ఆగని అతిసార!

ABN , First Publish Date - 2022-04-10T06:33:45+05:30 IST

గుడివాడలో పలు ప్రాంతాల్లో అతిసార (డయేరియా) ప్రబలిన డయేరియా వరుసగా రెండో రోజు తన ప్రభావాన్ని చూపింది.

ఆగని అతిసార!

రెండోరోజూ గుడివాడలో కలవరం 

 31 మంది ఏరియా ఆసుపత్రిలో చేరిక 

 11 మందికి నిర్ధారణ

గుడివాడ,  ఏప్రిల్‌ 9 : గుడివాడలో పలు ప్రాంతాల్లో అతిసార (డయేరియా) ప్రబలిన డయేరియా వరుసగా రెండో రోజు తన ప్రభావాన్ని చూపింది. గుడ్‌మన్‌పేటలోని బాబూజగజ్జీవన్‌రామ్‌ ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గుడ్‌మన్‌పేట, బాపూజీనగర్‌, ముబారక్‌ సెంటర్‌, పాములకాలనీ, పంచవటికాలనీ, కాకర్ల వీఽధి, నైజాంపేటలకు చెందిన 31 మంది స్థానిక ఏరియా ఆసుపత్రికి శనివారం డయేరియా లక్షణాలతో వచ్చారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నామని తెలిపారు. వారిలో 11 మందికి డయేరియా నిర్ధారించారు. ఏడుగురికి స్వల్ప లక్షణాలే ఉండటంతో వెంటనే పంపివేశారు. మిగతా నలుగురికి వైద్యచికిత్స అందిస్తున్నారు. గుడ్‌మన్‌పేటలోని తాత, అమ్మమ్మల వద్ద పెరుగుతున్న ఓ రెండేళ్ల చిన్నారి నాలుగు రోజుల క్రితం అతిసార లక్షణాలతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ మనవరాలు వాంతులు, విరేచనాలు వంటి అతిసార లక్షణాలతో మృతి చెందినట్లు తెలిసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే కొనసాగిస్తున్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.ఇందిరాదేవి మాట్లాడుతూ కలుషిత నీరు, ఆహార కల్తీ, అపరిశుభ్ర వాతావరణం, మాంసాహారాలు తినడం వల్ల అతిసార వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పురపాలక సంఘం సరఫరా చేసే నీటి నమూనాలు సేకరించి పరిశోధనలకు పంపామని వివరించారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి సుహాసిని అతిసార వ్యాధిగ్రస్తులకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. అతిసార ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజారోగ్యశాఖ అధికారులకు సూచించారు.   

 చెత్త తొలగింపులో కొరవడిన చిత్తశుద్ధి 

కొద్దిరోజులుగా తాగునీరు మురుగు వాసన వస్తోందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వాటర్‌వర్క్స్‌ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరుతున్నారు. చెత్త సేకరణ వాహనాలు ప్రచార ఆర్భాటానికి తప్పితే ఉపయోగం లేనివిగా తయారయ్యాయి. పాఠశాలల సూపర్‌వైజర్లను సైతం చెత్తపన్ను కట్టించుకోవడానికి తిప్పుతున్న పురపాలక సంఘ అధికారులు ప్రజారోగ్యాన్ని విస్మరించడంపై జనం మండిపడుతున్నారు.  డ్రెయినేజీల్లోని పైపులైన్ల లీకులతో తాగునీరు కలుషితమవుతోందని తెలుస్తోంది. 

 తాగునీటిలో కలుషితాలు లేవు

పట్టణంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో వ్యాధి సోకిన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో తాగునీటి శాంపిల్స్‌ తీసుకుని ల్యాబ్‌కు పంపాం. నీటిలో ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని తేలింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

-  పి.జె.సంపత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-04-10T06:33:45+05:30 IST