అంబరాన్నంటే సంబరం

ABN , First Publish Date - 2022-09-26T05:46:09+05:30 IST

అంబరాన్నంటే సంబరం

అంబరాన్నంటే సంబరం
విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు

ఉత్సవ వెలుగుల్లో ఇంద్రకీలాద్రి 

ఉదయం 9 గంటల తరువాత దర్శనానికి అనుమతి 

తొలి దర్శనానికి గవర్నర్‌, దేవదాయ శాఖ మంత్రి

రెండోరోజు నుంచి తెల్లవారుజామున 3 గంటలకే.. 

వినాయకుడి గుడి నుంచే క్యూలైన్లు

వీఐపీలకు మాత్రం ప్రత్యేక వాహనాలు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గడియలు ప్రవేశించగానే, ఇంద్రకీలాద్రిపై అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సోమవారం నుంచి పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిని విద్యుత్‌ వెలుగు లతో అందంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతి స్తారు. తెల్లవారుజామున 3 నుంచి 9 గంటల వరకు అమ్మవారికి వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తొలి దర్శనం గవర్నర్‌ హరిచందన్‌, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసు కుంటారు. వారి రాక ఆలస్యమైతే ఈవో భ్రమరాంబ, పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా చేసుకుంటారు. అనంతరం సాధారణ భక్తులను అనుమతిస్తారు. 

ఆరుసార్లు దర్శనానికి బ్రేక్‌

శరన్నవరాత్రి ఉత్సవాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మొదటి రోజు సోమవారం అయితే ఉదయం 9 గంటల తరువాత దర్శనం ఉంటుంది. కాగా, ఆలయ ద్వారాలు తెరుచుకున్నాక ఆరు వేర్వేరు సమయాల్లో దర్శనానికి బ్రేకులు పడతాయి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే సమయాల్లో దర్శనానికి భక్తులను అనుమతించరు. ప్రతి నైవేద్యానికి 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొత్తంగా అరగంట వరకు దర్శనం నిలుపుదల చేస్తారు. రోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచాక అమ్మవారిని మేల్కొలుపుతారు. తొమ్మిది గంటలకు రాజభోగం సమర్పిస్తారు. అమ్మవారికి లడ్డు, పులిహోర, రవ్వకేసరి, చక్రపొంగలిని నైవేద్యంగా పెడతారు. ఈ సమయంలో 15 నిమిషాల పాటు దర్శనం నిలుపుదల చేస్తారు. మధ్యాహ్నం 12-1 గంటల మధ్యలో ప్రత్యేక నివేదన ఉంటుంది. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ప్రసాదాన్ని నివేదనగా పెడతారు. సాయంత్రం 6-7 గంటల మధ్య అమ్మవారికి మహానివేదన ఇస్తారు. ఇది సమర్పించడానికి ముందు ప్రధాన ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తారు. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి గంట సమయం పడుతుంది. అప్పటి వరకు దర్శనానికి అనుమతించరు. మహానివేదన అనంతరం పంచహారతులు ఇస్తారు. 

కనకదుర్గా నగర్‌లో ప్రసాదం

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న మెట్లమార్గం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మెట్లు దిగిన భక్తులు మహామండపం ముందు నుంచి కనకదుర్గానగర్‌లోకి రావాలి. ఈ ప్రదేశంలో పెర్గోలాకు పక్కన భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. 

ఐదు వీఐపీ పాయింట్లు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రముఖులు, వారి సిఫార్సులతో వచ్చే భక్తుల కోసం ఐదు పాయింట్లు ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, సబ్‌ కలెక్టర్‌, కార్పొరేషన్‌ కార్యాలయాలు, పున్నమిఘాట్‌, మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఈ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వాహనాల్లో ఓం మలుపు వరకు  తీసుకెళ్తారు. సిఫార్సులతో వచ్చిన వారంతా ఏయే పాయింట్ల వద్ద ఉన్నారో అక్కడే రూ.500 టికెట్‌ తీసుకోవాలి. ఆ టికెట్లు ఉన్నవారినే వాహనాల్లో కొండపైకి తీసుకెళ్తారు. ఇంద్రకీలాద్రిపై రాజగోపురానికి ముందు రెండు వరుసల్లో ఒక వీఐపీ క్యూను ఏర్పాటు చేశారు. పరిస్థితులను బట్టి వీఐపీ భక్తులను ఈ క్యూల్లోకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.











Updated Date - 2022-09-26T05:46:09+05:30 IST