ప్రణతులివే.. పంచముఖీ..

ABN , First Publish Date - 2022-09-29T06:32:24+05:30 IST

ప్రణతులివే.. పంచముఖీ..

ప్రణతులివే.. పంచముఖీ..
క్యూలైన్లో భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ

విజయవాడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి భవానీలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో వస్తున్నవారితో ఇంద్రకీలాద్రి ఎరుపు రంగును పులుముకుంటోంది. గడిచిన రెండు రోజులతో పోలిస్తే బుధవారం భక్తుల సంఖ్య బాగా పెరిగింది. శరన్నవరాత్రుల్లో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వినాయకుడి ఆలయం నుంచి క్యూలోకి వచ్చిన వారికి దర్శనం కావడానికి గంటన్నర పట్టింది. 

సాంకేతిక సమస్యలతో టికెట్ల జారీకి బ్రేక్‌

తొలిరోజు నుంచే ఆన్‌లైన్‌ టికెట్‌ జారీలో సాంకేతిక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలుగా టికెట్లు ఇవ్వొద్దని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. కంప్యూటర్ల ద్వారానే జారీ చేయాలని స్పష్టం చేశారు. కంప్యూటర్లు మొరాయించినప్పుడు ఏం చేయాలో తెలియక కౌంటర్లలోని సిబ్బంది భక్తులను దర్శనానికి పంపేస్తున్నారు. దీనివల్ల ఆదాయానికి గండి పడుతోంది. కనకదుర్గమ్మను బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి బి.ముత్యాలనాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శనానికి వచ్చారు. 


Read more