మత్తెక్కి మన్యానికి..

ABN , First Publish Date - 2022-09-13T06:53:29+05:30 IST

మత్తెక్కి మన్యానికి..

మత్తెక్కి మన్యానికి..

ట్రెండ్‌ మార్చిన గంజాయి బాబులు

స్థానిక కొనుగోళ్లకు బ్రేక్‌.. అడవులకు పయనం

బైకులపై చింతూరు, విశాఖ మన్యంలోకి..

అక్కడే కిలో, రెండు కిలోల కొనుగోలు

ఇళ్లల్లోనే దాచుకుంటున్న యువకులు


కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి.. గంజాయి బాబులకు కిక్కిచ్చేందుకు ఇప్పుడు ఇదే దగ్గరి దారి. పోలీసుల ఆపరేషన్‌తో నగరంలో గంజాయి విక్రయాలు దాదాపు తగ్గాయి. అక్కడక్కడ దొరికినా ధర ఎక్కువగా ఉంటోంది. మత్తుకు అలవాటు పడిన మనుషులు ఏం చేస్తారు.. ఏకంగా అడవులకెళ్లి కొని తెచ్చుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గంజాయి చాలామందికి కాసుల వర్షం కురిపించింది. విశాఖ జిల్లాలోని మన్యం నుంచి ఇక్కడి వరకు గంజాయిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేకంగా ఓ నెట్‌వర్క్‌ ఏర్పడింది. ఆర్డర్లు ఇచ్చేవారు కొందరు, అక్కడికి వెళ్లి కొనుగోలు చేసి తెచ్చేవారు మరికొందరు, తీసుకొచ్చాక భద్రపరిచేవారు ఇంకొందరు.. ఇలా చైన్‌లింక్‌ కొనసాగుతోంది. వివిధ కోడ్‌ల ప్రకారం వీటిని విక్రయించేవారు. కాలనీల్లో విక్రయాలకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఫలితంగా గంజాయి నగరం మొత్తాన్ని చుట్టేసింది.

పోలీస్‌ ఆపరేషన్‌తో తగ్గిన వాడకం

గంజాయి వాడకం విస్తృతంగా ఉండటంతో పోలీస్‌ అధికారులు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. గంజాయి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మొబైల్‌ బృందాలను తిప్పుతున్నారు. జక్కంపూడి కాలనీ, చిట్టినగర్‌ కొండ ప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురం, నున్న, గుణదల ప్రాంతాల్లో మొబైల్‌ బృందాలు గాలించి గంజాయితో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్‌స్టేషన్లలో అప్పగిస్తున్నాయి. చివరకు ఇంజనీరింగ్‌ చదివే యువకులు గంజాయితోనే పుట్టినరోజు పార్టీలు చేసుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల నిఘా పెరగడంతో గంజాయిని విక్రయించేవారు, తెచ్చేవారు కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్నారు. వారికి పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

యాత్రగా అడవులకు..

అడవుల్లో కొనే సరుకు ఇక్కడికి వచ్చేసరికి ధర ఎక్కువవుతుంది. చిన్న ప్యాకెట్‌ రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఉంటోంది. కొన్నాళ్లపాటు ఇదే ధరకు కొన్నారు. తక్కువ పరిమాణంలో వచ్చే సరుకుకు ఇంత మొత్తంలో చెల్లించడం కొంత భారంగా మారింది. దీంతో వారిలో కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. స్థానికంగా అధిక ధరకు కొనుగోలు చేయడం కంటే అదే ధరకు ఎక్కువ మొత్తంలో గంజాయిని తెచ్చుకోవడం మంచిదనుకున్నారు. కొంతమంది యువకులు విహారయాత్రకు వెళ్లినట్టుగా విశాఖ జిల్లాకు గానీ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, మోతుగూడెం ప్రాంతాలకు గానీ వెళ్తున్నారు. అక్కడ గంజాయి విక్రయించే వారి గురించి తెలుసుకుని నాణ్యమైన సరుకును ఎంచుకుంటున్నారు. ఈ యువకులంతా ఇళ్లల్లో విహారయాత్రకు వెళ్తున్నామని చెప్పి బయల్దేరుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును వాటాలుగా పెట్టుకుని వెళ్తున్నారు. అక్కడ కిలో, రెండు కిలోల లెక్కన కొని తెస్తున్నారు. ఆ సరుకును ఇళ్లల్లోనే భద్రంగా దాచుకుంటు న్నారు. ఇటీవల కొత్తపేట పోలీసులు గంజాయితో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారించగా, తామంతా విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతానికి వెళ్లి కొన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ నగరంలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.


Read more