ఎడ్లంక దుస్థితికి అక్రమ మైనింగే కారణం

ABN , First Publish Date - 2022-09-17T06:52:41+05:30 IST

ఎడ్లంక దుస్థితికి అక్రమ మైనింగే కారణం

ఎడ్లంక దుస్థితికి అక్రమ మైనింగే కారణం
ఎడ్లంకలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న శ్రావణ్‌కుమార్‌

 గ్రామానికి రక్షణ గోడ నిర్మించాలి.. ప్రభుత్వం స్పందించకుంటే ‘చలో అవనిగడ్డ’:  మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌ కుమార్‌ 

అవనిగడ్డ టౌన్‌/రూరల్‌, సెప్టెంబరు 16: ‘‘ఎడ్లంక గ్రామ దుస్థితికి ప్రభుత్వం నిస్సిగ్గుగా చేస్తున్న అక్రమ మైనింగే కారణం. అక్రమ మైనింగ్‌పై గ్రామస్థుల సహకారంతో తాను హైకోర్టులో పిల్‌ వేయకుంటే ఈపాటికే గ్రామం కనుమరుగయ్యి ఉండేది.’’ అని గ్రామస్థులతో కలసి అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జై భీం భారత్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. నదికి రెండు మీటర్ల ఖాళీ వదిలి అక్కడి నుంచి బుసక అక్రమంగా తవ్వే యడంతో ఏర్పడిన ప్రమాదకర ప్రాంతాన్ని ఆయన శుక్రవారం పరిశీ లించారు. దీవి గ్రామమైన పాత ఎడ్లంక ప్రజలు 42 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అక్కడి చిన్నారులు బడికి వెళ్లాలన్నా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా నాటు పడవల్లో దాటాల్సి వస్తోందని, ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఆసుపత్రికి చేరాలన్నా వీలు లేకుండా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడి ప్రజలు కునారిల్లిపోవడమేనా అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి డబ్బులు సంపాదించటం, అక్రమ వ్యాపారాలు చేయడం, స హజ సంపద దోచుకోవడం, రాజకీయంగా అడ్డొచ్చిన వారిని అగణదొక్క డంపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై లేదన్నారు. పడవలో బడికి వెళుతున్న చిన్నారులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. 

ఎడ్లంక సమస్యల పరిష్కారానికి న్యాయపోరాటం

ఎడ్లంక గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వాల ఉదాసీనతే కారణమని శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తాను న్యాయపోరాటం చేస్తానని గ్రామ స్థులకు హామీ ఇచ్చారు. ఎడ్లంక వాసులు బయట ప్రపంచానికి చేరుకు నేందుకు కనీస సౌకర్యమైన వంతెన నిర్మాణం, గ్రామ మనుగడను కాపాడేందుకు గ్రామం చుట్టూ వరద తాకిడి నుంచి రక్షణ కల్పించే గోడలను నిర్మించాలని, దీనిపై తాను హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేస్తానని, కేవలం న్యాయపోరాటంతోనే ఆగకుండా స్థానిక ప్రజలతో కలసి ప్రజా పోరాటం చేసేందుకూ వెనుకాడబోమన్నారు. ఎడ్లంక వాసుల అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వారంలో స్పష్టమైన ప్రకటన విడుదల చేయని పక్షంలో చలో అవనిగడ్డ నిర్వహించి, భారీ ప్రజా సమూహంతో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్‌, బీఎస్పీ నేత సముద్రాల అంబేడ్కర్‌, టీడీపీ నేత కర్రా సుధాకర్‌,  సర్పంచ్‌ పాలేపు సామ్రాజ్యం పాల్గొన్నారు. 

దళితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేవా జగన్‌..?

చల్లపల్లి: చింతలమడ రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోకపోవడం దారుణమనీ, కష్టాల్లో ఉన్న దళి తులకు భరోసా ఇచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ రాష్ట్రంలో లేరా అని జై భీమ్‌ భారత్‌ పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. లక్ష్మీపురం శివారు చింతలమడ దళితవాడను ఆయన సందర్శించారు. కాసానగర్‌ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షత గాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద కార ణాలు, కుటుంబ నేపథ్యం, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్‌ లీక్‌ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు కోటిరూపాయల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు దళితులు చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇవ్వలేవు జగన్‌ అని ప్రశ్నించారు. నాడు ప్రభుత్వ దోపిడీని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆగమేఘాలపై వచ్చి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారనీ, నేడు చింతలమడ దళితులు ఓట్లు వేయలేదా.. జై జగన్‌ అంటూ నీవెంట తిరగలేదా అని నిలదీశారు. తొలుత భార్యను పోగొ ట్టుకున్న చినశివాజీ కన్నీళ్లపర్యంతమవుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కూలీనాలీ చేసుకుని బిడ్డలను కష్టపడి చదివించుకున్నామనీ, రోడ్డు ప్రమాదంలో భార్యను పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్సీ కమీషన్‌ ఛైర్మన్‌ను కలిసి సాయం కోరామని తెలిపారు.


Updated Date - 2022-09-17T06:52:41+05:30 IST