స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-08-15T05:49:23+05:30 IST

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మచిలీపట్నంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది.

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : భారత 75వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు మచిలీపట్నంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆర్‌కే రోజా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆనంతరం జిల్లా అభివృద్ధిని వివరిస్తూ ఆమె ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండులో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మహేష్‌కుమార్‌ రావిరాల ఏఎస్పీ ఎన్‌ఎస్‌పీఎన్‌వీ రామాంజనేయులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శకటాలను, స్టాల్స్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఉత్తమ సేవలందించిన 300 మంది అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ ఉత్తమసేవా పురస్కారాలను అందించనున్నట్టు జేసీ తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెరేడ్‌ గ్రౌండులో ఉచిత మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయాలన్నారు. 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులతో  భారత స్వాతంత్రదినోత్సవ ఔన్నత్యాన్ని చాటుతూ 30 నిముషాలపాటు సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని డీఈవో తెహరా సుల్తానాకు సూచించారు. పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌కు ప్రాంగణంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు జేసీ సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్‌ ఏఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కిషోర్‌, తహసీల్దార్‌ సునీల్‌బాబు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T05:49:23+05:30 IST