‘చిన్న’గా.. షాక్‌!

ABN , First Publish Date - 2022-07-18T06:02:30+05:30 IST

రేషన్‌ దుకాణాల ద్వారా కమర్షియల్‌ మినీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

‘చిన్న’గా.. షాక్‌!

రేషన్‌ డీలర్ల ద్వారా మినీ కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల విక్రయాలు 

 వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా.. 

 రెండు జిల్లాల యంత్రాంగం పంపిణీకి సన్నద్ధం 

  డొమెస్టిక్‌ వినియోగదారులకు కమర్షియల్‌ ధర అలవాటు చేసే పన్నాగం

 రేషన్‌ దుకాణాల ద్వారా కమర్షియల్‌ మినీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రేషన్‌ డీలర్ల ద్వారా మినీ కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో దీనిని అమలు చేయటానికి జిల్లా యంత్రాంగం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. పూర్తి విధివిధానాలు ఇంకా ఖరారు కాకపోయినా.. డీలర్ల దగ్గర ప్రయోగాత్మకంగా నిర్వహించే మినీ సిలిండర్ల పంపిణీ విజయవంతం అయితే సబ్సిడీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.. డీలర్ల దగ్గర కమర్షియల్‌ సిలిండర్లను తీసుకువెళ్లే వ్యవస్థను తీసుకువచ్చే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజులలో డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్స్‌ కలిగిన వారంతా కూడా డీలర్ల ద్వారా  కమర్షియల్‌ సిలిండర్లను కొనుగోలు చేయాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తే వినియోగదారులపై రెట్టింపు భారం పడే అవకాశం ఉంది. 

 ఆంధ్రజ్యోతి, విజయవాడ : రేషన్‌ డీలర్ల పరిధిలో ఐదు కేజీల సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చి విక్రయించటానికి దాదాపుగా రంగం సిద్ధం చేశారు. భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌, ఇండేన్‌ గ్యాస్‌ తదితర కంపెనీలను డీలర్లకు అనుసంధానం చేస్తారు. వారికి మార్జిన్‌ కమీషన్‌ ప్రాతిపదికన గ్యాస్‌ సిలిండర్లను కేటాయిస్తారు. ఒక్కో డీలర్‌కు ముందుగా 20 చొప్పున ఐదు కేజీల గ్యాస్‌ సిలిండర్లను కేటాయించాలని నిర్ణయించారు. ఇవన్నీ పూర్తిగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లే.

  మినీ కమర్షియల్‌ సిలిండర్ల మీద ఏమి చెబుతున్నారు? 

రేషన్‌ డిపోల నుంచి మినీ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేసే విషయంలో జిల్లా యంత్రాంగం చెబుతున్న విషయాలు రకరకాలుగా ఉంటున్నాయి. స్వర్ణకారులు (గోల్డ్‌స్మిత్స్‌), స్ర్టీట్‌ ఫుడ్‌ వెండార్స్‌ తదితర వర్గాలు తమ ప్రత్యేక అవ సరాలను దృష్టిలో ఉంచుకుని మినీ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఇది వాస్తవమే. మార్కెట్‌లో లభించే మూడు, ఐదు కేజీల సిలిండర్‌ పొయ్యిలు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్న మాట వాస్తవం. ఎక్కడైతే ఇలాంటి మినీ సిలిండర్‌ కమ్‌ పొయ్యిలు కొనుగోలు చేస్తున్నారో.. అక్కడే గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేసి ఇస్తారు. ఇది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో డొమిస్టిక్‌ సిలిండర్ల గ్యాస్‌ను.. మినీ సిలిండర్లలోకి ఫిల్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని కూడా కాదనటం లేదు. ఈ వర్గాలకు ఐదు కేజీల కమర్షియల్‌ సిలిండర్లను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావటం కోసమే ఐదు కేజీల సిలిండర్లను డీలర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. 

   రేషన్‌ డీలర్లే ఎందుకు.. గ్యాస్‌ ఏజెన్సీలు సరిపోవా? 

