నిధుల్లేకుండా గ్రామదర్శిని

ABN , First Publish Date - 2022-10-12T05:26:58+05:30 IST

జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నిధుల్లేకుండా గ్రామదర్శిని

 పంచాయతీల నిధులన్నీ లాగేసుకున్న వైనం

 జిల్లాలో ఈనెల 14 నుంచి గ్రామదర్శిని

  75 మంది ప్రత్యేక అధికారుల నియామకం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాలో 75 మంది అధికారులను నియమించారు. అధికారులు గ్రామాలకు వెళ్లినపుడు ఏం చేయాలో దిశా నిర్దేశం కూడా చేశారు. జిల్లాస్థాయి అధికారులు గ్రామాలను సంద ర్శించిన సమయంలో సమస్యలను గుర్తించాలని, గ్రామంలో ఉన్న ఒకటీ, రెండు సమస్యలకైనా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అయితే ఇక్కడే చిక్కుముడి ఉంది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల మొత్తాన్ని ప్రభుత్వం పంచాయతీల ప్రత్యేక  ఖాతాల నుంచి తీసేసుకుంటోంది. గతంలో పంచాయతీల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి అనంతరం విద్యుత్‌ బిల్లులు, ఇతరత్రా బకాయిల పేరుతో నగదును మినహాయించుకునేవారు. నెలరోజుల క్రితం జిల్లాలోని పంచాయతీలకు విడుదలైన నిధుల నుంచి నగదు మినహాయింపులు చేసుకుని మొక్కుబడిగా కొద్దిపాటి మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేసింది. అది కూడా పంచాయతీ సర్పంచ్‌లు తీవ్రస్థాయిలో గొడవచేసి  రోడ్డెక్కితేనే. ఈ  కొద్దిపాటి నిధులను కూడా తాము చెప్పేవరకు డ్రా చేయవద్దనే అంక్షలు పెట్టింది. కేంద్రప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంతమొత్తం నిధులు విడుదల చేసింది? ఎంత నగదు పంచాయతీలకు జమ అయ్యింది? అనే అంశంపై పంచాయతీ పాలకవర్గాలకు వివరాలు తెలియని స్థితి  ప్రస్తుతం నెలకొంది. పంచాయతీల నుంచి ఇటీవల కాలంలో మినహాయించుకున్న నగదు ఏ తరహా బకాయిలకు మినహాయించుకున్నారో కూడా తెలియని స్థితి నెలకొంది. పంచాయతీలకు నిధులు విడులైనట్లు ఉత్తర్వులు వచ్చినా, నిధులు డ్రా చేయకుండా ప్రభుత్వం అంక్షలు పెట్టింది. గతంలో చేసిన పనులకు చెల్లింపుల నిమిత్తం పంచాయతీల ఖాతాల్లో ఉన్న నగదును బిల్లులు పెడితే సీఎఫ్‌ఎంఎస్‌ పేరుతో నగదు విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్రజాప్యం చేస్తోంది.

గ్రామదర్శినిలో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయా

 ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. పంచాయతీల్లో కనీస పారిశుధ్య చర్యలకు అవకాశం లేనిస్థితి. కొద్దిపాటి వర్షానికే గ్రామాల్లో వర్షపునీరు నిల్వ ఉండిపోతోంది. పంచాయతీల్లో పారిశుధ్య చర్యల్లో భాగంగా కనీసం బ్లీచింగ్‌ చల్లేందుకు కూడా నిధుల కొరత వెంటాడుతోంది. డ్రెయినేజీల్లో పూడికతీత, తాగునీటి పైప్‌లైన్లకు మరమ్మతులు, వీధిలైట్లు వేయించడం, రహదారుల నిర్మాణం తదితర పనులు చేయాలని గ్రామీణప్రాంత ప్రజలు అధికారులను కోరితే వెంటనే సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. పంచాయతీల్లో నిధులు లేకుండా ఈ పనులను అధికారులు ఎలా చేయిస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అధికారులు పరిశీలించాల్సినవి.. 

గ్రామదర్శినిలో భాగంగా అధికారులు తాగునీటి పథకాలను పరిశీలించాలి. అక్కడున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.  నిధులు లేకుండా ఈ పనులు పూర్తి చేస్తారని, అధికారులు చెప్పినంత మాత్రాన ఉపయోగం ఏమి ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల్లోని రహదారులను పరిశీలన చేసి ఫొటోలు తీసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలి. పాఠశాలలను సందర్శించాలి. అక్కడున్న సౌకర్యాలను, ఉపాఽధ్యాయుల హాజరు, వారి పనితీరు, విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తదితర అంశాలను పరిశీలన చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది పనితీరు, చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం తదిత ర అంశాలను గ్రామదర్శిని ప్రత్యేక అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది. సచివాలయాల్లో సిబ్బంది పనితీరు, పెండింగ్‌లో ఉన్న అర్జీలు, అర్జీలకు నాణ్యమైన పరిష్కారం లభిస్తోందా లేదా అనే అంశాలపైనా అధికారులు వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని జగనన్న లేఅవుట్లలో కనీస వసతులు లేవు. రహదారులు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతులు కావాలని గృహాలు నిర్మాణం చేసే లబ్ధిదారులు కోరితే అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

సామాజిక బాధ్యత గా చూడండి 

గ్రామద ర్శిని కార్యక్రమంపై కలెక్టర్‌ రంజిత్‌బాషా జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులు సామాజిక బాధ్యతగా భావించి పనిచేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 5 గంటలకు అధికారులు ఏ గ్రామాన్ని సందర్శించాలో సమాచారం పంపుతామన్నారు. స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో ఇతర మండలస్థాయి అధికారులతో కలిసి సంబంధిత గ్రామాన్ని సందర్శించాలని సూచించారు. గ్రామస్థాయిలో పరిష్కరించిన, పరిష్కరించాల్సిన సమస్యలను ఫొటోలు తీసి తనకు పంపాలన్నారు. 

Updated Date - 2022-10-12T05:26:58+05:30 IST