గ్రేడ్‌-1 కార్యదర్శులకు పదోన్నతులివ్వండి!

ABN , First Publish Date - 2022-09-19T06:01:45+05:30 IST

గ్రేడ్‌-1 కార్యదర్శులకు పదోన్నతులివ్వండి!

గ్రేడ్‌-1 కార్యదర్శులకు పదోన్నతులివ్వండి!
మాట్లాడుతున్న రమణ, వేదికపై శ్రీనివాసరావు, రామ్మోహనరావు

విజయవాడ రూరల్‌, సెప్టెంబరు 18 : రాష్ట్రంలో సీనియారిటీ ప్రకారం అర్హత ఉన్న గ్రేడ్‌-1 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ విస్తరణాధికారులుగా (ఈవోపీఆర్‌ అండ్‌ ఆర్‌డీ) పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం (అమరావతి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ డిమాండ్‌ చేశారు. రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో కార్యదర్శుల పదోన్నతులు, ఖాళీల భర్తీ, పంచాయతీల 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రస్తుతం పం చాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో కూడిన జోన్‌-2లో సుమారు 300 మంది గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 పంచాయతీ కార్యదర్శులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండేళ్లగా పైళ్లన్నీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీవోలకు ఇటీవలే పదోన్నతులు కల్పించిందని, అలాగే ఈవో, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీలకు కూడా పదోన్నతులు కల్పిస్తే తమకు లైన్‌ క్లియర్‌ అవుతుందన్నారు. గ్రేడ్‌-1లో 130 మంది, గ్రేడ్‌-2లో 120 మందికి పదోన్నతులు రావాల్సి ఉందన్నారు. అలాగే జిల్లాస్థాయిలో గ్రేడ్‌-3, 4 విభాగాల్లో సుమారు 750 మందికి వరుసగా గ్రేడ్‌-1, 2 పదోన్నతులు లభించే అవకాశం ఉందన్నారు.  సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎంఎ్‌ఫఎస్‌ నిబంధనలు పంచాయతీలకు ఇబ్బందిగా మారాయని, ఈ విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్నారు.   సచివాలయాలపై పూర్తిస్థాయి అజమాయిషీ కార్యదర్శులకే ఉండేలా ఉత్తర్వులివ్వాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఘంటా రామమోహనరావు, కోశాధికారి అంబటి శివ రామకోటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఓగిరాల తిరుమల వెంకటరత్నం, మచిలీపట్నం డివిజన్‌ అధ్యక్షుడు కే నరసింహారవు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T06:01:45+05:30 IST