బాబోయ్‌.. దోమలు!

ABN , First Publish Date - 2022-03-16T06:12:11+05:30 IST

దోమలు నగరవాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

బాబోయ్‌.. దోమలు!

వేసవి సమీపిస్తున్నా వదలని దోమల బాధ

తూతూ మంత్రంగా యాంటీ లార్వా ఆపరేషన్‌

రూ.లక్షల్లో వ్యయం.. ఫలితం శూన్యం


దోమలు నగరవాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రుతువులతో నిమిత్తం లేకుండా, పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల రక్తం పీల్చేస్తున్నాయి. దోమల నియంత్రణకు డ్రై డేలు పాటిస్తున్నామని.. లక్షలు వెచ్చించి యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా, దోమలు మాత్రం తగ్గడం లేదు. ఎంఎల్‌ ఆయిల్‌ బాల్స్‌ ఎక్కడ వదులుతున్నారోగానీ మురుగు కాల్వల నుంచి మాత్రం దోమలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.  


చిట్టినగర్‌/పాయకాపురం : నగర ప్రజలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది వేసవి సమీపిస్తున్నా తగ్గలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. నగరంలో ప్రతి వారం డ్రై డే పాటిస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితాలు మాత్రం కనిపించడంలేదు. దోమల నిర్మూలన, యాంటీ లార్వా ఆపరేషన్‌ పనులు సక్రమంగా జరగటం లేదు. చీకటిపడే వేళ అక్కడక్కడా ఫాగింగ్‌తో సరిపెడుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో యాంటీ లార్వా ఆపరేషన్‌ పనులను పకడ్బందీగా చేపట్టడం లేదు. డ్రెయిన్‌లలో ఎంఎల్‌ ఆయిల్‌ బాల్స్‌ వేయడం, మంచినీటి నిల్వ ప్రాంతాల్లో గంబూజియా చేపలను విడిచి పెట్టడం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో దోమల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం మాలేరియా, డెంగీకేసులుంటేనే దోమల పెరుగుదల ఉన్నట్టు భావిస్తున్నారు. 


లక్షలు వెచ్చించినా ఫలితమేది?

దోమల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించి, మంచినీటి ట్యాంకులకు మూతలు, డ్రెయినేజీ గొట్టాలకు వలలను ఏర్పాటు చేయించడం, పల్లపు ప్రాంతాలను మెరక చేయించడం వంటి చర్యలు తీసుకోవడంపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. దోమల నివారణ చర్యలకు ప్రభుత్వం ఎబెట్‌, పైరత్రం, ఎంఎల్‌ ఆయిల్‌ బాల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. వీటితోపాటు వీఎంసీ కూడా ప్రతి సంవత్సరం లక్షల్లో ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ సీజన్‌తో సంబంధం లేకుండా దోమల బెడద పెరిగిపోతూనే ఉంది. వీటి నివారణకు 2018-19లో రూ.95లక్షలు, 2019-20లో కోటి రూపాయలు, 2020-21లో రూ.87 లక్షలు, 2021-22లో రూ.85 లక్షలు కేటాయించారు. నిధులయితే ఖర్చు అవుతున్నాయి కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 


ప్రజలపై అదనపు భారం

శివారు ప్రాంతాలతోపాటు నగరంలో మురుగునీటి పారుదల సక్రమంగాలేని అన్ని ప్రాంతాల్లోనూ దోమల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు వాటి నుంచి రక్షణ కోసం వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సింగ్‌నగర్‌, భవానీపురం, ఊర్మిళానగర్‌, కె.ఎల్‌.రావునగర్‌, కొత్తపేట కొండప్రాంతం, గొల్లపాలెం గట్టు, ప్రైజర్‌పేట, పాతరాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, కృష్ణలంక, రాణిగారితోట, కండ్రిక ప్రాంతాలోపాటు సర్కిల్‌-3లోని పలుప్రాంతాల్లో పగటి పూట కూడా దోమల నివారణకు లిక్విడ్లు, కాయిల్స్‌ వంటివి  వాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం ప్రజలు నెలకు రూ.500 నుంచి వెయ్యి వరకు వెచ్చించాల్సి వస్తోంది. 


జ్వరాల బెడద

మరోవైపు దోమల విజృంభణతో నగరంలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు మాత్రం డెంగీ, మలేరియా వంటి కేసులు వస్తే మినహా దోమల నివారణ చర్యలపై అంతగా దృష్టి పెట్టడం లేదు. ఇటీవల కాలంలో ఫాగింగ్‌ మినహా యాంటీ లార్వా ఆపరేషన్‌ పనులు ఎక్కడా కనిపించడంలేదు. మలేరియా విభాగంలో అధికారులు, సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. 


చర్యలు తీసుకుంటున్నాం

దోమల నివారణకు ప్రతివారం డ్రై డే పాటిస్తున్నాం. ఇటీవల మలేరియా, డెంగీ కేసులు తగ్గాయి. కేసులున్న ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. - బాబు శ్రీనివాస్‌, ఇన్‌చార్జి బయాలజిస్టు  


నివారణ చర్యల్లేవు

శివారు ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువయింది. రాత్రి సమయంలో ఆరుబయట ఉండే పరిస్థితి లేదు. దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రాత్రిపూట కాయిల్స్‌ వెలిగించుకుని నిద్రపోవాల్సి వస్తోంది. అధికారులు, నాయకులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. - పరుచూరి ప్రసాద్‌, కండ్రిక


ప్రతిరోజూ ఫాగింగ్‌ చేయాలి

ఉడా కాలనీలో ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఖాళీ స్థలాల్లోని చెత్త, నిల్వ ఉన్న నీటి వలన దోమలు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ప్రతిరోజూ ఫాగింగ్‌ చేస్తే  దోమల బెడద కాస్తయినా తగ్గుతుంది. - నాగిరెడ్డి, రాజీవ్‌నగర్‌  



Updated Date - 2022-03-16T06:12:11+05:30 IST