తెలుగు రాయడమే రావట్లేదు!

ABN , First Publish Date - 2022-11-23T00:59:32+05:30 IST

పాఠశాల నిర్వహణ నిధులతో కోనేరు బసవయ్య చౌదరి పాఠశాలలో మౌలిక వసతుల పనులను కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తొమ్మిది, పదోతరగతి విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల విద్యా బోధనను అడిగి తెలుసుకున్నారు.

తెలుగు రాయడమే రావట్లేదు!
బోర్డు మీద పేరు రాస్తున్న విద్యార్థి.. పరిశీలిస్తున్న కలెక్టర్‌

విజయవాడ నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల నిర్వహణ నిధులతో కోనేరు బసవయ్య చౌదరి పాఠశాలలో మౌలిక వసతుల పనులను కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం తొమ్మిది, పదోతరగతి విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల విద్యా బోధనను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని బోర్డు మీద పేరు తెలుగులో రాయమన్నారు. విద్యార్థులు తమ పేరును కూడా తప్పుగా రాయడంతో పిల్లలకు చదువుతోపాటు రాయడం కూడా నేర్పించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ సూచించారు. పదోతరగతి విద్యార్థులు తెలుగు కూడా చదవలేని స్థితిలో ఉన్నారని డీఈవో సీవీ రేణుకపై అసహనం వ్యక్తం చేశారు. తమ పేరు రాయడానికి కూడా కష్టపడుతున్న వారు ఇతర సబ్జెక్టులు ఎలా నేర్చుకోగలరని విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులు లెక్కల్లో చాలా వెనుకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించి నాణ్యత, నిర్వహణ, సరిగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోనే మోడల్‌ పాఠశాలగా పేరున్నా అందుకు తగ్గ ప్రమాణాలు లేవన్నారు. అన్ని పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. డీఈవో సీవీ రేణుక, ప్రధానోపాధ్యాయులు కేఏ ప్రేమ్‌సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:59:32+05:30 IST

Read more