన్నతాధికారులు చెబితే నో తప్ప తనిఖీలు చేయట్లేదు.

Updated Date - 2022-11-25T00:59:58+05:30 IST