రూ.6.52 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించండి
ABN , First Publish Date - 2022-12-30T00:37:11+05:30 IST
బాపులపాడు పంచాయతీకి విద్యుత్ బిల్లు బకాయి పెనుభారంగా మారింది. గత నవంబరు నాటికి రూ.6.52 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాలని గురువారం హనుమాన్‌జంక్షన్ సెక్షన్ విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు నోటీసులు జారీ చేశారు.

బాపులపాడు పంచాయతీకి విద్యుత్ శాఖ నోటీసు
హనుమాన్‌జంక్షన్, డిసెంబరు 29: బాపులపాడు పంచాయతీకి విద్యుత్ బిల్లు బకాయి పెనుభారంగా మారింది. గత నవంబరు నాటికి రూ.6.52 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించాలని గురువారం హనుమాన్‌జంక్షన్ సెక్షన్ విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు నోటీసులు జారీ చేశారు. దీర్ఘ కాలంగా బకాయిలు ఉండడంతో 2021 జూలైలో రూ.90 లక్షలు, నవంబరులో రూ.90.50 లక్షలు పంచాయతీ అకౌంట్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నేరుగా విద్యుత్ బకాయిలకు ప్రభు త్వమే జమ చేసింది. 15వ ఆర్థిక సంఘం నుంచి ఈ ఏడాది నవంబరులో మరో రూ.6 లక్షలు చెల్లిం చాలని ఆదేశించి జమ చేయించింది. ఈ ఏడాది నవంబరు నాటికి రూ.6.52కోట్లు బకాయి ఉండగా డిసెంబరు బిల్లు మరో రూ.20 లక్షలు వచ్చింది. పంచాయతీకి వచ్చిన ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే సరిపోతున్నాయని పాలక వర్గం వాపోతోంది. అభివృద్ధి పనులకు కేటాయించలేక పోతున్నామని, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటోందని, పంచాయతీ నిర్వహణ భారంగా మారిందని సభ్యులు వాపోతున్నారు.
పేరుకుపోతున్న పన్ను బకాయిలు
పంచాయతీకి చెల్లించాల్సిన గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల ఇళ్ల పన్ను బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం అలసత్వం వహించడంపై పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు తహసీల్దార్ కార్యాలయం రూ.7 లక్షలు ఇళ్ల పన్ను బకాయి ఉంది. బీఎస్ ఎన్ఎల్, పోస్టాఫీస్, రైతుబజార్, తదితర కార్యాల యాలవి దాదాపు రూ.50 లక్షల బకాయి ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి చోరగుడి ప్రసాద్ తెలిపారు.
బకాయిల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ
పన్నుల అదాయాన్ని పెంచడానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి సీహెచ్ ప్రసాద్ తెలిపారు. పన్నుల రూపంలో పంచాయతీకి ఏడాదికి రూ.1.90 కోట్లు ఆదాయం రావా లని, ప్రజలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇప్పటి వరకు రూ.4.13 కోట్లు బకాయి ఉందని ఆయన తెలిపారు. వస్తున్న ఆదాయంలో శానిటరీ నిర్వహణ, కార్మికులకు ఏడాదికి రూ.1.07 కోట్లు ఖర్చు అవు తోందన్నారు. విద్యుత్ బిల్లు ఏడాదికి రూ.2.40 కోట్లు వస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఇళ్ల పన్ను బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లిస్తే పంచాయతీకి కొంత ఊరట లభిస్తుందని చెప్పారు. పంచాయతీకి సకాలంలో ఇంటి, నీటి కుళాయి పన్నుతో పాటు బకాయిలను వెంటనే చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Read more