ముంచిన మాండస్‌

ABN , First Publish Date - 2022-12-12T00:58:37+05:30 IST

మాండస్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంటలు నీటమునిగాయి. మండలంలో మోపిదేవి, వెంకటాపురం, పెదప్రోలు, పెదకళ్లేపల్లి, కె.కొత్తపాలెం గ్రామాల్లో గడిచిన 15 రోజులుగా వరి కోతలు సాగాయి.

 ముంచిన మాండస్‌

ముంచిన మాండస్‌

మేకావారిపాలెంలో ముంపులో వరి పనలు

మోపిదేవి, డిసెంబరు 11 : మాండస్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంటలు నీటమునిగాయి. మండలంలో మోపిదేవి, వెంకటాపురం, పెదప్రోలు, పెదకళ్లేపల్లి, కె.కొత్తపాలెం గ్రామాల్లో గడిచిన 15 రోజులుగా వరి కోతలు సాగాయి. కోతల నూర్పిడి కొంతమేర పూర్తికాగా, మరి కొంతమంది రైతులు వరి కోతలు కోసి పనలపై పొలాల్లో ఉన్నాయి. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, పొలంలో చల్లుకునేందుకు నూరుశాతం రాయితీపై మినుము విత్తనాలను ప్రభుత్వమే అందించాలంటున్నారు. పొలాలను తహసీల్దార్‌ కె.నవీన్‌ కుమార్‌, సిబ్బందితో కలసి పరిశీలించారు. నీటిని వెంటనే బయటకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి, రైతులకు సూచించారు.

అవనిగడ్డ రూరల్‌ : వరి పంట పూరిగా ఽనీటమునిగింది. వరిపనలు నీటిపై తేలియాడుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని వేకనూరు, మోదుమూడి, అశ్వారావుపాలెం, తుంగలవారిపాలెం, దక్షిణ చిరువోలులంక గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. రైతులకు ఉపశమనం కలిగించటానికి తక్షణ సహాయం కింద రూ.25 వేలు ప్రభుత్వం అందించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు డిమాండ్‌ చేశారు. అశ్వారావుపాలెం, మోదుమూడి, దక్షిణచిరువోలులంక, రామకోటిపురం గ్రామాల్లో పర్యటించారు. బచ్చు వెంకట నారాయణ, బచ్చు మురళీ, కమతం నరేష్‌, బచ్చు శ్రీను, తుంగల నరేష్‌, బచ్చు ప్రశాంత్‌, బచ్చు శ్రీహరి, మండలి శివప్రసాద్‌, బొప్పన పృథ్వీ, రేపల్లె రోహిత్‌, నాగభూషణం, పప్పుశెట్టి శ్రీను, ఆకుశెట్టి రవి, కమ్మిలి సాయి భార్గవ, బాలు, పవన్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

చల్లపల్లి : మండలంలో 12వేల ఎకరాల్లో వరిసాగు జరిగింది. రెండు రోజులుగా (ఆదివారం ఉదయం వరకు) 77.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణాజిల్లాలోని 25 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన మండలాల్లో మూడవ మండలం చల్లపల్లి. చల్లపల్లి మండలంలో 1500 ఎకరాల్లో వరిపంట పనల మీదున్నట్లు వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖలు అంచనావేసి ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ మనోహర్‌, తహసీల్దార్‌ గోపాలకృష్ణ పర్యటించి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏవో జి.సాయిసింధు, ఏఏవోలు రైతులకు తగు సూచనలు అందజేశారు.

కూచిపూడి : పొలాల్లో నీరు నిలిచిపోయి వరి పనలు నీటిపై తేలియాడు తున్నాయి. మొవ్వ మండలంలో 11,250 హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు వంట సాగు చేయగా, వరి పంట కోసి 30 శాతం పనల మీద ఉండగా, 40 శాతం కుప్పలు వేశారు. ఐదు శాతం మంది రైతులు కుప్పలు నూర్చగా, ఇంకా 25 శాతం వరి కోతలు కోయాల్సి ఉంది. రెండు రోజులపాటు వరి పనల నీళ్లలోనే ఉంటే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ ఆర్‌బికేల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ నేతల బృందం కోసూరు, కాజ గ్రామాల్లో పర్యటించారు. రైతులను ఆదుకోవాలని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వర్ల కుమార్‌ రాజా డిమాండ్‌ చేశారు. కోసూరులో పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. దేవినేని రమేష్‌, మేకా వెంకటేశ్వరరావు, తుమ్మల రాజా, లక్ష్మీదాస్‌, నిడుమోలు నవీన్‌, గుమ్మడి కృష్ణ పాల్గొన్నారు.

ఘంటసాల : మండలంలో 56.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. 19870 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, 50 శాతం పైగా పంటను రైతులు కాపాడుకోగలిగారు. ఇంకా 40 శాతంపైగా వరి పంట కోత దశలో ఉండగా, 1650 ఎకరాల్లో వరి పంట పనల మీద, 350 ఎకరాల్లో వరి పంట నేల వాలినట్లు వ్యవసాయాశాఖాధికారులు తెలియజేశారు. జీలగలగండి కాలనీ వద్ద నీటమునిగిన పంట పొలాలను తహసీల్దార్‌ బి.రామానాయక్‌, ఘంటసాలపాలెం, చిట్టూర్పు, కొడాలి గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను ఏవో మురళీకృష్ణ పరిశీలించారు.

గుడ్లవల్లేరు : వడ్లమన్నాడు, వేమవరం, కౌతవరం, గుడ్లవల్లేరులో రైతులు చేలలోని నీటికి దారులు చేసి బయటికి మళ్ళిస్తూ, తడిచిన పనలను తిరగవేస్తూ కనిపించారు. ఈ వర్షం ఇక్కడితో ఆగకుంటే చాలామంది రైతులు పూర్తిగా నష్టపోతామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తోట్లవల్లూరు : రెండోపంటగా చల్లిన మినుము విత్తనాలు మొలకలు వచ్చాయని, ఆ మొక్కలు వాన నీటికి చనిపోయే ప్రమాదం నెలకొందని రైతులు చెబుతున్నారు.

కోడూరు : మండలంలో సుమారు 4 వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. ప్రతీ ఏడాది పంట కోతకు వచ్చే సమయానికి ప్రకృతి ఏదో ఒక రూపంలో నష్టం కలిగించటంతో వ్యవసాయం మీదే ఆధారపడి సన్న, చిన్నకారు కుటుంబాలు జీవన పరిస్థితి కుంటుపడుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బతిన్న వరి పొలాలను వ్యవసాయాధికారి ఎన్‌.భానుప్రకాష్‌ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏవో రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఈవో సురేష్‌, రైతులు ఉన్నారు.

నాగాయలంక : మండలంలో 20 వేల ఎకరాల్లో అన్నదాతలు వరిని సాగు చేశారు. కోసిన వరి పనలు తడిసిముద్దయ్యాయి. కోయని వరి పైరు చాపలా నేల వాలిపోయింది. దీంతో రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది. టీడీపీ నేతలు మండలి ఉదయభాస్కర్‌, బొండాడ గణపతిరావు పరిశీలించారు.

Updated Date - 2022-12-12T00:58:39+05:30 IST