కృష్ణాపురంలో విషాదచాయలు

ABN , First Publish Date - 2022-12-06T23:59:53+05:30 IST

పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదచాయలు అలముకున్నాయి. దంత వైద్యురాలిగా రావాల్సిన తపస్విని మంగళవారం పెదకాకాని మండలం పెద తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది పీక కోసి కర్కశంగా హతమార్చడంతో గ్రామం ఉలిక్కిపడింది.

కృష్ణాపురంలో విషాదచాయలు

తపస్వీ హత్యతో రోదిస్తున్న తాతా నాయనమ్మ

కృష్ణాపురం (పమిడిముక్కల): పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో విషాదచాయలు అలముకున్నాయి. దంత వైద్యురాలిగా రావాల్సిన తపస్విని మంగళవారం పెదకాకాని మండలం పెద తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది పీక కోసి కర్కశంగా హతమార్చడంతో గ్రామం ఉలిక్కిపడింది. మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన పిన్నమనేని గోపాలకృష్ణకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పిన్నమనేని మహేష్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఆస్త్రేలియాలో ఉంటున్నారు. చిన్న కూతురు తపస్వి విజయవాడ మెడికల్‌ కాలేజీలో డెంటల్‌ కోర్సు చేస్తోంది. తండ్రి మహేష్‌ ముంబయ్‌లోని ఒక కంపెనీలో సీఈవోగా పనిచేస్తుండటంతో తపస్వి తాత, నాయనమ్మల వద్ద ఉంటోంది. మనమరాలు హత్యకు గురైన సమాచారం తెలిసి తాత గోపాలకృష్ణ, నాయనమ్మ బేబి హతాశులయ్యారు. వృద్ధాప్యంలో తనకు ఆధరంగా ఉండే మనమరాలు హత్యకు గురికావటం పట్ల ఆమె తాత, నాయనమ్మలు తీవ్రంగా రోదిస్తున్నారు. ఎప్పుడు వచ్చినా తామందరిని ఆప్యాయంగా పలకరించి వెళ్లేదని స్థానికులు కన్నీటితో తెలిపారు.

పరారీలో నిందితుడి తండ్రి

గన్నవరం : తపస్వీ హత్య కేసులో నిందితుడు జ్ఞానేశ్వర్‌ అలియాస్‌ డింపు తండ్రి పరారీలో ఉన్నాడు. ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన మన్నే వెంకటేశ్వరరావు ఎరువుల వ్యాపారం చేసి ఆ తరువాత మరో ఎరువుల కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు జ్ఞానేశ్వర్‌ అలియాస్‌ డింపు సివిల్‌ ఇంజనీర్‌ చదివాడు. సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొంది ప్రస్తుతం విజయవాడలో ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. గ్రామానికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. కారులో వచ్చిన స్నేహితులతో కలిసి తిరుగుతూ తాగేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. చిన అవుటపల్లి డెంటల్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న తపస్వితో పరిచయమై ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడేవాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను సర్జికల్‌ బ్లేడుతో దాడి చేయటంతో గ్రామస్థులు నివ్వెరబోతున్నారు. కొడుకు చేసిన ఘాతుకాన్ని తెలిసి తండ్రి వెంకటేశ్వరరావు పరారిలో ఉన్నాడు. తల్లి కాలికి దెబ్బ తగిలిందని ఆస్పత్రిలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

డెంటల్‌ కళాశాలలో పోలీసుల విచారణ

పెద కాకాని పోలీసులు డెంటల్‌ కళాశాలకు వచ్చి విచారణ చేశారు. తపస్వి హాస్టల్‌లోనే ఉండి చదువుకునేదని గత జూలై 23 నుంచి ఆమె అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి కళాశాలకు వచ్చేదని చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి పరీక్షలు ఉండటంతో నవంబరు 8 నుంచి ప్రిపరేషన్‌ సెలవులు ఇచ్చారు. అప్పటి నుంచి కళాశాలకు రావటం లేదు. తపస్వి కళాశాలలో ఎలా ఉండేది? ఎలా చదివేది? అని పోలీసులు విచారించారు.

Updated Date - 2022-12-06T23:59:54+05:30 IST