Pattabhiram: ఆ బిల్లు తేవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటిరోజు...

ABN , First Publish Date - 2022-09-22T21:24:34+05:30 IST

సీఎం జగన్ యావత్ తెలుగు జాతిని అవమానించారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

Pattabhiram: ఆ బిల్లు తేవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటిరోజు...

అమరావతి (Amaravathi): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్చడం ద్వారా సీఎం జగన్ రెడ్డి (CM Jagan) యావత్ తెలుగు జాతిని అవమానించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు తేవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటిరోజు అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై గుడివాడ గుట్కా (కొడాలి నాని), వల్లభనేని వంశీకి తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రశ్నించలేని వారికి అన్న ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజే వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమన్నారు. ఏపీలో 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 13 మెడికల్ కాలేజీల్లో 4 చంద్రన్న హయాంలో తెచ్చినవే నన్నారు. ఏపీలో 17 మెడికల్ కాలేజీలంటూ సీఎం జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని దుయ్యబట్టారు.


రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రానికి  ఏపీ ప్రభుత్వం 7 అప్లికేషన్లు పంపగా మూడింటికే ఆమోదం తెలిపిందని పట్టాభిరామ్ అన్నారు. మూడేళ్లలో వైద్య రంగంలో కేవలం 13,900 ఉద్యోగాలిచ్చి 40,000లకు పైగా ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకోవడం జగన్ రెడ్డికే చెల్లిందన్నారు. చంద్రన్న పాలనలో ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించామన్నారు. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం తమ వల్ల కాదని సీఎం జగన్ సొంత జిల్లాలో ఓ ఆస్పత్రి బోర్డులు పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో విజయవంతంగా అమలు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ను జగన్ రెడ్డి ఐసీయూలోకి నెట్టేశారని విమర్శించారు. సీఎంఆర్‌ఎఫ్ కింద చంద్రన్న ఐదేళ్లలో రూ. 1520 కోట్లు ఇవ్వగా.. జగన్ రెడ్డి మూడేళ్లలో రూ. 429 కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. కొవిడ్ సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించలేక 110 మంది ప్రాణాలను బలితీసుకున్న జగన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఎక్కడిదన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ. 1100 కోట్లు దారి మళ్లించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వాసుపత్రులు నరకకూపాలుగా మారాయన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు లేక సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేస్తున్నారని పట్టాభిరామ్ పేర్కొన్నారు.

Read more