మేయరుకు అవమానం

ABN , First Publish Date - 2022-09-25T05:54:28+05:30 IST

మేయరుకు అవమానం

మేయరుకు అవమానం

ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో పరాభవం

మంత్రి రజని గన్‌మెన్లు నెట్టేయడంతో కిందపడిన భాగ్యలక్ష్మి

పట్టించుకోని మంత్రి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు

కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయిన మేయర్‌


సత్యనారాయణపురం, సెప్టెంబరు 24 : మేయర్‌ రాయన భాగ్యలక్ష్మికి పరాభవం ఎదురైంది. సెంట్రల్‌ నియోజకవర్గంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకుల నడుమ జరిగిన ఆధిపత్య పోరులో మేయర్‌ను అవమానించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కంటనీరు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. నగర ప్రథమ మహిళ లేకుండానే వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవాన్ని మంత్రి, ఇతర నాయకులు ముగించారు. 32వ డివిజన్‌లోని అయోధ్యనగర్‌లో శనివారం వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి విడదల రజని ప్రారంభించారు. స్థానిక సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్‌ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే కంటే మేయర్‌ ముందు వరుసలో ఉంటారు. కానీ, మేయర్‌ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో పాటు డిప్యూటీ మేయర్‌ అనుచరులు అవమానకరంగా ప్రవర్తించారు. మంత్రి రజని గన్‌మెన్లు ఓవరాక్షన్‌ చూస్తూ మేయర్‌ను కార్యక్రమం జరిగే వేదిక వైపు వెళ్లకుండా అడ్డుకు న్నారు. దీన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే కానీ, డిప్యూటీ మేయర్‌ కానీ చూసీచూడనట్టు ఉండిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ అనుచరులు ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో మంత్రి గన్‌మెన్లు వారిని ఒక్కసారిగా వెనక్కి నెట్టేశారు. ఈ తోపులాటలో మేయర్‌ కిందపడిపోయారు. మేయర్‌ వెంట వచ్చినవారు ఆమెను పైకి లేపారు. ఇంత జరుగుతున్నా మంత్రి విడదల రజని కానీ, స్థానిక ఎమ్మెల్యే విష్ణు, డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి కానీ పట్టించుకోకుండా ప్రారంభోత్సవంలో ఉండిపోయారు. మనస్తాపానికి గురైన మేయర్‌ కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో           కలెక్టర్‌ దిల్లీరావు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌  దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more