బాధ్యులెవరు?

ABN , First Publish Date - 2022-04-24T06:10:27+05:30 IST

బాధ్యులెవరు?

బాధ్యులెవరు?

సామూహిక అత్యాచార ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులతో నియమించిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడికి శనివారం ఈ నివేదిక చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు ఆసుపత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, వారిని ఇప్పటికే విధుల నుంచి తొలగించారు. ఏజెన్సీతో పాటు ఆసుపత్రిలో భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ ఏజెన్సీని కూడా తొలగిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఇప్పటికే ప్రకటించారు. ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో సహా బాధ్యులైన మరికొంతమంది ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్‌ ప్రొఫెసర్లు, ఆర్‌ఎంవోలు, డిప్యూటీ సూపరింటెండెంట్లతో విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ విచారణ చేసి నివేదికను కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంఈలకు సమర్పించారు. డీఎంఈ పరిశీలించి ప్రభుత్వానికి కూడా సమర్పించినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనుందని సమాచారం. 

సీఎస్‌ఆర్‌ఎంవో సహా 15 మందికి షోకాజ్‌

అత్యాచార ఘటనపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం, సెక్యూరిటీ వైఫల్యం, ఆసుపత్రి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం.. తదితర అంశాలు ఈ ఘటనకు ప్రధాన కారణాలుగా విచారణ కమిటీ సభ్యులు నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. దీంతో ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో పాటు సంఘటన జరిగిన ఫ్లోర్‌ ఇన్‌చార్జులు, నైట్‌ సూపర్‌వైజర్లు తదితరులు 15 మందికి, ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే బాధ్యులైన వారందరిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అత్యాచార బాధితురాలు డిశ్చార్జి 

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన మీదట, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం బాధితురాలిని పరామర్శించారు. 

Read more