పట్టాభి ముందుచూపు ఆర్థిక సంపద చేకూర్చింది

ABN , First Publish Date - 2022-11-25T00:51:28+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎంతో ముందు చూపుతో ఆంధ్రాబ్యాంకు స్థాపించడం వల్ల ఆర్థిక సంపద చేకూరిందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని యూనియన్‌ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌ అన్నారు.

పట్టాభి ముందుచూపు ఆర్థిక సంపద చేకూర్చింది
మాట్లాడుతున్న యూనియన్‌ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 24 : స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎంతో ముందు చూపుతో ఆంధ్రాబ్యాంకు స్థాపించడం వల్ల ఆర్థిక సంపద చేకూరిందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని యూనియన్‌ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌ అన్నారు. ఆంధ్రాబ్యాంకు రిటైర్డు ఉద్యోగుల సంఘం, పట్టాభి మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్టుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి మచిలీపట్నం మెహర్‌బాబా ఆడిటోరియంలో పూర్వపు ఆంధ్రాబ్యాంకు 100వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ వేడుకలను మనోజ్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంకు డీజీఎం చందన్‌ సాహు, యూనియన్‌ బ్యాంకు విజయవాడ జోన్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ నవనీత్‌కుమార్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పట్టాభిపై ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వేడుకల్లో మనోజ్‌కుమార్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రాబ్యాంకు యూనియన్‌ బ్యాంకులో విలీనమైనప్పటికీ అధికారులు, ఉద్యోగులెవరూ పట్టాభి సీతారామయ్యను మరువలేదన్నారు. పట్టాభి పేరుతో ఒక పత్రికను నిర్వహిస్తున్నామన్నారు. డీజీఎం చందన్‌సాహు మాట్లాడుతూ, లాభాల దిశలో బ్యాంకు నడుస్తోందన్నారు. ఆంధ్రాబ్యాంకు రిటైర్డు ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వారణాసి కృష్ణమూర్తి మాట్లాడుతూ, పట్టాభి పేరిట మచిలీపట్నంలో ఒక కళ్యాణ మండపం నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి ముందుకు రావడం ముదావహమన్నారు. ఇందుకు యూనియన్‌ బ్యాంకు సాయం అందించాలన్నారు. సభాధ్యక్షులు పట్టాభి మెమోరియల్‌ ఫౌండేషన్‌ ట్రస్టు ప్రతినిధి సింగరాజు గోవర్ధన్‌ మాట్లాడుతూ, ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలో పట్టాభి తన ఆస్తులను త్యాగం చేశారన్నారు. ఆంధ్రాబ్యాంకు కనుమరుగైనప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. విజయవాడ జోన్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ నవనీత్‌కుమార్‌, మచిలీపట్నం యూనియన్‌ బ్యాంకు రీజనల్‌ హెడ్‌ ఎన్‌.వి.ఎస్‌. హరిరామ్‌, ఏపిబిఆర్‌ఎఫ్‌ ప్రతినిధి కొండలరావు, ఆంఽధ్రాబ్యాంకు రిటైర్డు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎ్‌స.ఎ్‌స.రెడ్డి, రిటైర్డు ఉద్యోగుల సంఘం సలహాదారులు కృష్ణారావు, బి.సన్హారామ్‌, ఆంధ్రాబ్యాంకు మచిలీపట్నం రిటైర్డు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె. సాయిమోహన్‌, కార్యదర్శి ఆర్‌. రాజారామ్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం ప్రముఖ ఆడిటర్‌ సి.శాషాచార్యులు (అప్పాజీ)ని ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-11-25T00:51:30+05:30 IST