భూమి చెరువు!

ABN , First Publish Date - 2022-03-16T06:24:25+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై మంత్రి షాడో కన్నుపడింది.

భూమి చెరువు!
పల్లెతుమ్మలపాలెంలోని ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకం

ప్రభుత్వ జాగాలో మంత్రి షాడో పాగా!

పల్లెతుమ్మలపాలెంలో 70 ఎకరాలకు పైగా ఆక్రమణ

మంత్రి షాడో నేతృత్వంలో చెరువుల తవ్వకం

చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం


ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై మంత్రి షాడో కన్నుపడింది. మంత్రితో ఉన్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని పక్కావ్యూహంతో భూమిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నాడు. తన బంధుగణాన్ని వాటాదారులుగా చేసుకుని బందరు మండలం పల్లెతుమ్మలపాలెంలో 70 ఎకరాలకుపైగా ఉన్న ప్రభుత్వ భూమిలో చెరువులు తవ్వేస్తున్నాడు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : బందరు మండలం పల్లెతుమ్మలపాలెం-పోలాటితిప్ప గ్రామాల మధ్య ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిపై మంత్రి షాడో కన్నుపడింది. పల్లెతుమ్మలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు తీరంలోని ఈ భూమిలో తరతరాలుగా గర్రెలు, మావులకట్లు వేస్తూ ఉంటారు. ఈ భూమిపై కన్నేసిన మంత్రి షాడో అధికారబలంతో గ్రామస్థుల్లో కొందరి మద్దతును కూడగట్టుకున్నాడు. తన మాట వినకుంటే గ్రామంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగదని మిగిలినవారిపై ఒత్తిడి పెంచాడు.  మాలకాయలంకలో ఉండే తన దూరపు చుట్టాన్ని, మరో వైద్యుడిని రంగంలోకి దించాడు. గ్రామంలోని భూమిలో చెరువుల తవ్వకానికి అనుమతులు ఇచ్చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రభుత్వ భూమిలో చెరువుల తవ్వకం మొదలయింది. అక్కడకు ఎవరైనా వెళితే మంత్రి అనుచరుడి చెరువులని చెప్పండ ంటూ బాహాటంగానే చెప్పిస్తున్నాడు. 


1983లో ఇచ్చిన భూములంటూ ప్రచారం..

పల్లెతుమ్మలపాలెం గ్రామస్థులకు 1983లో ఒక్కొక్కరికీ 2.50 ఎకరాల చొప్పున భూములు పంచారని, ఇవి గ్రామస్థులవేననే కొత్త ప్రచారాన్ని మంత్రి షాడో మొదలుపెట్టారు. అదే నిజమైతే, ఈ భూమిలో ఇంతవరకు ఎవరూ సరిహద్దు నిమిత్తం చిన్న గట్టు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.  సాగులోకి తెచ్చిందీ లేదు. ఆ భూములు తీసుకున్న వారిలో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదని గ్రామస్థులు చెబుతున్నారు.  


మూడేళ్లపాటు లీజు లేదట!

పల్లెతుమ్మలపాలెంలోని ప్రభుత్వ భూములు గ్రామస్థులవేనని, మూడేళ్ల్లపాటు ఈ భూములకు లీజు ఇచ్చేది లేదని మంత్రి షాడో చెప్పడం గమనార్హం. మూడేళ్ల తరువాత లీజు గురించి మాట్లాడదామని షరతులు పెట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఇంకా రెండేళ్లు ఉంటుందని, అదనంగా మరో ఏడాది గడువు పెట్టి గ్రామంలోని భూములను మంత్రి షాడో ఆక్రమించేస్తున్నాడని గ్రామస్థులు అంటున్నారు.  ఇప్పటి వరకూ ఈ భూములను ఆక్రమించుకునే సాహసం ఎవరూ చేయలేదని, వైసీపీ హయాంలోనే ఈ తరహా భూ ఆక్రమణలకు బీజం పడిందని గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. 


అనుమతులు ఇవ్వలేదు

పల్లెతుమ్మలపాలెంలో చెరువులు తవ్వుతున్న భూములను ఇటీవల పరిశీలించాం. వాటి సర్వే నెంబర్లు, భూమి స్వరూపాన్ని పరిశీలిస్తున్నాం. ఏళ్ల తరబడి ఈ భూములు ఖాళీగా ఉన్నమాట వాస్తవం. ఈ భూముల్లో చెరువుల తవ్వకానికి ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. - డి.సునీల్‌బాబు, తహసీల్దారు

Read more