రాలిన ఆశల పూత

ABN , First Publish Date - 2022-04-24T06:18:15+05:30 IST

రాలిన ఆశల పూత

రాలిన ఆశల పూత

నష్టాల బాటలో మామిడి సాగు

గత రెండేళ్లు కరోనా.. ఈసారి చీడపీడలు

గణనీయంగా తగ్గిన దిగుబడులు 

మామిడి ధరపై ఢిల్లీ సేఠ్‌ల పెత్తనం


మామిడి రైతులు వరుస నష్టాలతో కుదేలవుతున్నారు. గడిచిన రెండేళ్లు కరోనా కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో నష్టపోయారు. ఈ ఏడాది చీడపీడలు మామిడి రైతుల  ఉసురుతీస్తున్నాయి. దళారుల సిండికేట్‌, ఢిల్లీ సేఠ్‌ల పెత్తనం కారణంగా ఆశించిన ధర రాక లబోదిబోమంటున్నారు. 


జి.కొండూరు/విస్సన్నపేట/ఎ.కొండూరు/రెడ్డిగూడెం/మైల వరం రూరల్‌, ఏప్రిల్‌ 23 : జనవరిలో కురిసిన అకాల వర్షానికి మామిడి పూత రాలిపోయింది. కొన్నిచోట్ల మాడిపోయింది. ఆ ప్రభావం దిగుబడులపై పడింది. గతంలో ఎకరాకు ఆరు టన్నుల వరకు దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం మూడు టన్నులే వస్తోందని, టన్ను కూడా రాని తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. చీడపీడల నివారణతో కలిపి పెట్టుబడి ఖర్చులు అధికంగా అయ్యాయని, దళారులు సిండికేట్‌ అయ్యి ధర కూడా రానివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిన సాగు

ఫ విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాలతో పాటు విజయవాడ రూరల్‌ మండలంలోని కొత్తూరు తాడేపల్లితో కలిసి సుమారు లక్ష ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. ఏడేళ్ల క్రితం వరకు లక్షా పాతిక వేల ఎకరాల వరకు మామిడి సాగులో ఉండేది. వరుస నష్టాలు, కాపు తగ్గిపోవడం, ఆశించిన ధరలు లభించకపోవడం, పెట్టుబడి ఖర్చులు రాని కారణంగా ఆయా మండలాల్లో ముదురు తోటలను చాలావరకు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. తిరువూరు మండలంలో ఎక్కువగా తొలగించారు. 1,900 హెక్టార్లలో సాగయిన తోటలు తొలగించాక కేవలం ఏడు హెక్టార్లకే పరిమితమైంది.  

-- విస్సన్నపేట మామిడికి ప్రత్యేక పేరుంది. ఈ మండలంలో 6 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ప్రస్తుతం బంగినపల్లి టన్ను కాయను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల ధర పలుకుతోంది. తోతాపురి టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఉంది. మార్కెట్‌కు వచ్చే మామిడి ధరను అక్కడున్న ఢిల్లీ సేఠ్‌లే నిర్ణయిస్తున్నారు. 

-- రెడ్డిగూడెం నుంచి ముంబయికి మామిడి ఎగుమతి అవుతోంది. గతంలో ఇక్కడి నుంచి 25 లారీల వరకు బంగినపల్లి, చెరుకురసం రకం ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం రోజుకు 10 లారీలు వెళ్తున్నాయి. విజయవాడ నున్న మార్కెట్‌కు, ఎ.కొండూరు మండలం చీమలపాడు, చంద్రగూడేనికి మామిడి ఎగుమతి అవుతోంది. 

-- చీమలపాడు మామిడి మార్కెట్‌కు గతంలో గిరాకీ ఉండేది. ఒకప్పుడు రోజుకు 200 టన్నుల మామిడి కాయలు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 60 నుంచి 70 టన్నులే వస్తున్నాయి. అయినా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. 
చీడపీడలతో నష్టపోయాం..

కరోనా వల్ల రెండేళ్లుగా నష్టపోతే, ఈ ఏడాది చీడపీడలు పంటను దెబ్బతీశాయి. పూతపై ప్రభావం అధికంగా పడింది.  జనవరిలో పడిన అకాల వర్షంతో పూత మాడిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.   - కుమ్మరి గిరిబాబు, రెడ్డిగూడెం రైతు 


కేరళ, బెంగళూరు కాయలతో పోటీ

పెట్టుబడి ఖర్చులే వస్తున్నాయి. గత ఏడాది కరోనాతో చెట్లకు కాయలు వదిలేశాం. ఈ ఏడాది దిగుబడులు లేవు. ఆశించిన ధర లేదు. కేరళ, బెంగళూరు నుంచి మామిడి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. దీంతో ఈ ప్రాంత మామిడికి డిమాండ్‌ తగ్గిపోతోంది.

- కర్రి సాగర్‌కుమార్‌, విస్సన్నపేట రైతు


ఖర్చులే బాగా అయ్యాయి

సస్యరక్షణకు అదనంగా ఖర్చయింది. ఒక్క పురుగు మందులకే రూ.50 వేల వరకు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో నష్టాలు తప్పేలా లేవు. - ఽధరావతు రంగ, ఎ.కొండూరు మండలం పెద్దతండా రైతు 


పెట్టుబడి ఖర్చులు వచ్చేలా లేవు

చెట్లపై 70 ఎకరాల మామిడిని కొన్నాను. ఎకరాకు సుమారు రూ.50 వేల వరకు చెల్లించాను. మొత్తం 70 ఎకరాల మీద 150 నుంచి 200 టన్నులు దిగుబడి రావాల్సి ఉండగా, 100 టన్నులే వచ్చేలా ఉంది. ఈ క్రమంలో పెట్టుబడి ఖర్చులు కూడా దక్కేలా లేవు.  

- మొగిలి రామయ్య,  వావిలాల రైతు

Read more