కి‘లేడీ’

ABN , First Publish Date - 2022-11-24T00:42:55+05:30 IST

పార్టీ అధికారంలో ఉంది. పార్టీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు చేతుల్లో ఉన్నారు. అడుగులు ఎటు నుంచి ఎటువేసినా తనకు అడ్డులేదనుకుంది వైసీపీకి చెందిన నాయకురాలు. ఆధునిక మహిళ అవతారంలో పనికిమాలిన పనులకు తెరతీసింది. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండగా, అనేక చీకటి కోణాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది.

కి‘లేడీ’

అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో యువకులకు ఎర

ఆనక తెలియనట్టు సంఘ సంస్కర్తలా రైడింగ్‌

యువకులను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలు

గ్యాంగ్‌వార్‌లోని నిందితులతో దోస్తీ

వైసీపీ ‘తూర్పు’ నేతకు చెల్లెలినని ప్రచారం

పటమట రైతుబజార్‌లో రుబాబు

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అరెస్టు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : యువతులను ఎర వేయడంతో పాటు ఇద్దరు యువతీ యువకులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో వైసీపీ మహిళా నేత, తూర్పు నియోజకవర్గ నేతకు చెల్లెలిగా చెప్పుకొనే నాగసాయితో పాటు మరో యువకుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా బుధవారం రాత్రి వెల్లడించారు. పటమటలోని తోట వారి వీధికి చెందిన గురు నాగసాయి అనే మహిళ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలిగా వ్యవహరిస్తోంది. పటమట హైస్కూల్‌ రోడ్డులో వస్త్ర దుకాణం నిర్వహించేది. దీనితో పాటు ఇక్కడే ఉన్న రైతుబజార్‌లో దుకాణాలను నిర్వహిస్తోంది. ఒక లాడ్జిలో అశోక్‌నగర్‌కు చెందిన యువకుడు.. యువతితో కలిసి ఉండగా, నాగసాయితో పాటు మరో యువకుడు అక్కడికి వెళ్లారు. వారిని బెదిరించారు. ఆ యువకుడ్ని రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాగసాయి హడావుడి చూసిన ఆ యువకుడు అక్కడికక్కడే రూ.50 వేలను ఇచ్చాడు. మరో రూ.40 వేలను దఫదఫాలుగా ఇచ్చాడు. ఇంకా అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు లాడ్జిలో ఉన్న వీడియోలను బయట పెడతామని బెదిరించడంతో ఆ యువకుడు పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ సాగించిన పోలీసులు పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నాగసాయితో పాటు ఒక యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

గ్యాంగ్‌వార్‌ సభ్యులే అనుచరులు

తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకుడి చెల్లెలిగా చెప్పుకొనే నాగసాయి వద్ద ఉండే అనుచరులంతా యువకులే. 2020లో జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఉన్న నిందితులే వారంతా. ఎక్కడా సీన్‌లోకి ఆమె రాకుండా మొత్తం వ్యవహారాలను వారే చక్కబెడతారు. యువతుల నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించి, ఇతర యువకుల వద్దకు పంపడంలో ఆమె సూత్రధారి. యువతి, యువకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు దాడిచేసి పట్టుకునేది కూడా ఆమే. ఈ వ్యవహారాల్లో అవతలి వ్యక్తులను బెదిరించడానికి గ్యాంగ్‌వార్‌లోని నిందితులను ఉపయోగించుకుంటుంది. సనత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్‌ వెనుక తిరిగాడు. పటమట హైస్కూల్‌ రోడ్డులో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ చేస్తున్నాడు. అతడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి అశోక్‌నగర్‌కు చెందిన యువకుడిని బెదిరించారు. అలాగే, గ్యాంగ్‌వార్‌ యువకుల బలంతో ఆమె పటమట రైతుబజార్‌లో దౌర్జన్యాలకు దిగిందని రైతులే చెబుతున్నారు. ఈ అనుచరగణంతోనే శివారు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేయించిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

Updated Date - 2022-11-24T00:42:55+05:30 IST

Read more