లేదు..లేదంటూనే..

ABN , First Publish Date - 2022-08-31T06:31:31+05:30 IST

లేదు..లేదంటూనే..

లేదు..లేదంటూనే..

తిరువూరు, ఆగస్టు 30 : పట్టణంలో ప్రైవేటు వ్యక్తులు డ్రెయినేజీ పూడికతీస్తూ నగదు వసూళ్లు చేస్తున్న అంశంపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చనీయాంశమైంది.  ఈ అంశాన్ని ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకు రాగ అధికార పార్టీ  సభ్యులు అటువంటిది ఏమీ లేదంటూనే.. తాము  డ్రెయినేజీ పూడిక తీసిన వ్యక్తులకు నగదు ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరి అధ్యక్షతన  కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఎజెండాలోని ఐదు అంశాలను సభ్యు లు ఆమోదించారు.  ప్రైవేటు వ్యక్తులు డ్రెయినేజీ పూడిక తీసి నగదు వసూళ్లు చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌, ఎన్‌.సురేంద్ర ప్రస్తావించారు.  వైస్‌చైర్మన్‌ వెలుగోటి విజయలక్ష్మి  అటువంటిది ఏమీ లేదని, వాస్తవం కాదని అనగా,  వైసీపీ కౌన్సిలర్‌ తంగిరాల వెంకటరెడ్డి తాను ప్రైవేటు వ్యక్తులకు రూ.6 వేలు ఇచ్చి తన ఇంటి వద్ద డ్రెయినేజీ పూడిక తీయించానని చెప్పారు.  మరో కౌన్సిలర్‌ పరసా శ్రీనివాసరావు(బీరువాల బాబు)తాను రూ.2వేలు ఇచ్చి తన ఇంటిముందు పూడిక తీయించినట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రెయిన్లు పూడిక తీయకపోవడంతో వర్షం వస్తే  నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తప్పనిసరిగా డ్రెయిన్లు పూడిక తీయాల్సి వచ్చిందని  పాలకవర్గం సభ్యులు తెలిపారు.


ఓపెన్‌ డ్రెయిన్‌ను మున్సిపల్‌ కార్మికులు పూడికతీస్తున్నారని, ఆక్రమణలు, డ్రెయిన్‌పై  నిర్మాణాలు జరిగిన చోట సంబంధిత భవన యాజమానులే ప్రైవేటు వ్యక్తులతో డ్రెయిన్‌ పూడికతీయించుకుంటున్నారని పాలకవర్గం సభ్యులు   సమర్ధించుకోవడం గమనార్హం.  పట్టణంలో పందులు, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు కోరారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్‌ గుమ్మ వెంకటేశ్వరి,  కమిషనర్‌ కెవిఎన్‌ఎ్‌స.శర్మ, మేనేజర్‌ త్రినాథ్‌, జేఏవో  లావణ్య, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read more