కేయూ పరీక్షలు ఇక భారం

ABN , First Publish Date - 2022-09-11T06:24:54+05:30 IST

కేయూ పరీక్షలు ఇక భారం

కేయూ పరీక్షలు ఇక భారం

ఫీజులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులపై పెనుభారం పడింది. పరీక్ష ఫీజులను ఆయా సెమిస్టర్లవారీగా అమాంతం పెంచేశారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజులనూ పెంచారు. జవాబుపత్రాల రీవాల్యుయేషన్‌, పరిశీలన, ప్రాక్టికల్‌ పరీక్షల ఫీజుల పెంపు కూడా జరిగింది. 

5నే ఉత్తర్వులు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో 120 కళాశాలలున్నాయి. వీటిలో 30వేల మంది డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నారు. అన్ని కోర్సులకు సంబంధించిన ఫీజులను పెంచాలని ఏప్రిల్‌ 26న ఎగ్జ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు పరీక్ష ఫీజులను పెంచుతూ ఈనెల 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఫీజుల పెంపుతో ఆర్థిక  భారం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 

పెంపు ఇలా..

యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఏ, బీసీఏ, బీకాం, బీబీఎం తదితర కోర్సుల్లో అన్ని పరీక్షలు రాసేందుకు గతంలో ఒక్కో సెమిస్టర్‌కు పరీక్ష ఫీజు రూ.380 ఉండేది. ప్రస్తుతం రూ.750కు పెంచారు. సప్లిమెంటరీ ద్వారా పరీక్ష రాయాల్సి వస్తే ఒక్కో సబ్జెక్టుకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.250 చేశారు. రెండు సబ్జెక్టులకు రూ.270గా ఉన్న ఫీజును రూ.500కు, మూడు సబ్జెక్టులకు రూ.380గా ఉన్న ఫీజును రూ.750కు పెంచారు. ప్రాక్టికల్‌ పరీక్షకు రూ.90గా ఉన్న ఫీజును రూ.130కు, రీవాల్యుయేషన్‌ ఫీజు రూ.600ను, రూ.800కు పెంచారు. బీటెక్‌, బీ-ఫార్మసీ కోర్సులకు సంబంధించి సెమిస్టర్‌ ఫీజు రూ.780 ఉండగా, నేడు వెయ్యి రూపాయలైంది. ఈ రెండు కోర్సుల్లో నాలుగు సబ్జెక్టుల్లో సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి వస్తే, గతంలో రూ.460 చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం ఈ ఫీజును రూ.వెయ్యికి పెంచారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సిటీ పరీక్షల ఫీజును ఒక్కో సెమిస్టర్‌కు రూ.780 నుంచి రూ.వెయ్యికి పెంచారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఫీజు రూ.220 నుంచి రూ.350కు, రెండు సబ్జెక్టులకు రూ.280 నుంచి రూ.700కు పెంచారు. మూడు సబ్జెక్టులకు రూ.380 చెల్లించాల్సి ఉండగా, రూ.వెయ్యికి పెంచారు. బీఈడీ కోర్సులకు సంబంధించి ఒక్కో సెమిస్టర్‌కు మొత్తం ఫీజు రూ.660 ఉండగా, రూ.900కు పెంచారు. ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ క్యాంపస్‌లో చదివే వారికి సైతం ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోర్సుల్లో గతంలో ఒక్కో సెమిస్టర్‌ పరీక్ష ఫీజు రూ.885 ఉండగా, రూ.1,300కు పెంచారు. ఈ కోర్సుల్లో మూడు సబ్జెక్టులకు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి వస్తే, గతంలో రూ.440గా ఉన్న ఫీజును రూ.800కు పెంచారు. ఎల్‌ఎల్‌బీ, బీఏఎల్‌ ఎల్‌బీ మూడు, ఐదేళ్ల కోర్సుల పరీక్షల ఫీజును రూ.350 నుంచి రూ.750కు పెంచారు. ఎం-ఫార్మశీ, ఫార్మా-డీ కోర్సులకు పరీక్ష ఫీజును రూ.1,610 నుంచి రూ.1,800కు పెంచారు. ఈ కోర్సుల్లో ఒక్కో సబ్జెక్టు రీవాల్యుయేషన్‌ ఫీజు గతంలో రూ.910గా ఉంటే, రూ.1,100కు పెంచారు. కేరీర్‌ ఓరియెంటెడ్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫీజులను కూడా పెంచారు. డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తయ్యాక ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు గతంలో ఉన్న రేట్లను మాత్రం తక్కువగా పెంచారు.


Updated Date - 2022-09-11T06:24:54+05:30 IST