ఎంత పనిచేశారు తల్లీ

ABN , First Publish Date - 2022-09-30T06:02:46+05:30 IST

ఎంత పనిచేశారు తల్లీ

ఎంత పనిచేశారు తల్లీ

గొల్లపూడిలో అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి తల్లీకూతురు ఆత్మహత్య

14 ఏళ్లుగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న కూతురు

సేవ చేస్తున్న తల్లికి కూడా బయటపడిన వ్యాధి

బాధ భరించలేక ఇద్దరూ బలవన్మరణం


అంతుచిక్కని వ్యాధి శరీరాన్ని మెలి పెట్టేస్తోంది. గుండెల నిండా బాధ భయంకరంగా మారిపోయింది. సహకరించలేని శరీరాన్ని చూసి కుమిలిపోతున్న ఆ కూతురు కష్టం తీరకపోగా మరింత ఎక్కువైంది. ఇన్నాళ్లూ తనకు సేవ చేసిన కన్నతల్లికి కూడా ఆ వ్యాధి సోకింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఈ తల్లీకూతుళ్లు తామేం తప్పు చేశామని ఆ దేవుడినే అడిగేందుకు గుడికి వెళ్లారు. ఏం మాట్లాడుకున్నారో అక్కడి నుంచి నేరుగా ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకెళ్లి పైకెక్కి కిందకు దూకేశారు. హృదయవిదారకమైన ఈ తల్లికూతుళ్ల విషాద కథ గురువారం గొల్లపూడిలో జరిగింది.

 

విద్యాధర పురం, సెప్టెంబరు 29 : గొల్లపూడిలోని అయ్యప్పస్వామి గుడి వీధిలో ఉంటున్న కందుల మాధవి, ఆమె తల్లి బొప్పన సత్యవతి గురువారం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఇంట్లో చెప్పి స్థానికంగా ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన తల్లీకూతుళ్లు తిరిగి వచ్చిన వెంటనే ఇంటికి చేరుకోకుండా స్థానిక ఓ అపార్ట్‌మెంట్‌లో టెర్రస్‌ పైకి వెళ్లారు. తొలుత మాధవి, ఆ తరువాత సత్యవతి పై నుంచి దూకి తీవ్ర గాయాలతో మరణించారు. వివరాల్లోకి వెళితే.. మాధవి (40)కి 22 ఏళ్ల కిందట కందుల పురుషోత్తంతో వివాహమైంది. ఇద్దరు కుమారులు. అయితే, మాధవికి అనుకోకుండా పార్కిన్‌సన్‌ అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి ప్రభావం శరీరమంతా పాకింది. 14 ఏళ్లుగా ఈ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న మాధవి తల్లి సత్యవతి (65) వద్దే ఉంటోంది. సత్యవతి, ఆమె భర్త చంద్రశేఖర్‌, వీరి కుమారుడు ఫణికృష్ణతో పాటు మాధవి కుటుంబం కూడా కలిసే ఉంటోంది. కూతురు కష్టాన్ని చూడలేక తల్లి కుమిలిపోతూ ఉండేది. ఎన్ని మందులు వాడినా ఆ వ్యాధి నయం కాలేదు. కూతురుకు సేవ చేస్తూ ఉండిపోయిన తల్లికి కూడా రెండు నెలల కిందట ఆ వ్యాధి సోకింది. ఆ బాధ భరించలేక ఇద్దరూ తల్లడిల్లిపోయేవారు. సత్యవతి భర్త చంద్రశేఖరరావు, కుమారుడు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తున్న ఫణికృష్ణ, మాధవి భర్త పురుషోత్తం పనులు నిమిత్తం గురువారం బయటకు వెళ్లారు. అయితే తాము గుడికి వెళ్లొస్తామని మాధవి, సత్యవతి కూడా బయటకు వచ్చారు. ఆటోలో గొల్లపూడి ఘాట్‌ వద్ద ఉన్న కనకదుర్గగుడికి వెళ్లి తిరిగి పురుషోత్తం సోదరి రాణి ఉంటున్న సాయిశేష అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ ఎక్కి టెర్రస్‌పైకి వెళ్లారు. మొదట కూతురు, ఆ తరువాత తల్లి అక్కడి నుంచి దూకేశారు. స్థానికులు గమనించి వారించినా వినకుండా దూకేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. సత్యవతి చీర మెస్‌కు చిక్కుకోవడంతో తలకిందులుగా కింద పడిపోయింది. తీవ్రమైన గాయమై తుదిశ్వాస విడిచింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం సీఐ ఉమర్‌ ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. పురుషోత్తం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







Updated Date - 2022-09-30T06:02:46+05:30 IST