-
-
Home » Andhra Pradesh » Krishna » fly over-MRGS-AndhraPradesh
-
‘దిమ్మె’తిరిగేలా..!
ABN , First Publish Date - 2022-07-04T05:14:24+05:30 IST
అది నిత్యం రద్దీగా ఉండే ఎస్.ఎన్.పాలెం జాతీయ రహదారి.

ఫ్లైఓవర్ నిర్మించిన ఏడాదికే బయటపడ్డ డొల్లతనం
చిన్నపాటి వర్షానికే విరిగిపడిన రిటైనింగ్ వాల్ దిమ్మెలు
తెల్లవారుజామున పడటంతో తప్పిన ప్రమాదం
హనుమాన్‌జంక్షన్ బైపాస్‌లో ఘటన
అది నిత్యం రద్దీగా ఉండే ఎస్.ఎన్.పాలెం జాతీయ రహదారి. ఆ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌లో భారీ వంతెన నిర్మాణమై ప్రజారవాణాకు అనుమతి పొంది ఏడాదే అయింది. పైన పటారం లోన లొటారం అన్నట్టు కొద్దిపాటి వర్షానికి వంతెన రిటైనింగ్ వాల్ సిమెంట్ దిమ్మెలు ఆదివారం తెల్లవారుజామున విరిగి పడ్డాయి. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షపు నీరు నూతనంగా నిర్మించిన రోడ్డు కిందకు చేరడంతోబలహీనంగా ఉన్న రెండు దిమ్మెలు విరిగి సర్వీస్ రహదారిపై పడ్డాయి.వాటితో పాటుగా ఎర్రమట్టి కిందకు జారిపోయింది.నిత్యం రైతులు, ద్విచక్రవాహనాలతో రద్దీగా ఉండే సర్వీస్ రహదారి ఆదివారం తెల్లవారుజాము సమయం కావడంతో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బొమ్ములూరు వద్ద మళ్లించి హనుమాన్‌జంక్షన్ ఊరిలో నుంచి పంపించారు. సొమవారం ప్రధాని భీమవరం పర్యటనకు వాతావరణం అనుకూలించని పక్షంలో ఇదే రహదారిపై ప్రయాణించాల్సి ఉంది. ప్రధాని రూట్ మ్యాప్‌లో హనుమాన్‌జంక్షన్ మీదుగా ఉండటంతో అధికారుల్లో అలజడి మొదలైంది. ట్రాఫిక్‌ను మళ్లించి మధ్యాహ్నం నుంచి రహదారి మరమ్మతులు వేగంగా నిర్వహిస్తున్నారు.
- హనుమాన్‌జంక్షన్ రూరల్