జలమయం!

ABN , First Publish Date - 2022-10-08T06:06:53+05:30 IST

జలమయం!

జలమయం!

 వర్షం వస్తే నూజివీడు రోడ్డు ఇంతే

  ప్రవాహ మార్గం లేక రోజుల తరబడి రోడ్డుపైనే నీరు

 డ్రెయినేజీ నిర్వహణను పట్టించుకోని పంచాయతీ 

  ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు 


విజయవాడ రూరల్‌, అక్టోబరు 7 : వర్షం కురిస్తే చాలు విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రహదారి జలమయం అవుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నున్నలో పలుచోట్ల రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండి, తటాకాలను తలపిస్తోంది. నున్న గ్రామంలోనే కాకుండా శివారున పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ వద్ద కూడా రోడ్డుపై రోజుల తరబడి వర్షపు నీరు నిలిచి ఉంటోంది. పవర్‌గ్రిడ్‌ ప్రాంతంలో ఇటీవల అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం పెరగడం, ఫ్లాట్‌లలో వాడకపు నీరు పోయేందుకు డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్డుకు సైతం మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్డుపైనే నిల్వ ఉంటోంది. దీంతో వాహనాల రాకపోకలతోపాటు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా స్థానిక పవర్‌గ్రిడ్‌ నుంచి గొల్లపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వరకు రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉంది. అపార్ట్‌మెంట్‌లలోని వాడకపు నీటితోపాటు వర్షపు నీరు తోడవడం, ఆ నీరు పోయే మార్గం లేకపోవడం వల్లే నీరంతా రోడ్డుపైకి చేరుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆర్‌ అండ్‌ బీ, గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పలువురువాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నున్నలో విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు డ్రెయినేజీ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-10-08T06:06:53+05:30 IST