భయపెడుతున్న జ్వరాలు

ABN , First Publish Date - 2022-03-16T06:16:06+05:30 IST

దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, జ్వరాల తీవ్రత పెద్దగా లేదని అధికారులు చెబుతుండగా, ఎ.కొండూరు మండలం తోటమూల యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ జరపల రాము (33) డెంగీ లక్షణాలతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

భయపెడుతున్న జ్వరాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, జ్వరాల తీవ్రత పెద్దగా లేదని అధికారులు చెబుతుండగా, ఎ.కొండూరు మండలం తోటమూల యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ జరపల రాము (33) డెంగీ లక్షణాలతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండటం, వాటి కారణంగా విషజ్వరాల బారినపడటం సాధారణమే. కానీ వేసవి ప్రారంభమై ఎండలు మండుతున్నా దోమల వ్యాప్తి అధికంగా ఉండడం, డెంగీ వంటి విషజ్వరాలు ప్రబలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించి, ఎవరికైనా విషజ్వరాలు సోకితే చుట్టుపక్కల నివసించేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలూ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వేసవిలో కూడా విషజ్వరాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


బ్యాంక్‌ మేనేజర్‌ మృతికి కారణం డెంగీ కాదు

తోటమూల యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ రాము మరణంపై జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రామారావు, నూజివీడు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆషా మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రాము డెంగీ కారణంగా మరణించినట్టు నిర్ధారణ కాలేదని మలేరియా అధికారి డాక్టర్‌ రామారావు చెప్పారు. రాము అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో డెంగీ లక్షణాలుగా భావించి వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయనకు ఎలీసా పరీక్ష చేయించలేదని, డెంగీగా నిర్ధారణ కాలేదని చెప్పారు. హైబీపీ, షుగర్‌ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. రాము మరణానికి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోందన్నారు. అయినప్పటికీ ఆ గ్రామంలో దోమల నివారణకు  చర్యలు చేపట్టామన్నారు. 

Updated Date - 2022-03-16T06:16:06+05:30 IST