అప్పుల కోసం యాప్పుల వలలో..

ABN , First Publish Date - 2022-02-19T06:25:11+05:30 IST

అవసరానికో అప్పు.. దానికో యాప్‌.. ఎవరెవరినో బతిమలాడుకోవాల్సిన పని లేదు.

అప్పుల కోసం యాప్పుల వలలో..

గూగుల్‌ యాప్‌ల ద్వారా అసరానికి అప్పులు 

అడిగిన గుర్తింపు కార్డులన్నీ అప్‌లోడ్‌

బాకీ తీర్చే వరకూ ఫోన్లలో వేధింపులు

వడ్డీ సహా చెల్లించినా వదలరు

కాల్‌ చేసి మరీ అసభ్య ధూషణలు

వడ్డీపై వడ్డీ.. తీర్చలేక కొందరి ఆత్మహత్య


అవసరానికో అప్పు.. దానికో యాప్‌.. ఎవరెవరినో బతిమలాడుకోవాల్సిన పని లేదు. ప్రాంసరీ నోటు ప్రస్తావనే ఉండదు. చిరునామా కోసం గుర్తింపు పత్రాలు ఇస్తేసరి.. కోరినంత అప్పు ఖాతాలో జమవుతుంది. ఇంత వరకే తెలుసు చాలామందికి. అందుకే అత్యవసరం అనుకుంటే ఆన్‌లైన్‌ మనీ యాప్‌లను ఆశ్రయించేస్తున్నారు. అప్పు తీసుకునేవరకూ తీపిగానే ఉంటాయి వాళ్ల లావాదేవీలు.. ఆ తరువాతే బయటపడుతుంది అసలు రూపం.. మొన్నటి వరకూ మైక్రో ఫైనాన్స్‌ల వలలో చిక్కుకున్నవారి కష్టాలే వీరికి కూడా.. వడ్డీపై వడ్డీ.. అప్పు తీర్చినా తీర్చలేదని అసభ్య దూషణలు.. దుష్ప్రచారాలతో అవమానాలు.. ఈ వల లోంచి బయటపడలేక ఆత్మహత్యల బాటలు పడుతున్నవారెందరో..   


చిరు... ఓ ప్రైవేటు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం గూగుల్‌ పే ద్వారా కోకో లోన్స్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. యాప్‌లో అడిగిన అన్నింటికీ అనుమతులు ఇచ్చేశాడు. ఆధార్‌, పాన్‌కార్డు, ఫొటో అప్‌లోడ్‌ చేశాడు. తన స్నేహితుల ఫోన్‌ నంబర్లను తెలుసుకునే వెసులుబాటు కల్పించాడు. ఆ మర్నాడు అతని బ్యాంక్‌ ఖాతాలో రూ.4,640 జమయ్యాయి. దీనికి మరో రూ.4వేలు వడ్డీగా జతచేసి మొత్తం రూ.8వేలు చెల్లించాలని సంస్థ ప్రతినిధులు మెసేజ్‌లు పంపారు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న అతడు అదే యాప్‌ నుంచి జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. ఇక్కడితో కథ సుఖాంతం కాలేదు. ఆ తర్వాత నుంచి కంపెనీ నుంచి ప్రతినిధులు ఫోన్లు చేసి రూ.8వేలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. చివరకు అతడు రూ.8వేలు చెల్లించేశాడు. అయినా సంస్థ ప్రతినిధులు చిరు ఫొటోను అతడి స్నేహితులకు పంపారు. తమ సంస్థ నుంచి రుణం తీసుకుని చెల్లించడం లేదని మెసేజ్‌ పంపారు. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ

ఆధునిక ప్రపంచంలో అవసరాలు తీర్చుకునే మార్గాలు అందంగా, సౌకర్యవంతంగా కనిపిస్తాయి. కానీ ఆ దారిలో కంటికి కనిపించని ముళ్లుంటాయని, దిగబడితే బయటకు రావడం కూడా కష్టమని ప్రవేశించాకే తెలుసుకుంటున్నారు చాలామంది. ఒకరో ఇద్దరో కాదు... ఒకరి తర్వాత మరొకరు, ఒకరిని చూసి ఇంకొకరు ఆన్‌లైన్‌ మనీ యాప్‌లలో ఇరుక్కుపోయి విలవిలలాడుతున్నారు.


