విద్యాహక్కును హరిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-18T06:03:14+05:30 IST

భారత రాజ్యాంగం ఇచ్చిన విద్యాహక్కును హరించే విధంగా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు.

విద్యాహక్కును హరిస్తున్న ప్రభుత్వం

  పాఠశాలల విలీన ప్రక్రియ తక్షణమే ఆపాలి 

 బడుల రక్షణకు ప్రజలతో కలిసి పోరాటం 

 పాఠశాలల పరిరక్షణ వేదిక సదస్సులో వక్తలు 

గవర్నర్‌పేట, జూలై 17 : భారత రాజ్యాంగం ఇచ్చిన విద్యాహక్కును హరించే విధంగా జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 (ఎన్‌ఈపీ) పేరుతో విధ్వంసకర, వినాశనకర నిర్ణయాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం ప్రక్రియ నిలుపుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని, పాఠశాలలను కాపాడుకునే విధంగా ప్రజలతో కలిసి కార్యాచరణ రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే ఆపాలని, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంభించాలని కోరుతూ పాఠశాలల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం యంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన వేదిక (ఎంబీవీకె) భవన్‌లో ‘రాష్ట్ర విద్యారంగం పయనం ఎటు...?’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది.  సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనట్టు తరగతుల్ని తరలిస్తున్న ప్రభుత్వం, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఇది మా రాజకీయ విధానం అంటూ ఒంటెత్తుపోకడలు పోతోందని అన్నారు. ప్రజాస్వామిక చర్య మా విధానం కాదని సవాల్‌ విసురుతోందని, ఇదెక్కడికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావికాస వేదిక కన్వీనర్‌, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ  మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను హైస్కూళ్ళకు తరలింపు నిర్ణయం సరికాదన్నారు. ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ డి. రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన ఎన్‌ఈపీ-2020 పేరుతో విద్యారంగ సంస్కరణలు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, ఎన్‌ఈపీలో గానీ, విద్యాహక్కు చట్టంలో గానీ పాఠశాలల విభజన, ఒకే మీడియంలో బోధన అంశాలు లేవని అన్నారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ విశ్లేషకులు డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌, ఉన్నత విద్య పరిరక్షణ సమితి కన్వీనర్‌ డాక్టర్‌ బి. రాజగోపాల్‌లు మాట్లాడుతూ పాఠశాలల విలీనం పేరుతో తెస్తున్న సంస్కరణలు కిలోమీటర్‌ లోపు ప్రాథమిక పాఠశాలలు ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. సదస్సులో ఎమ్మెల్సీలు వై. శ్రీనివాసులురెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, ఏపీ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కెఎ్‌సఎస్‌ ప్రసాద్‌ ప్రసంగించారు.  


Read more