హై స్పీడ్‌ ఇంటర్నెట్‌..

ABN , First Publish Date - 2022-06-11T06:38:43+05:30 IST

హై స్పీడ్‌ ఇంటర్నెట్‌..

హై స్పీడ్‌ ఇంటర్నెట్‌..

- గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, డిజిటల్‌ లైబ్రరీల కోసం.. 

- హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సేవల విస్తరణపై జిల్లా యంత్రాంగం దృష్టి 

- ఏపీ ఫైబర్‌నెట్‌కు తొలి ప్రాధాన్యత 

- చైర్మన్‌తో భేటీ కానున్న కలెక్టర్‌ దిల్లీరావు 

- ఓన్లీ ఇంటర్‌నెట్‌కు సాధ్యా సాధ్యాలపై చర్చ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): మరుగున పడిన ఏపీ ఫైబర్‌నెట్‌ విస్తరణపై ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను అందించే ఫైబర్‌నెట్‌ కనెక్షన్లను గణనీయంగా పెంచేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులకు ఇంటర్‌నెట్‌ సేవలు ఏపీ ఫైబర్‌నెట్‌తో అనుసంధానమై ఉన్నాయా లేదా అన్న వివరాలను సేకరించనుంది. ఇటీవలి కాలంలో గ్రామ సచివాలయాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ దిల్లీరావు పరిశీలించిన క్రమంలో ఇంటర్‌నెట్‌ విషయంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. సచివాలయ ఉద్యోగులు కొందరు మొబైల్‌ హాట్‌స్పాట్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ సేవలు ఉపయోగించుకోవటాన్ని కూడా ఆయన పరిశీలించారు. నెట్‌వర్క్‌ ఇలా ఉంటే ప్రజలకు వేగంగా సేవలు అందించలేమని భావించిన కలెక్టర్‌ హై స్పీడ్‌ నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం 4జీ నుంచి 5జీ నెట్‌వర్‌ ్కలోకి వస్తున్నా.. ఆ స్థాయి వేగం కనిపించటం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ పేరుతో ముందుకు వచ్చినా రెండు, మూడు నెలల తర్వాత వాటి డేటా స్పీడ్‌ తగ్గుతోంది. ప్రభుత్వ సంస్థ ఏపీ ఫైబర్‌ నెట్‌, ఇండియన్‌ రైల్వేస్‌ ‘రైల్‌ నెట్‌’లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో హైస్పీడ్‌ ఇంటర్‌ నె ట్‌ సేవలు అందిస్తున్నాయని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ప్రభుత్వ సంస్థ ఏపీ ఫైబర్‌ నెట్‌ను విస్తృతం చేయటం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలన్న దిశగా కలెక్టర్‌ భావిస్తున్నారు. త్వరలో ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ పి.గౌతంరెడ్డిని కలసి ఈ అంశాలపై చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా నాణ్యమైన ఇంటర్‌నెట్‌ సేవలను అందించే దిశగా ఏపీ ఫైబర్‌నెట్‌ ఇంటర్‌నెట్‌ సేవలను విస్తృతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమౌతోంది. గతంలో జిల్లా యంత్రాంగాలు లక్ష్యాలు నిర్దేశించుకుని ఫైబర్‌నెట్‌ కనెక్షన్లను గణనీయంగా పెంచినా.. గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్‌ ఆపరేటర్లకు ఎంఎ్‌సవోలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తాయిలాలు ప్రకటించడంతో.. పైబర్‌ నెట్‌ కనెక్షన్లు నూటికి 90 శాతం తగ్గిపోయాయి. దీంతో జిల్లాలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ఉనికి కష్టమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం తిరిగి ఫైబర్‌నెట్‌ సేవలను విస్తృతం చేసేందుకు నడుం బిగించింది. 

ఏపీ ఫైబర్‌ నెట్‌కు ప్రాధాన్యత

ఏపీ ఫైబర్‌నెట్‌ నుంచి కేవలం ఇంటర్‌నెట్‌ సేవలు మాత్రమే తీసుకోవాలన్నది జిల్లా యంత్రాంగం ఆలోచనగా ఉంది. దీని సాధ్యాసాధ్యాలపై ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ గౌతం రెడ్డితో కలెక్టర్‌ సమావేశం కానున్నారు. ఇంటర్‌నెట్‌ ప్యాకేజీ మాత్రమే తీసుకోవడం వల్ల ధర తగ్గటంతోపాటు, హై స్పీడ్‌ నెట్‌వర్క్‌ను పొందవచ్చు. ఇంటర్‌నెట్‌ ఆధారంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్న తరుణంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ఇంటర్‌నెట్‌+టీవీ చానల్స్‌ ప్యాక్‌ కంటే ప్రభుత్వ ఆఫీసులకు ఇంటర్‌నెట్‌ సదుపాయం తీసుకుంటేనే సముచితంగా ఉంటుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. 

అందుబాటులోకి డిజిటల్‌ లైబ్రరీలు

ఇటీవలి కాలంలో ప్రభుత్వం డిజిటల్‌ లైబ్రరీలకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్‌ జిల్లాకు మొత్తం 99 డిజిటల్‌ లైబ్రరీలు మంజూరయ్యాయి. నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా రూ. 15.85 కోట్ల వ్యయంతో వీటి పనులు చేపట్టనున్నారు. డిజిటల్‌ లైబ్రరీల భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అవసరమౌతాయి. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, డిజిటల్‌ లైబ్రరీలను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ ఇంటర్‌నెట్‌ సేవలందించే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ ఫైబర్‌ నెట్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తోంది.

Updated Date - 2022-06-11T06:38:43+05:30 IST