ఖతర్నాక్‌.. ఇర్ఫాన్‌..

ABN , First Publish Date - 2022-11-25T01:05:44+05:30 IST

ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ వ్యాపారం.. కూరగాయల దుకాణం.. ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం.. ఇవన్నీ వింటుంటే అతడు పెద్ద కష్టజీవి అనిపిస్తుంది. ఇది పైకి కనిపించే రూపం మాత్రమే. వాస్తవానికి అతడు ఓ కంత్రీ. అతడే సనత్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌. రాసలీలల కేసులో ఇప్పుడు ఇతని పేరే ప్రధానంగా వినిపిస్తోంది.

ఖతర్నాక్‌.. ఇర్ఫాన్‌..
నడిరోడ్డుపై ఇర్ఫాన్‌ బైక్‌ విన్యాసాలు

అధికార పార్టీ కార్యకర్తగా అరాచకాలు

యువకుడి వద్ద డబ్బు వసూలు చేసింది ఇతనే..

గ్యాంగ్‌వార్‌ నిందితులతో దోస్తీ

సెటిల్‌మెంట్లతో హల్‌చల్‌

పటమట పీఎస్‌లో పలు కేసులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : రాసలీలలకు ఎర వేసి, బెదిరించి డబ్బు వసూలు చేసిన మహిళ గురు నాగసాయి కేసులో ఇప్పుడు ఇర్ఫాన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లుగా ఈ యువకుడు చేసిన ఘనకార్యాలపై పటమట కేంద్రంగా చర్చ నడుస్తోంది. ఓ యువనేత పేరుతో ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ను నిర్వహిస్తున్నాడు. గ్యాంగ్‌వార్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న సనత్‌నగర్‌కు చెందిన మణికంఠ అలియాస్‌ కేటీఎం పండుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పటమటలో చెప్పుకొంటున్నారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటూ, పటమట కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. పంటకాల్వ రోడ్డులో ఆటోమొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ షాపులో కొంతమంది యువకులతో భేటీలు నిర్వహిస్తున్నాడు. పటమట రైతుబజార్‌లో ఒక షాపును నిర్వహిస్తున్నాడు. ఓ యువనేత ముఖ్య అనుచరుడు సిఫార్సు చేసి ఈ షాపు ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఫ్లెక్సీ బ్యానర్లు కట్టే కాంట్రాక్టర్లు ఒప్పుకొనే పనులు చేస్తున్నాడు. కొంతమంది యువకులను అనుచరులుగా మార్చుకుని అధికార పార్టీ ర్యాలీల్లో పాల్గొంటాడు. పటమటలో అధికార పార్టీ నేతలు, వైఎస్సార్‌ పేరుతో ఫ్లెక్సీలు ఇర్ఫాన్‌ తన ఫ్రెండ్‌ సర్కిల్‌తో కలిసి ఏర్పాటు చేస్తాడు. కొద్దినెలల క్రితం ఆటోనగర్‌ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కొద్దినెలల క్రితం పటమట ఉన్నత పాఠశాల వీధిలో ప్రేమికుల మధ్య వచ్చిన వివాదంలో ఇర్ఫాన్‌ తలదూర్చాడు. వివాదంలో ఓ యువతిని నడిరోడ్డుపై ఇష్టానుసారంగా కొట్టాడు.

నాగసాయి కాదు.. సాయికుమారి

రాసలీలల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న వైసీపీ మహిళా నేత పేరు గురు నాగసాయి అని అంతా భావించారు. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోనూ అదే పేరుతో ఆమె ప్రొఫైల్‌ ఉంది. ఆమె అసలు పేరు పరసా సాయికుమారి. అయ్యప్పనగర్‌లోని ఉమర్‌ ఫరూక్‌ వీధికి చెందిన ఓ యువకుడికి అమ్మాయిని పరిచయం చేసింది సాయికుమారి. ఈ విషయంలో ఆమెకు ఇర్ఫాన్‌తో పాటు సలీం, మస్తాన్‌ అనే యువకులు సహకరించారు. పరిచయం స్థాయి దాటిపోవడంతో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వాళ్లిద్దరూ ఉన్న విషయం ఈ ముగ్గురికి ముందే తెలియడంతో వెళ్లి పెద్ద గొడవ చేశారు. మధ్యలో ఇర్ఫాన్‌ సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా నటించాడు. వాస్తవానికి అమ్మాయిని తీసుకెళ్లిన యువకుడు.. ఇర్ఫాన్‌ స్నేహితుడు కావడం గమనార్హం. అతడి నుంచి డబ్బు వసూలు చేయడానికి సాయికుమారితో కలిసి స్కెచ్‌ వేశారు.

రాసలీలల కేసులో..

నాగసాయి కేసులో ఇర్ఫాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విచారణకు హాజరవుతానని చెప్పిన ఇర్ఫాన్‌ కొద్దిసేపటికే సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌ఐలో నాగసాయి, సలీం, మస్తాన్‌ పేర్లే ఉన్నాయి. పోలీసులు ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. ఆ యువకుడు ఇర్ఫానా, కాదా అన్నది తేలనుంది. నాగసాయి వ్యవహారంతో సామాజిక మాధ్యమాల్లో ఉన్న అతడి అకౌంట్లను డీయాక్టివేట్‌ చేశాడు. లాడ్జీలో యువకుడ్ని బెదిరించిన వ్యవహారంలో అతడి నుంచి వసూలు చేసిన మొత్తం డబ్బు ఇర్ఫాన్‌ ఫోన్‌పేకు వెళ్లాయి.

యువతి ఇంట విషాదం... గుండెపోటుతో తండ్రి మృతి

రాసలీలల కేసులో వైసీపీ మహిళా నేత పరసా సాయికుమారి ఘనకార్యాలకు ఓ గుండె ఆగిపోయింది. ఆమె ఎరగా వాడుకున్న అమ్మాయి తండ్రి బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పటమటకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను సాయికుమారి తన అవసరాలకు ఉపయోగించుకుంది. ఇందులో భాగంగానే అయ్యప్పనగర్‌కు చెందిన యువకుడికి అప్పగించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు వీడియోలు చిత్రీకరించింది. బాధితుడు బయటకు రావడంతో సాయికుమారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో ఆ యువతి పేరూ బయటపడింది. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మొత్తం వార్తలు విన్న యువతి తండ్రి గుండెపోటుతో మరణించారు. సాయికుమారి చేసిన నిర్వాకం కారణంగా నిండు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2022-11-25T16:07:16+05:30 IST

Read more