డబుల్‌.. ట్రబుల్‌

ABN , First Publish Date - 2022-01-03T06:30:25+05:30 IST

నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రోడ్ల పనులు ఓ పట్టాన ముందుకు కదలటం లేదు.

డబుల్‌.. ట్రబుల్‌
మచిలీపట్నం - కమ్మవారి చెరువు రోడ్డు దుస్థితి ఇది

ఎన్‌డీ బీ రోడ్లపై ప్రతిష్టంబన 

రోడ్ల విస్తరణ ఇంకెన్నాళ్లకు? 

జిల్లావ్యాప్తంగా నిలిచిన ఎన్‌డీబీ పనులు 

రంగంలోకి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ

డిజైన్లు, టెక్నికల్‌ అంశాలపై వివరణ కోరిన పీఎంసీ 

రెండు వారాలు అవుతున్నా.. స్పందించని ‘వృద్ధి’ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రోడ్ల పనులు ఓ పట్టాన ముందుకు కదలటం లేదు. జిల్లాలో అత్యంత ప్రధానమైన 13 ఆర్‌అండ్‌బీ రోడ్లను డబుల్‌ లైన్లుగా విస్తరించేందుకు రూ.234 కోట్ల వ్యయంతో పిలిచిన పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇంతకు ముందు వర్షాకాలం అన్నారు. శీతాకాలం వచ్చినా పనుల్లో పురోగతి లేదు. రాష్ట్రంలో పనులు జరుగుతున్నది కృష్ణాజిల్లాలో మాత్రమే అని అధికారులు చెబుతున్నా.. రోడ్డు పనులు మార్జిన్లు దాటలేదు.. ఇవి కూడా ఒకటి, రెండు రోడ్లు మాత్రమే. రోడ్ల పనుల తీరు తెన్నులపై ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. తలపెట్టిన రోడ్లకు సంబంధించిన అలైన్‌మెంట్‌, టెక్నికల్‌ డీటెయిల్స్‌ గురించి క్లారిఫికేషన్‌ కోరినా, ఇప్పటి వరకు కాంట్రాక్టు సంస్థ వృద్ధి కన్‌స్ట్రక్షన్స్‌ వివరణలు పంపకపోవటం గమనార్హం. జిల్లాలో ఎన్‌డీబీ రోడ్ల పనులు అపహాస్యంగా మారుతున్నాయి. గంపగుత్తగా పనులన్నింటినీ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏ పనినీ మొదలు పెట్టలేదు. జిల్లాలో 13 రోడ్లకుగానూ, నాలుగు రోడ్ల పనులు మాత్రమే అప్పట్లో మొదలయ్యాయి. అది కూడా జంగిల్‌ క్లియరెన్స్‌, మార్జిన్‌ లెవల్స్‌ మాత్రమే జరిగాయి. ప్రధానమైన పనులు మొదలే కాలేదు. మిగిలిన తొమ్మిది రోడ్ల పనులు అసలు మొదలే కాలేదు. ఎన్‌డీబీ గ్రాంట్స్‌ ద్వారా జరిగే పనులను గంపగుత్తగా ఒకే కాంట్రాక్టు సంస్థ చేపట్టే విధంగా టెండర్లు పిలిచారు. టెండర్లను దక్కించుకున్న వృద్ధి కన్‌స్ట్రక్షన్స్‌ ఈ పనులన్నింటినీ చేపట్టాల్సి ఉండగా.. ఒక్కో రోడ్డును ఒక్కో సబ్‌ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. ఆయా సంస్థలకు పేమెంట్ల భయం పట్టుకుంది. దీంతో నాలుగు సబ్‌ కాంట్రాక్టు సంస్థలు మాత్రమే జంగిల్‌ క్లియరెన్స్‌, మార్జిన్స్‌ మట్టి చదును పనులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ సంస్థలు కూడా బిల్లులు రావేమోనన్న భయంతో పనులు ఆపివేశాయి. వర్షాకాలం ముందు పనులు ఆగిపోయాయి. అధికారులను అడిగితే వర్షాకాలం కదా అందుకే ఆగాయి అన్నారు. శీతాకాలం వచ్చినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. 


తేడాలను గుర్తించిన పీఎంసీ

జిల్లాలో ఎన్‌డీబీ పనులను సమీక్షించటానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) బృందం వచ్చింది. జిల్లాలో నిర్దేశించిన పనులకు సంబంధించి సరైన వివరణ ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థను కోరింది. ఆ సంస్థ ఇచ్చిన డిజైన్స్‌, అలైన్‌మెంట్స్‌లో తేడాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ తేడాల మీదనే పీఎంసీ వివ రణ కోరినట్టు తెలుస్తోంది. వివరణలు వెంటనే పంపాలని ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా కోరినా, ఇప్పటివరకు కాంట్రాక్టు సంస్థ నుంచి స్పందన లేదు. పీఎంసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే గానీ భవిష్యత్తులో పనులు జరిగే అవకాశం లేదు.


ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి ఇదీ..

జిల్లాలో మొత్తం 13 ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎన్‌డీబీ గ్రాంట్‌ కింద పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. వీటిలో మచిలీపట్నం-నూజివీడు- కల్లూరు రోడ్డు, చెవిటికల్లు - వత్సవాయి రోడ్డు, నూజివీడు - ఏలూరు రోడ్డు, గన్నవరం - పుట్టగుంట రోడ్డు, మధిర - కంచికచర్ల రోడ్డు, నూజివీడు - గన్నవరం రోడ్డు, కందులపాడు - గంగినేనివారి పాలెం రోడ్డు, నందిగామ - పొక్కునూరు రోడ్డు, కౌతవరం - నిడుమోలు - ఐలూరు రోడ్డు, తేలప్రోలు - ఉయ్యూరు - వల్లూరు రోడ్డు, నడుపురు - వాడవల్లి - కోరుకల్లు రోడ్డు, మంటాడ - లంకపల్లి రోడ్డు, మచిలీపట్నం - కమ్మవారి చెరువు వయా చిన్నాపురం రోడ్లకు టెండర్లు పిలవగా.. వీటిలో గన్నవరం - పుట్టగుంట, గన్నవరం - నూజివీడు, మచిలీపట్నం - కమ్మవారి చెరువు, నూజివీడు - ఏలూరు రోడ్డు పనులు మాత్రమే జంగిల్‌ క్లియరెన్స్‌, మట్టి లెవలింగ్‌ వరకైనా జరిగాయి. మిగిలిన వాటికి అడుగు ముందుకు పడలేదు. ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్లన్నీ గతుకులతో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


నూజివీడు - విజయవాడ రోడ్డు పనులు అసంపూర్ణం

విజయవాడ నుంచి పైపులరోడ్డుతో అనుసంధానమయ్యే నూజివీడు రోడ్డు విస్తరణ పనులు కూడా అగిపోయాయి. ఈ రోడ్డు నున్న, సూరంపల్లి, ఆగిరిపల్లి మీదుగా నూజివీడు వెళుతుంది. దీనిని డబుల్‌ లైన్‌ గా విస్తరించటానికి ఇతర గ్రాంట్స్‌ నుంచి పనులు చేపట్టారు. సెకండ్‌ లైన్‌కు వీలుగా మార్జిన్ల వెంబడి కొంతవరకు పనులు చేసి, వదిలేశారు. కల్వర్టుల పనులు అరకొరగా చేపట్టి వదిలేశారు. పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. చెల్లింపులు నిలిచిపోయాయని కాంట్రాక్టు సంస్థ పనులు ఆపివేసినట్టు తెలుస్తోంది. 



Updated Date - 2022-01-03T06:30:25+05:30 IST