-
-
Home » Andhra Pradesh » Krishna » electric bike fire accident-NGTS-AndhraPradesh
-
కారణమేంటి?
ABN , First Publish Date - 2022-04-24T06:14:55+05:30 IST
కారణమేంటి?

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ నాణ్యమైనదేనా?
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా?
బైక్ వినియోగంపై అవగాహన లేకనేనా?
గులాబీతోట ప్రమాదం వెనుక అనేక అనుమనాలు
సత్యనారాయణపురం, ఏప్రిల్ 23 : కొత్తగా, చూడచక్కగా కనిపిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ ఓ కుటుంబం ఉసురుతీసింది. ఇంటి పెద్ద ప్రాణాలు తీసింది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిని లేకుండా చేసింది. కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి చేర్చింది. విజయ వాడ గులాబీతోటలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటనలో జరిగిన విషాదమిది.
షార్ట్‌సర్క్యూటా..? నాణ్యతాలోపమా..?
పెట్రోలు ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో ఎలక్ర్టిక్ బైకులకు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. కంపెనీలు కూడా అలాగే పుట్టుకొస్తున్నాయి. తయారీలో నాణ్యత లోపాలు, వీటి వినియోగంపై కొనుగోలుదారులకు సరైన అవగాహన కల్పించకపోవడం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైకుల్లో సాధారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు వాడతారు. ఇవి మైనస్ 20 సెల్సియస్ డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకూ తట్టుకోగలవు. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతను మించకూడదు. మనదేశంలో వేసవిలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బయట ఉష్ణోగ్రత ఈస్థాయిలో ఉన్నప్పుడు లిథియం బ్యాటరీల ఉష్ణోగ్రత 50 నుంచి 55 డిగ్రీలు నమోదవుతుంది. ప్రధానంగా చార్జింగ్ పెట్టిన సమయంలో ఎండలో ఎక్కువసేపు వాహనం నిలిపినప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీంతో బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు ఎక్కువ. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మనదేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వీటి వినియోగం, చార్జింగ్‌పై వినియోగదారులకు సరైన అవగాహన ఉండట్లేదు. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒక్కోసారి ఇంట్లో వైరింగ్ పాతది కావడమో లేక నాసిరకం వైరింగ్ వలనో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గులాబీతోట ఘటనలో అవగాహన లేకే మృతుడు శివకుమార్ (40) తన బెడ్రూమ్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుకు చార్జింగ్ పెట్టి నిద్రపోయాడని తెలుస్తోంది. అయితే, ఈ ఘటన బ్యాటరీలో నాణ్యతాలోపం వల్ల జరిగిందా లేక షార్ట్‌సర్క్యూటా అన్నది తేలాల్సి ఉంది.

