అంతా ఏకపక్షం

ABN , First Publish Date - 2022-05-18T06:37:29+05:30 IST

అధికార, విపక్ష సభ్యుల అరుపులూ కేకలూ...

అంతా ఏకపక్షం

వీఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస!

వెలంపల్లి కనుసన్నల్లోనే...

  అభివృద్ధిపై చర్చించాలన్న టీడీపీ

  చంద్రబాబును దూషించిన వెలంపల్లి

  అడ్డుకున్న టీడీపీ కార్పొరేటర్లు

  టీడీపీ కార్పొరేటర్లను సస్పెండ్‌ చేసిన మేయర్‌

  అర్ధంతరంగా ముగిసిన కౌన్సిల్‌ సమావేశం

అధికార, విపక్ష సభ్యుల అరుపులూ కేకలూ... ప్రతిపక్ష సభ్యుల  నిరసనలూ నినాదాలూ.. సభ్యుల సస్పెన్షన్‌, మార్షల్స్‌ బలవంతపు గెంటివేతలతో విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం మంగళవారం రసాభాసగా సాగింది. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా నిలవాల్సిన కౌన్సిల్‌ను ఎమ్మెల్యే వెలంపల్లి, వైసీపీ సభ్యులు అంతా ఏకపక్షంగా నిర్వహించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి రాజకీయ విమర్శలతో యుద్ధ వాతావరణం సృష్టించారు. ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌తో బయటకు నెట్టించి సభను ఏకపక్షంగా నడిపారు.. 

చిట్టినగర్‌, మే 17 : మేయర్‌ భాగ్యలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ కార్పొరేటర్లు చెత్త పన్ను, ఆర్టీసీ చార్జీలు, నీటి పన్ను, ఇంటి పన్ను, విద్యుత్‌ చార్జీలు వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాటిని రద్దు చేయాలని కోరుతూ వీఎంసీ గేటు వద్ద నుంచి ప్లకార్డులతో నినాదాలు చేసుకుంటూ కౌన్సిల్‌కు వచ్చారు. నగరాభివృద్ధిపై చర్చ పెట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి కుంటుపడిందని, కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని టీడీపీ కార్పొరేటర్లు విమర్శించారు. ఎజెండాలో ఉన్న అంశాలపై మాత్రమే చర్చ సాగుతుందని మేయర్‌ చెప్పారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు మాజీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. సభలో లేని చంద్రబాబును దూషించడంపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై వెలంపల్లి అనుచిత వ్యాఖ్యలను చేశారని సభలో ఆందోళన చేశారు.దీంతో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎన్‌.బాలస్వామి, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని వెంకట ప్రసాద్‌, ఉషారాణిలను సస్పెండ్‌ చేస్తున్నట్టు మేయర్‌ ప్రకటించారు.  టీడీపీ కార్పొరేటర్లు తమ తప్పు ఏమీ లేకుండా సస్పెండ్‌ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసి బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు ఈడ్చి పడేశారు. కౌన్సిల్లో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రజా సమస్యలపై ఉన్న ప్రతిపాదనలపై చర్చించడానికి అవకాశం ఇవ్వకుండా అర్ధాంతరంగా కౌన్సిల్‌ను ముగించి వేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ బోయి సత్యబాబు పొడియం వద్ద ఆందోళన నిర్వహించారు. 

చిడతలతో వినూత్న నిరసన

సభ నుంచి బయటకు వచ్చిన టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ ప్రధాన ద్వారం వద్ద  బైఠాయించారు. చిడతలు వాయిస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాదడే బాదుడు అంటూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మహిళా కార్పొరేటర్లును మగవారితో బయటకు గెంటించేయటం ఎంతరకు సమంజసమని ప్రశ్నించారు.  

వైసీపీ సమావేశంగా మార్చేశారు

ప్రజా సమస్యలు నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించాల్సిన కౌన్సిల్‌ సమావేశాన్ని వైసీపీ కార్యకర్తల సమావేశంగా మార్చేశారు. టీడీపీ కార్పొరేటర్లను బలవంతంగా మార్షల్స్‌తో బయట పడేశారు. నా కళ్లజోడు, ఫోన్‌ పగిలిపోయాయి. ఇంతటి దుర్మార్గాన్ని ఎప్పుడు చూడలేదు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అడుగడుగునా ప్రజలు నిలదీయటంతో సమాధానం చెప్పలేక వెల్లంపల్లి అండ్‌ కో నోరు మూసుకొని వస్తున్నారు. కౌన్సిల్‌లో మాత్రం రుబాబు చేస్తున్నారు.

- టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎన్‌.బాలస్వామి


నగరాభివృద్ధిపై వెలంపల్లి మాటలు హాస్యాస్పదం

నగరాభివృద్ధికి సంబంధించి రూ.కోటి కూడా తీసుకురాలేని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు నగరాభివృద్ధి అంతా తానే చేసినట్లు చెప్పకోవడం హాస్యాస్పదంగా ఉంది. సభలో లేని చంద్రబాబు నాయుడ్ని దూషించడం ఎవరి మెప్పుకోసమో ఆయనకే తెలియాలి. కౌన్సిల్‌ను మేయర్‌ సక్రమంగా నడపలేకపోతున్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కనుసన్నల్లో కౌన్సిల్‌ నడుస్తోంది.   

- ముమ్మనేని వెంకట ప్రసాద్‌, జాస్తి సాంబశివరావు, టీడీపీ కార్పొరేటర్లు

ఏకపక్షంగా వైసీపీ ధోరణి

నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో ప్రజాసమస్యలపై పెట్టిన ప్రతిపాదనలపై చర్చించడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కే విధంగా పాలకపక్షం వ్యహరిస్తోంది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమై ప్రశ్నావళి ఒక గంట కూడా సాగకుండానే ఎమ్మెల్యే  వెలంపల్లి... సభ్యులను అగౌరవ పరుస్తూ మాట్లాడిన మాటలు..  కౌన్సిల్‌ సభ్యులను సస్పెండ్‌ చేయించడానికి, కౌన్సిల్‌ని అర్ధాతరంగా ముగించడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తున్నాం.   

- సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ బోయిసత్తిబాబు

Read more