సిద్ధాంతంలో మట్టి దొంగలు!

ABN , First Publish Date - 2022-04-10T06:34:49+05:30 IST

గుడివాడ రూరల్‌ మండలంలోని సిద్ధాంతం గ్రామ చెరువు అక్రమ తవ్వకానికి అక్రమార్కులు తెగబడ్డారు.

సిద్ధాంతంలో మట్టి దొంగలు!

 గ్రామ చెరువు మట్టి ఎక్స్‌కవేటర్లతో పెకలింపు 

  మంత్రి అనుచరుల అరాచకం

 పత్తాలేని అధికారులు

గుడివాడ, ఏప్రిల్‌ 9 : గుడివాడ రూరల్‌ మండలంలోని సిద్ధాంతం గ్రామ చెరువు అక్రమ తవ్వకానికి అక్రమార్కులు తెగబడ్డారు. శేరీవేల్పూరు, సిద్ధాంతం గ్రామాల పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాలు మెరక చేసి తర్వాత గుడివాడలోని రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ మెరక చేసేందుకు శుక్రవారం రాత్రి నుంచి టిప్పర్లతో నిరాటంకంగా మట్టి తరలించేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి కొడాలి నాని అనుచరులు శుక్రవారం రాత్రి నుంచి మట్టి తవ్వకాలు ఉధృతంగా చేపట్టారు. పది టిప్పర్లు, నాలుగు ఎక్స్‌కవేటర్లతో పెద్దఎత్తున మట్టిని తరలిస్తున్నారు. మైనింగ్‌, రెవెన్యూ అనుమతులు లేకుండా పంచాయతీ రాజ్‌ నిబంధనలకు సైతం తూట్లు పొడుస్తున్నారు. గుడివాడ పట్టణ పరిధిలో నూతనంగా ప్రారంభమైన రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ బరంతు చేయడానికే అధికార పార్టీ నాయకులు సిద్ధాంతం చెరువు మట్టిని ఎంచుకున్నారని తెలుస్తోంది. .  

ప్రభుత్వ భూములే మట్టి తవ్వకాలకు టార్గెట్‌?

మట్టి అక్రమ తోలకాలకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములైతే ఇబ్బంది ఉండదని సిద్ధాంతం గ్రామ చెరువును ఎంచుకున్నారని తెలుస్తోంది. రైతులు తమ పట్టా భూముల్లో పది పారలు మట్టి తీయాలంటే మైనింగ్‌ శాఖ అనుమతులు కావాలని కొర్రీలు పెట్టే అధికారులు వందలాది టిప్పర్లు బహిరంగంగా తరలిపోతున్నా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం చూస్తే విస్తుపోవాల్సిందే. అధికార పార్టీ నేతలు అందులోనూ రాష్ట్ర మంత్రి అనుచరులు కావడంతో  రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లడానికే సాహసించడం లేదు.   

మైనింగ్‌ అనుమతి తప్పనిసరి

గ్రామ చెరువులో మట్టి తవ్వకం చేపట్టాలంటే గ్రామ పంచాయతీ తీర్మానంతో మైనింగ్‌ శాఖ అనుమతి తీసుకుని రెవెన్యూ శాఖకు సమర్పిస్తే వాటికి అనుమతి ఇచ్చేదీ లేనిదీ  మేం నిర్ణయిస్తాం. మట్టి తవ్వకాలకు అధికార అనుమతులు లేవు.

- ఎం.శ్రీనివాసరావు, తహసీల్దార్‌    


Read more