 గృహ వినియోగదారులు కానీ, వ్యాపార అవసరాల కోసం కానీ సిలిండర్లు కావాల్సిన వారు ఇప్పటి వరకు గ్యాస్‌ ఏజన్సీల ద్వారానే బుకింగ్‌ చేసుకుంటారు. అక్కడి నుంచి పంపిణీ జరుగుతుంది. విజయవాడ వంటి నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో డోర్‌ డెలివరీ కూడా గ్యాస్‌ ఏజన్సీలే చేపడతాయి. గ్రామాల్లో మాత్రం మండల స్థాయి నుంచి గ్రామాలలో ఒక పాయింట్‌ పెట్టుకుని రెండు, మూడు రోజులకు ఒకసారి డెలివరీ చేస్తుంటాయి. మినీ సిలిండర్లను గ్యాస్‌ ఏజన్సీల ద్వారా నిర్వహించటానికి అన్ని అవకాశాలున్నా.. రేషన్‌ డీలర్ల ద్వారానే ఎందుకు పంపిణీ చేయాలనుకుంటున్నారన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. గ్యాస్‌ డీలర్లకు బిజినెస్‌ పెంచే అవకాశం ఉంది కాబట్టి వారికి ప్రస్తుతం రేషన్‌ దుకాణాల ద్వారా ఐదు కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వటానికి అభ్యంతరం అయితే లేదు. డీలర్లకు అదన పు ఆదాయ వనరు కాబట్టి వారికీ అభ్యంతరం లేదు. దీని వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోందని తెలుస్తోంది. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ ఆశ చూపించటం వల్ల అదనపు ఆదాయం కోసం కచ్చితంగా గ్యాస్‌ సిలిండర్ల వ్యాపారం చేస్తారు. ఈ క్రమంలో రేషన్‌ సిలిండర్ల కోసం వివిధ వర్గాలు రేషన్‌ దుకాణాలకు వెళ్లే అలవాటు పెరుగుతుంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ ధరలు డొమిస్టిక్‌కు అయితే 14 కేజీల సిలిండర్‌ ధర రూ.1015, కమర్షియల్‌ సిలిండర్‌ ధర అయితే రూ.2 వేల మేర ధర ఉంది. గ్యాస్‌ ధరలు రోజు రోజుకూ పెరగటమే తప్ప తరిగే పరిస్థితిలేని నేపథ్యంలో, ప్రజలకు సౌకర్యంగా మినీ సిలిండర్లను తెరమీదకు తీసుకువస్తున్నారన్నది అంతర్గత  విషయం. ధర తక్కువ కాకపోయినా.. తక్కువ పరిణామంలో లభించే సిలిండర్‌ తక్కువ ధరకు వస్తుంది కాబట్టి గృహస్తులు కూడా ఈ అప్షన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్రమేణా డీలర్ల దగ్గర ఐదు కేజీల సిలిండర్ల కోసం అలవాటు పడి పోతారన్నది వ్యూహంగా కనిపిస్తోంది. 

  సబ్సిడీ పోయి.. కమర్షియల్‌ గా ఎన్‌ క్యాష్‌  

 ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తెలివిగా ఎన్‌ క్యాష్‌ చేసుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం డొమిస్టిక్‌ సిలిండర్‌కు కేంద్రం రూ.1015 ధర నిర్ణయించింది. కమర్షియల్‌గా రూ.2000కు ఇస్తోంది. రెండింటికీ గ్యాస్‌ కాంపోనెంట్‌లో ఏమీ తేడా ఉండదు. మహా అయితే కమర్షియల్‌  సిలిండర్‌కు మరో 2 కేజీలు అదనంగా ఇస్తుంది. ఈ రెండింటినీ చూస్తే ధర విషయంలో వేర్వేరుగా ఎలా ఇవ్వగలుగుతుందన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. డొమిస్టిక్‌ సిలిండర్‌పై రూ.350 నుంచి ప్రస్తుతం రూ.15కు సబ్సిడీ తీసుకు వచ్చింది. ఈ మేరకు చూస్తే.. డొమిస్టిక్‌గా తక్కువ ధరకు గ్యాస్‌ను అందించే పరిస్థితి కనిపించటం లేదు. కాబట్టి డీలర్ల దగ్గర తక్కువ భారంగా మినీ సిలిండర్లను అలవాటు చేసి కమర్షియల్‌గా సొమ్ము చేసుకోవచ్చన్నది కేంద్రం ఎత్తుగడగా కనిపిస్తోంది. డీలర్ల ద్వారా అలవాటు చేసి.. డొమిస్టిక్‌ సిలిండర్లను ఎత్తివేసి.. పూర్తిగా రేషన్‌ దుకాణాల దగ్గర నుంచి తీసుకోవటం తప్పనిసరి చేసే పరిస్థితి కనిపిస్తోంది. 

  వినియోగదారుల నెత్తిన రెట్టింపు భారమే 

 రేషన్‌ దుకాణాల దగ్గర కమర్షియల్‌ మినీ గ్యాస్‌ సిలిండర్లను ఎవరికైనా అమ్మవచ్చన్నది నిబంధన. వ్యాపారులే కాదు.. సామాన్య ప్రజలు కూడా అదే ధరకు కొనుక్కోవచ్చు. కొవిడ్‌ ఆగమ సంక్షోభ పరిస్థితుల్లో నిత్యావసరాలకు రెక్కలు వచ్చినట్టుగానే.. వంట గ్యాస్‌కు కూడా భారీగా రెక్కలు వచ్చేస్తున్నాయి. రానురానూ సబ్సీడీ తగ్గిపోయింది. డబుల్‌ సిలిండర్‌ ఉన్న వారికి కంటి తుడుపుగా సబ్సిడీ అందుతోంది. ఆయిల్‌ కంపెనీలు చవిచూస్తున్న నష్టాల నేపథ్యంలో, సబ్సిడీని వదిలించుకోవటానికి కేంద్రం మినీ సిలిండర్ల ఆలోచన చేస్తే మాత్రం వినియోగదారులపై రెట్టింపు భారం పడటం ఖాయం. 


Updated Date - 2022-07-18T06:02:30+05:30 IST