కుళాయి కనెక్షన్లకు డబ్బు వసూళ్లు

ABN , First Publish Date - 2022-08-31T06:53:02+05:30 IST

మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చే విషయంలో అవినీతి జరుగుతోందని 12వ వార్డు కౌన్సిలర్‌ మట్టా శివపావని కౌన్సిల్‌ సమావేశంలో ఆరోపించారు.

కుళాయి కనెక్షన్లకు డబ్బు వసూళ్లు

పెడన కౌన్సిల్‌లో కౌన్సిలర్‌ శివ పావని ఆరోపణ

పెడన, ఆగస్టు 30 : మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చే విషయంలో అవినీతి జరుగుతోందని 12వ వార్డు కౌన్సిలర్‌ మట్టా శివపావని కౌన్సిల్‌ సమావేశంలో ఆరోపించారు. పెడన మునిసిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం చైర్‌పర్సన్‌ బళ్ళ జ్యోత్స్నరాణి అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశంలో అజెండాలోని 11 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.  శివపావని మాట్లాడుతూ, తన వార్డు లో కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు ఒకరి వద్ద రూ.8 వేలు, మరొకరి నుంచి రూ.10 వేలు, ఇంకొకరి వద్ద  రూ.12 వేలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. బీపీఎల్‌ పథకంలో కేవలం రూ. 200కు కుళా యి కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉండగా, అంతేసి సొమ్ము వసూలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసి నెల రోజులు దాటి నా ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని ఆమె విమర్శించారు. కుళాయి కనెక్షన్లకు నగదు వసూలుపై  విచారణ జరిపిస్తామని కమిషనర్‌ అంజయ్య హామీ ఇచ్చారు. అజెండాలోని చివరి అంశమైన జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై ఫ్లోర్‌ లీడర్‌ కటకం ప్రసాద్‌ మాట్లాడారు.  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సీఎం సభ సందర్భంగా సభా ప్రాంగణంలో టాయిలెట్లు ఏర్పాటు చేసినందుకు ఖర్చయిన రూ. 4 లక్షల 11 వేలను మునిసిపల్‌ సాధారణ నిధుల నుంచి భరించాలని సమావేశం తీర్మానించింది.  మాజీ కౌన్సిలర్‌ వాసా భద్రమ్మ మృతికి సమావేశం సంతాపం వ్యక్తం చేసింది.  సంతాప సూచకంగా సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. కమిషనర్‌ ఎం. అంజయ్య, మేనేజర్‌ యోగేశ్వరరావు, టీడీపీ ఏసుబాబు, ఆర్‌ఐ పామర్తి వెంకటేశ్వరరావు, ఏఈలు రమ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more