అమరావతి.. జయహో

ABN , First Publish Date - 2022-09-18T05:09:45+05:30 IST

ఏకైక రాజధాని అమరావతి జయహో అనే నినాదాలతో శనివారం మహాపాదయాత్ర హోరెత్తింది.

అమరావతి.. జయహో
నినాదాలతో కొనసాగుతున్న మహాపాదయాత్ర

కోలాహలంగా మహాపాదయాత్ర

 ఆరో రోజు 15 కిలోమీటర్లు 

జనసంద్రంగా మారిన కనగాల, నగరం

ఏకైక రాజధాని అమరావతిపై మోదీకి పోస్టుకార్డు 

ఏకైక రాజధాని అమరావతి జయహో అనే నినాదాలతో శనివారం మహాపాదయాత్ర హోరెత్తింది. తీర ప్రాంత నియోజకవర్గమైన చెరుకుపల్లి మండలంలో యాత్ర సాగింది. వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన మహిళలు, గ్రామస్థులు రాజధాని రైతులకు హరిత జెండాలు, డప్పులతో స్వాగతం పలికారు. కనగాల నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారితో కలిసి నడక సాగించారు. మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు.. పోలీసుల మోహరింపు.. రైతుల్లో భావోద్వేగ వాతావరణం మధ్య చెరుకుపల్లి మండలం ఐలవరం శివారు నుంచి నగరం వరకు పాదయాత్ర సాగింది. ఆరో రోజు దాదాపు 15 కిలోమీటర్ల మేర రైతులు మహాపాదయాత్రచేశారు. టీడీపీ, జనసేన, సీపీఐ శ్రేణులు, న్యాయవాదులు, హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన వారు పాదయాత్రికులకు సంఘీభావం ప్రకటించారు. 

బాపట్ల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం కూడా జనజాతరను తలపించింది. చెరుకుపల్లి మండలం ఐలవరం శివారు నుంచి ఆరోరోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కొద్ది నిమిషాలకే కనగాల గ్రామ శివారుకు చేరుకోగా అక్కడ వారికి స్వాగతం పలికేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో పూలవర్షంతో జనం రైతులకు ఎదురేగి స్వాగతం పలికారు. సమీప గ్రామాలైన ఆరేపల్లి, చెరుకుపల్లి, గుళ్లపల్లి, ఆరుంబాక, రాంబొట్లవారిపాలెం, బొలిసెలపాలెం ప్రజలు రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి వెల్లువలా తరలివచ్చారు. రాజోలుకు సమీప గ్రామాలైన దూళిపూడి, కూచినపూడి, అడవులదీవి, దిండి, నిజాంపట్నం, మంతెనవారిపాలెం ప్రజలు నగరానికి తరలివచ్చారు.  యాత్ర సాగే మార్గంలోని గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి మజ్జిగ తీసుకొచ్చి యాత్రికులకు అందజేశారు. కనగాలలో అయితే ఇళ్ల ఎదుట కుర్చీలు వేసి సేదతీరమని పాదయాత్రికులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని పాదయాత్రలో యడ్లబండిపై పాల్గొన్నారు. పాదయాత్ర ఆసాంతం ఎమ్మెల్యే అనగాని వెంట ఉన్నారు. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు, సీపీఐ నాయకులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు రైతులకు సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి సపోర్టర్స్‌ పేరిట 40 మంది బృందంగా వచ్చి రైతులకు భరోసా ఇచ్చారు.  

  మోదీ జన్మదినోత్సవం

పాదయాత్రలో భాగంగా శనివారం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని బీజేపీ నాయకులు రైతులతో కలిసి జరుపుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ఉంచాలని మోదీకి పోస్టుకార్డులను చేరవేసే కార్యక్రమాన్ని బీజేపీ నాయకుడు వల్లూరి జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించారు. నడక సాగే మార్గంలో రోడ్లు ఊడ్చి అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. ఆదివారం నడక నగరం నుంచి ప్రారంభమై గాలివారిపాలెం, ఏలేటిపాలెం, చిలకావారిపాలెం మీదగా రేపల్లె చేరుకోనుంది.  

Updated Date - 2022-09-18T05:09:45+05:30 IST