తీసుకోవడం సులభమే.. ఆ తరువాతే..

హామీలు లేవు. ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి దస్తావేజులూ ఇవ్వాల్సిన పని అంతకన్నా లేదు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో ఉన్న వివరాలు నమోదు చేస్తే చాలు. చిటికెలో అప్పు పుట్టుకొస్తోంది. నగదు అత్యవసరం అయినప్పుడు ఇదే బాగుందనుకుంటున్నారు కొందరు. గూగుల్‌ పే, ఫోన్‌ పేలో వచ్చిన ప్రకటనలను చూసి, ప్లే స్టోర్‌లో ఉన్న ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ యాప్‌లను వెతికి మరీ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అవసరం పీక మీద కత్తిలా ఉండడంతో యాప్‌లో అడిగిన అన్నింటికి ఓకే చెబుతున్నారు. గుర్తింపు, చిరునామాల కోసం ఆధార్‌, పాన్‌కార్డులను, ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ తరువాత దాని నుంచి బయటపడలేక విలవిలలాడుతున్నారు.


కరోనా కష్ట కాలంలో..

ఈ యాప్‌ల బాగోతం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కరోనా కష్టకాలంలో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. కొవిడ్‌ కారణంగా ఆర్థిక రంగం కుదేలైంది. కొంతమంది కొలువులను కోల్పోయారు. ఎంత అడిగినా అప్పు పుట్టలేదు. ఇలాంటి వాళ్లంతా ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ యాప్‌లను ఆశ్రయించారు. ఈ యాప్‌ల వలలో తాము చిక్కుకున్నామని గుర్తించేసరికే చాలా నష్టపోయారు. దీని నుంచి బయటపడే దారి లేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరికొంతమంది పొరుగు వారి నుంచి అప్పులు తీసుకుని మరీ ఆన్‌లైన్‌ అప్పును తీర్చుకున్నారు. 


చెల్లించినా తొలగించరు

ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ యాప్‌లన్నీ మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు అస్మిత, స్పందన వంటి సంస్థలు ఉండేవి. ఈ సంస్థల కార్యకలాపాలను తగ్గించిన తర్వాత మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోకి ప్రవేశించాయి. ఉత్తరాదికి చెందిన పెట్టుబడిదారులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి తీసుకుని ఆన్‌లైన్‌ మనీ ఎర్నింగ్‌ యాప్‌లను నిర్వహిస్తున్నారు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మొత్తం నాలుగైదు స్థాయిల్లో ఈ వ్యవహారాలు సాగుతుంటాయి. నగదు లావాదేవీలు మొత్తం డిజిటల్‌ రూపంలోనే నడుస్తాయి. తీసుకున్న మొత్తాన్ని చెల్లించని వారిని హిందీలో అసభ్యకరంగా దూషించడానికి కాల్‌సెంటర్లలో కొంతమంది ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. అప్పు తీసుకున్న వారికి సందేశాలు పంపడానికి మరో బృందం పనిచేస్తోంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి ఒక టీమ్‌, వాటికి ఆమోదముద్ర వేయడానికి మరో టీమ్‌ పనిచేస్తాయి. వాస్తవానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం 18 శాతం వరకు వడ్డీని వసూలు చేసుకోవచ్చు. ఈ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజు, దరఖాస్తు ఫీజు, జీఎస్టీ వంటి అంశాలను జోడించి 200 - 300 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం చెల్లించే వరకు కాల్‌సెంటర్‌ నుంచి వరుసగా ఫోన్లు వస్తూనే ఉంటాయి. వాళ్లు ఇచ్చిన గడువులోగా డబ్బులు చెల్లించకపోతే అప్పు తీసుకున్న వ్యక్తి ఫొటోతోపాటు ‘మీ స్నేహితుడు మా సంస్థ నుంచి అప్పును తీసుకుని ఎగవేశాడు.’ అని మెసేజ్‌లు పంపేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారు డబ్బులు చెల్లించేసినా ఆ మెసేజ్‌లను తొలగించడం లేదు. వాటిని తొలగించేందుకు, మరొకరికి ఈ సందేశాలను పంపకుండా ఉండేందుకు మరో 24 గంటల సమయం తీసుకుంటున్నారు. 

Updated Date - 2022-02-19T06:25:11+05:30 IST