వైద్య ఆరోగ్య శాఖ ఖాళీల భర్తీలో 1100 మంది అభ్యంతరాలు

ABN , First Publish Date - 2022-09-08T07:20:36+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 296 పోస్టుల భర్తీపై ఆ శాఖ మెరిట్‌ జాబితాను ప్రకటించింది. ఈ మెరిట్‌ జాబితాపై 1100 మంది అభ్యర్ధులు తమ అభ్యంతరాలు తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ఖాళీల భర్తీలో  1100 మంది అభ్యంతరాలు

- 12న అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ : డీఎంహెచ్‌వో జి.గీతాబాయి

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 7 : వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 296 పోస్టుల భర్తీపై ఆ శాఖ మెరిట్‌ జాబితాను ప్రకటించింది. ఈ మెరిట్‌ జాబితాపై 1100 మంది అభ్యర్ధులు తమ అభ్యంతరాలు తెలిపారు. 296 పోస్టులకు 10,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెరిట్‌ లిస్టును ప్రకటించారు. దీనిపై బి ఫార్మసి అర్హత గల ఫార్మాసిస్టు పోస్టులకు ఎం ఫార్మసి అభ్యర్థులు వేయిటేజి ఇవ్వాలని కోరారు. కొవిడ్‌ సమయంలో సేవలందించిన ఏఎన్‌ఎంలు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది అదనంగా మార్కులు కలపాలని కోరారు. కాగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు 600 మంది అభ్యర్థులు తమ అభ్యర్ధనలు తెలిపారు. ఈ పోస్టులకు విశ్వవిద్యాలయం నుంచి డిప్లమో పొందిన వారు మాత్రమే అర్హులు. అయితే బీఎస్సీ కంప్యూటర్‌ పాసైన అభ్యర్థులు తమ డిగ్రీని పరిగణలోకి తీసుకుని ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి తుది మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. మెరిట్‌ జాబితాను ప్రకటించిన అనంతరం 9వ తేదీ రోస్టర్‌ కం మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి సోమవారం నాటికి  ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గీతాబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో ఆమె మాట్లాడారు. అభ్యర్థులు ఇచ్చిన ప్రతి అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులను ఇప్పటికే వడపోయడం జరిగిందన్నారు. మెరిట్‌ కం రోస్టరు లిస్టు ప్రకటిస్తామన్నారు. రిజర్వేషన్లను పరిశీలిస్తూ అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందచేస్తున్నామన్నారు. ప్రతి జాబితా వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని, వీటిపై ఏ విధమైన అభ్యంతరాలున్నా పరిశీలించిన అనంతరమే తుది జాబితా విడుదల చేస్తామన్నారు. తుది జాబితా విడుదల చేసిన అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామన్నారు. 

Read more