మెడికల్‌ పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో అవకతవకలు

ABN , First Publish Date - 2022-04-24T06:13:00+05:30 IST

మెడికల్‌ పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో అవకతవకలు

మెడికల్‌ పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లో అవకతవకలు

ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 

హైకోర్టులో న్యాయపోరాటానికి సన్నాహాలు 

విజయవాడ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లలోనే కాదు.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో కొన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌లో సీట్లను బ్లాక్‌ చేసి, ఆ తర్వాత వాటిని యాజమాన్య కోటాకు బదిలీ చేసి, రూ.కోట్లలో కుంభకోణానికి రంగం సిద్ధం చేసుకున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పీజీ సీట్ల కౌన్సెలింగ్‌లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఎన్టీఆర్‌ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోతున్న అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో అడ్మిషన్ల కోసం పీజీ మెడికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సులకు అర్హులైన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

నిబంధనలు ఉల్లంఘించి..

మొదటి దశ కౌన్సెలింగ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరకపోతే.. తర్వాత నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనుమతించబోమని యూనివర్సిటీ అధికారులు నిబంధనల్లో  పేర్కొన్నారు. వాటిని ఉల్లంఘిస్తూ మొదటి కౌన్సెలింగ్‌లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్లు పొంది.. కేటాయించిన సీట్లలో చేరని అభ్యర్థులు 13 మందిని రెండో కౌన్సెలింగ్‌కు అనుమతించారంటూ పలువురు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఎన్టీఆర్‌ యూనివర్సిటీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సమగ్రంగా విచారిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు బయటపడతారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అనేకమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పీజీ సీట్ల కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఫిబ్రవరి 15న మెరిట్‌ లిస్టును ప్రకటించారు. ఆ మెరిట్‌ లిస్టుపై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. ఈ అభ్యంతరాల ముసుగులో మార్చి 11వ తేదీన కొంతమంది అభ్యర్థులకు కన్వర్షన్‌కు కూడా అవకాశం ఇచ్చారంటూ ఫిర్యాదులు అందాయి. అధికారులే నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో నష్టపోతున్న అభ్యర్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై కొందరు ఇప్పటికే సీనియర్‌ న్యాయవాదులను సంప్రదించినట్టు చెబుతున్నారు.

Updated Date - 2022-04-24T06:13:00+05:30 IST