-
-
Home » Andhra Pradesh » Krishna » flood in krishna river-NGTS-AndhraPradesh
-
మళ్లీ వరద
ABN , First Publish Date - 2022-09-10T06:13:09+05:30 IST
మళ్లీ వరద

ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక
బ్యారేజీకి చేరుతున్న 4.17 లక్షల క్యూసెక్కుల వరద
సముద్రంలోకి 4.11 లక్షల క్యూసెక్కులు విడుదల
జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
నీట మునిగిన పరివాహక ప్రాంతాలు
విజయవాడ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి)/అవనిగడ్డ రూరల్ : ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి మొత్తం 4 లక్షల 17 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 4 లక్షల 11 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పులిచింతల నుంచి 4 లక్షల 14 వేలు, పాలేరు నుంచి 683, కీసర నుంచి 2,893 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాల్వలకు 11 వేల క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కేఈబీకి 1,407, బందరుకు 1,205, రైవస్‌కు 2,703, ఏలూరుకు 1,302, గుంటూరుకు 128, కేడబ్ల్యూ కాల్వకు 4,513 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి భారీగా నీరు వదలడంతో నది పరివాహక ప్రాంతానికి చెంతనే ఉన్న నివాస ప్రాంతాలు నీట మునిగాయి. భూషేష్‌గుప్తా నగర్, రాణీగారితోట, కృష్ణలంక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్‌ను నిర్మించడంతో చాలా ముంపు వ్యథ తప్పింది. పద్మావతి ఘాట్ వరకూ ఉన్న నివాస ప్రాంతాలు మాత్రం నీటిలో ఉన్నాయి. కాగా, దివిసీమకు భారీగా వరద నీరు చేరుతోంది. పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ వరద ప్రవహిస్తోందని ఇరిగేషన్ డీఈఈ రవికిరణ్ తెలిపారు.
రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ అడపాదడపా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలతో ఉద్యాన పంటలకు ఎంతో మేలు కలుగుతుందని వ్యవసాధికారులు చెబుతున్నారు. కాగా, విజయవాడలో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. రహదారులు మొత్తం జలమయమయ్యాయి. ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
